'జూబ్లీహిల్స్'కు మ్యానిఫెస్టో.. ఇవ్వాలా? వద్దా?!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మరో 13 రోజుల్లో జరగనుంది. నవంబరు 11న పోలింగ్ డేట్‌ను ఎన్నికల సంఘం నిర్ణయించింది.;
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మరో 13 రోజుల్లో జరగనుంది. నవంబరు 11న పోలింగ్ డేట్‌ను ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి ముందు రోజు ఎలానూ ప్రచారానికి బంద్ కార్డు పడుతుంది. సో.. మొత్తంగా బుధవారం నుంచి 13 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. కీలక నాయకులు రంగంలోకి దిగారు. ప్రజలను తమవైపు కర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే.. పోటీ తీవ్రంగా ఉండడంతోపాటు.. స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది బరిలో ఉండడంతో ఓటు బ్యాంకుపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ ఎస్‌లు మల్లగుల్లాలు పడుతున్నాయి. ముఖ్యంగా.. కులాల ప్రాతి పదిక, మతాల ప్రాతిపదికన, యువత ప్రాతిపదికన కూడా.. ఓట్లు చీలే అవకాశం ఉంటుందని ప్రిడిక్షన్లు వస్తున్నాయి. ఇక, నిన్న మొన్నటి వరకు భారీ మెజారిటీల లెక్కలు వేసుకున్నా.. ఇప్పుడు గెలుపు గుర్రం ఎక్కడంపైనే పార్టీలు దృష్టి పెట్టాయి.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నికకు సంబంధించి కూడా మ్యానిఫెస్టో ఇచ్చే విషయంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టి నట్టు.. ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల సమయంలో మేం అధికారంలోకి వస్తే.. మీకు ఇవి చేస్తాం.. అవి చేస్తాం.. అని నాయకులు హామీలు ఇస్తారు. కానీ, ఇటీవల కాలంలో ఉప పోరులోనూ.. హామీల వరద కొనసాగుతోంది. గతంలో మునుగోడు లో జరిగిన ఉప ఎన్నికతోపాటు నల్లగొండ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక కూడా.. దీనికి ఉదాహరణ.
అప్పట్లో బీఆర్ ఎస్ పార్టీనే.. ఉప ఎన్నికలకు కూడా మ్యానిఫెస్టో ఇచ్చే సంస్కృతిని తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే. వ్యక్తిగతంగా ప్రజలకు మేలు చేసేందుకు.. మ్యానెఫెస్టో ఇవ్వడం ద్వారా.. పోటీలో నెలకొన్న అనివార్యతను తమ వైపు తిప్పుకొనేలా బీఆర్ ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇక, ఈ విషయం బయటకు పొక్కగానే.. కాంగ్రెస్, బీజేపీలు కూడా.. ఈ మ్యానిఫెస్టోలపైనే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అయితే.. ఇది వ్యక్తిగతంగానే ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే.. గెలిచిన అభ్యర్థి.. ఆయా హామీలను నెరవేర్చుతారన్న ధీమాను ప్రజల మధ్యకు తీసుకువెళ్లనున్నారు.