నువ్వెంత? నీ బతుకెంత?.. బీటెక్ రవిపై కడప ఎంపీ ఫైర్
కడప రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మీడియా సమావేశం తర్వాత ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది.
కడప రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మీడియా సమావేశం తర్వాత ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. వైఎస్ కుటుంబంలో మరణాలపై జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలుగా చెలామనీ అవుతున్న మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, పార్థసారధి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై ప్రతివిమర్శలు చేయడంతో రాజకీయం సెగలు పెట్టిస్తోంది. జగన్ రెడ్డి చేసిన విమర్శలు తిప్పికొట్టే క్రమంలో బీటెక్ రవి ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రతిస్పందించారు. పులివెందుల వైసీపీ కార్యకర్తల సమావేశంలో బీటెక్ రవిపై నిప్పులు చెరిగారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి డబ్బు కోసం పదవిని అమ్ముకునే స్థితి నుంచి ఇప్పుడు డబ్బుతో పదవిని కొనుక్కునే స్థితికి వచ్చాడని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి కనీస గౌరవం ఇవ్వకుండా బీ.టెక్ రవి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పులివెందులకు కన్నం వేసి ఇసుక, మగ్గురాళ్లు దోపిడి చేసి బతికే నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? అంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘నోరు జాగ్రత్తగా పెట్టుకో.. మర్యాదగా మాట్లాడు.. నీ బతుకు తెలిసి మాట్లాడటం మొదలుపెడితే.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో నువ్వెంత? నీ బతుకు ఎంత? అంటూ మండిపడ్డారు.
‘‘తాము అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న బీ.టెక్ రవి ఢిల్లీకి వచ్చి అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశాడని, తనకు రూ.12 కోట్లు ఇస్తే మండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పాడని అవినాశ్ రెడ్డి ఆరోపించారు. రూ.12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి కొనేవారు ఎవరూ వైసీపీలో లేరని తాము తిరస్కరించామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అలాంటి విధానాలకు వ్యతిరేకమని తేల్చిచెప్పారు. అప్పుడు అలా డబ్బు కోసం పదవిని అమ్ముకోడానికి ప్రయత్నించిన బీ.టెక్ రవి ఇప్పుడు ఇసుక, మగ్గురాయి అక్రమ తరలింపుతో కోట్లలో సంపాదిస్తున్నారని, అలా వచ్చిన డబ్బుతో ఎమ్మెల్సీ అవ్వాలని చూస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు.
మండలి చైర్మన్ మంచివారు!
పులివెందుల రాజకీయాలపై తీవ్రస్థాయిలో మాట్లాడిన ఎంపీ అవినాశ్ రెడ్డి శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ 20 మంది ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయించడానికి ప్లాన్ చేసిందన్నారు. ఒక్కొక్కరికి రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు చెల్లించడానికి చూశారు. వైసీపీ వారితో రాజీనామాలు చేయించి, టీడీపీ నేతలను ఎమ్మెల్సీలుగా చేయాలని అనుకున్నారు. మండలి చైర్మన్ మంచివారు కనుక వారి వ్యూహం పనిచేయలేదని వ్యాఖ్యానించారు ఎంపీ అవినాశ్ రెడ్డి.