బీఆర్ఎస్‌కు నిధుల కొరత.. కారణం ఇదేనట..

రాజకీయాల్లో ఓటమి అనేది పార్టీలను చాలా వరకు కుంగదీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం పార్టీలోకి నిరాశ, నిస్పృహలు నిండిపోతాయి.;

Update: 2025-11-25 09:30 GMT

రాజకీయాల్లో ఓటమి అనేది పార్టీలను చాలా వరకు కుంగదీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం పార్టీలోకి నిరాశ, నిస్పృహలు నిండిపోతాయి. దీంతో పాటు ఆర్థిక ప్రవాహం కూడా నిలిచిపోతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. ఎన్నికలో కూలిపోయేది పార్టీ మాత్రమే కాదు.. దాన్ని నిలబెట్టే అంతర్గత వ్యవస్థలు, కార్యకర్తల నమ్మకం. వరుస ఓటములు, నాయకుల వలసలు, కేసీఆర్ ప్రజల్లో కనిపించకపోవడం ఇవన్నీ కలిసి బీఆర్ఎస్‌ను ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఇప్పుడు ప్రధాన చర్చ ఏంటంటే.. పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు వస్తాయా? అన్నదే.

గతంలో కంటే చాలా వరకు తగ్గిన నిధులు..

ఇటీవల బీఆర్ఎస్ కు వస్తున్న నిధుల కొరత ఘోరమైన సమాధానం చెప్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్‌కు వచ్చిన డొనేషన్లు మొత్తం రూ.580.52 కోట్లు. కానీ ఈ ఏడాది? ఆశ్చర్యంగా, ఆ మొత్తం నేరుగా రూ.15 కోట్లకు పడిపోయింది. ఇది కేవలం నిధులు తగ్గడమే కాదు.. పార్టీ భవిష్యత్తుపై పెట్టుబడిదారుల నమ్మకం పడిపోవడాన్ని ప్రతిభింబించే సంకేతం. రాజకీయాలకు ఆర్థిక స్థితి ఎంత కీలకమో తెలిసిన వారికి ఇది పెద్ద హెచ్చరిక అనుకోవచ్చు. కార్యకర్తల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ‘డబ్బు లేక పార్టీ ఎలా నడుస్తుంది?’ అన్న ఆందోళన బహిరంగంగా వినిపిస్తోంది.

వరుస ఓటములతో కష్టాలు..

వరుసగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుండడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఒకప్పుడు ‘అజేయం’గా భావించిన పార్టీ ఇప్పుడు వరుస పరాజయాలతో దెబ్బతింటుంది. ఓటమి రాజకీయాల్లో సహజం. కానీ ఇక్కడ సమస్య సంఖ్య కాదు.. నాయకుల వలసలు, కార్యకర్తల నిరాశ ఇవి బీఆర్ఎస్ ను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి. ఏ పార్టీకి అయినా నిధులు ఎప్పుడు వస్తాయి.. పార్టీ గెలుస్తుంది.. లేదంటే గెలిచే అవకాశం ఉంటుంది.. లేదా ప్రభుత్వంలో ఉండి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నిధుల ప్రవాహం తగ్గుతుంది..

ప్రజల్లో కనిపించని కేసీఆర్ ఒక కారణమేనా?

ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో కదులుతున్న మరో ప్రశ్న కేసీఆర్ ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు.. పార్టీ నాయకుల మధ్య, ఇంకా రాజకీయ విశ్లేషకుల మధ్య తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న ఇదే. ప్రజల్లో కనిపించకపోవడం, కార్యకర్తలకు ఉత్సాహం ఇవ్వకపోవడం, రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోవడం ఇవి బీఆర్ఎస్‌కు నష్టమే చేశాయి. నాయకత్వం కనిపించకపోతే, ప్రజలు మాత్రమే కాదు, పార్టీ పునాది కూడా ఆందోళనలో పడుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.

ఇది ఒకటే సమస్య కాదు..

కన్న కూతురే పార్టీని వీడి బయటకు రావడం పైగా కేసీఆర్ పార్టీపై విమర్శలు గుప్పించడం, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందన్న రూమర్లు ఇవి పార్టీ ఇమేజ్‌ను మసకబారుస్తున్నాయి. రూమర్ రాజకీయాల్లో ఎప్పుడూ నిజం కావాల్సిన అవసరం లేదు. కానీ అది చాలు పార్టీపై నమ్మకం తగ్గడానికి. ప్రస్తుతం బీఆర్ఎస్ అదే చీకటిలో కనిపించకుండా పోతోంది.

పార్టీకి నిధులు తగ్గిపోవడం కార్యకలాపాలపై ప్రభావం చూపుతుంది. కార్యాలయ ఖర్చులు, కార్యకర్తల ప్రోత్సాహకాలు, ఎన్నికల ప్రచారాలు ప్రతి స్థాయిలో డబ్బు కీలక ఆయుధం. అది లేకపోవడం అంటే పార్టీ యంత్రాంగం ఆగిపోయినట్లే. ఇప్పుడు బీఆర్ఎస్‌లో జరుగుతున్నదీ అదే. ‘ఇంకా కొంతకాలం ఇదే పరిస్థితి ఉంటే పార్టీ పునరుద్ధరణ కష్టమే’ అని చాలా మంది కార్యకర్తలు ఆంతర్యంలో మెదులుతుంది. ఇప్పుడున్న పరిస్థితి బీఆర్ఎస్‌కు ఒక పెద్ద ప్రశ్నను తెచ్చిపెడుతుంది. ఈ నిధుల కొరతతో పాటు నాయకత్వ లోపం, వరుస ఓటముల మధ్య పార్టీ మళ్లీ గాడిన పడగలదా?

రాజకీయాల్లో ఎదుగుదల ఒక పరీక్ష అయితే.. క్షీణత అత్యంత పెద్ద పరీక్ష. బీఆర్ఎస్ ప్రస్తుతం ఆ రెండో పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ పరీక్షను కేసీఆర్‌ ఎలా రాస్తారు? కొత్త నాయకత్వం ఎలా ముందుకు వెళ్తుంది? నమ్మకాన్ని తిరిగి ఎలా సాధిస్తారు? ఇవన్నీ రాబోయే నెలల్లో నిర్ణయాత్మకంగా మారబోతున్నాయి. అయితే అంతకుముందు పార్టీ ముందున్న అత్యవసర సమస్య ఒక్కటే

నిధులు తిరిగి రావాలి. నమ్మకం తిరిగి రావాలి. అవి లేకపోతే, ఉద్యమ పార్టీగా జన్మించిన బీఆర్ఎస్ తన చివరి దశలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన కూడా పార్టీ అంతర్గత వర్గాల్లో వినిపిస్తోంది.

Tags:    

Similar News