కార్యకర్తగానే చనిపోతా... బుచ్చయ్య భావోద్వేగం

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.;

Update: 2025-07-08 03:37 GMT
కార్యకర్తగానే చనిపోతా... బుచ్చయ్య భావోద్వేగం

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్నారు. ఇప్పటికి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయనకు మాత్రం మంత్రి మోజు పెద్దగా తీరినది లేదు. అన్న గారికి ఎంతో ఇష్టుడైన వారు బుచ్చయ్య చౌదరి.

ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అన్న గారి చైతన్య రధం ఊరూరా ఉమ్మడి ఏపీలో తిరిగినపుడు గోదావరి జిల్లాలలో యువకుడుగా బుచ్చయ్య చౌదరి చురుకుగా పాల్గొంటూ ఎన్టీఆర్ మనసు గెలుచుకున్నారు. ఆయనకు అందుకే తొలి విడతలోనే టికెట్ దక్కింది. అలా ఎమ్మెల్యేగా పడుచు ప్రాయంలోనే 1983లో అసెంబ్లీలో అడుగు పెట్టిన బుచ్చయ్య చౌదరి 1985లోనూ మళ్లీ గెలిచారు. ఆయనకు ఎన్టీఆర్ ర్ కీలక పదవులు ఇచ్చారు. అయితే 1994లో ఆయనకు మంత్రి పదవి ముచ్చట తీరింది.

ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆ శాఖ చాలా కీలకంగా ఉండేది. కిలో రెండు రూపాయల బియ్యం పధకంతో పాటు అనేక పధకాలు ప్రవేశపెట్టడంతో పౌర సరఫరాల శాఖకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. దానిని కోరి మరీ బుచ్చయ్య చౌదరికి ఎన్టీఆర్ ఇచ్చారు.

అయితే కేవలం ఎనిమిది నెలలకే ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. దాంతో మంత్రి పదవి కూడా బుచ్చయ్యకు పోయింది. అయితే ఎన్టీఆర్ జీవించి ఉన్నంతవరకూ ఆయనతోనే ఉన్న బుచ్చయ్య ఆ తరువాత టీడీపీ జెండాను గౌరవిస్తూ చంద్రబాబుతో కలసి పనిచేశారు. ఇక ఆయన మరిన్ని సార్లు గెలిచినా బాబు కేబినెట్ లో మంత్రి కాలేకపోయారు.

దానికి సామాజిక వర్గ సమీకరణలే కారణం. బీసీలు కాపులకు తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పదవులు దక్కుతూండడం వల్ల కూడా ఆయనకు చాన్స్ రాలేదని చెప్పాలి. ఇక 2024లో మరోసారి గెలిచిన బుచ్చయ్యకు ఈసారి పదవి దక్కలేదు. అయితే ఆయన కంటే అనుచరులకు అభిమానులకు అది బాధగా ఉంది.

అందుకే బుచ్చయ్య తన మనసులో మాటను వారితోనే పంచుకున్నారు. తాజాగా రాజమండ్రిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే పార్టీలో నేను కార్యకర్తగానే ఉంటా కార్యకర్తగానే చనిపోతా అని కామెంట్స్ చేశారు.

అంతే కాదు పార్టీలో నాయకుల కంటే కార్యకర్తలే ముఖ్యం అని-బుచ్చయ్య చౌదరి అన్నారు. దాంతో ఆయన తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగానే ముగిద్దామని అనుకుంటున్నట్లుగా ఉందని అంటున్నారు. విస్తరణ జరిగినా సామాజిక సమీకరణల వల్లనే ఆయనకు చాన్స్ రాకపోవచ్చు అని అంటున్నారు. దాంతో పెద్దాయన తనకు కార్యకర్తగానే ఉండడం ఇష్టమని చెప్పేశారు.

ఇక ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై కేసుల ఉచ్చుబిగుస్తోందని తొందరలో జగన్‌ రాజమండ్రి జైలుకో చంచల్‌గూడ జైలుకో వెళ్తారని జోస్యం చెప్పారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతో బాగా పనిచేస్తోందని అయితే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

అలా ప్రభుత్వం గురించి సోషల్‌ మీడియాలో ఎవరైఅనా తప్పుగా మాట్లాడితే చీల్చి చెండాడండి అని బుచ్చయ్య చౌదరి క్యాడర్ కి సూచించడం గమనార్హం. అంతే కాదు తప్పుగా మాట్లాడే వారిని జైల్లో వేయిద్దామని ఆయన అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News