కేసీఆర్ వస్తే కానీ మార్పు రాదా? ఇప్పటికీ అధికారంలో ఉన్నట్లే కేటీఆర్ వ్యవహరిస్తున్నారా?

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రాజకీయంగా పట్టు సాధించాలంటే పార్టీ అధినేత కేసీఆర్ అడుగు పెట్టాల్సిందేనా? అన్న చర్చ జరుగుతోంది.;

Update: 2025-11-17 12:51 GMT

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రాజకీయంగా పట్టు సాధించాలంటే పార్టీ అధినేత కేసీఆర్ అడుగు పెట్టాల్సిందేనా? అన్న చర్చ జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత ఎర్రవెల్లి ఫాం హౌసుకు వెళ్లిపోయిన గులాబీ బాస్ ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలను పెద్దగా పట్టించుకోవడమే మానేశారన్న ఆవేదన బీఆర్ఎస్ కేడర్ లో వ్యక్తమవుతోంది. ఈ రెండేళ్లలో ఒకటి రెండు సార్లు మాత్రమే ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్.. కార్యకర్తలను సంతృప్తి పరచలేకపోయారని అంటున్నారు. పదమూడేళ్లు ఉద్యమం.. పదేళ్లు అధికారంలో ఉండగా, అధినేతతో బాగా కనెక్ట్ అయిన కార్యకర్తలు ఇప్పుడు ఆయన బయటకు రాకుండా ఉండిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటం వల్లే పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని, ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ హైకమాండ్ ఇప్పటివరకు చెబుతూ వస్తోంది. తగిన సమయం వచ్చినప్పుడు కేసీఆర్ తప్పకుండా వస్తారని కూడా ప్రచారం చేసింది. అయితే జూబ్లీహిల్స్ సిటింగు స్థానాన్ని కాపాడుకోవడం, ప్రభుత్వానికి రెఫరెండంగా ఈ ఎన్నికను ప్రకటించిన తర్వాత అయినా కేసీఆర్ ప్రచారానికి వస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలికి బలపం కట్టుకున్నట్లు ఒక ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ లో అసలు ఎలాంటి అంచనాలు లేని కాంగ్రెస్ పార్టీని 51 శాతానికి పైగా ఓట్లతో గెలిపించారని పరిశీలకులు కొనియాడుతున్నారు. సీఎం రేవంత్ కి చెక్ చెప్పేలా కేసీఆర్ వస్తే జూబ్లీహిల్స్ చేయిదాటి పోయేది కాదన్న విశ్లేషణలు వస్తున్నాయి. కేసీఆర్ వస్తే ఆ జోష్ వేరేగా ఉండేదని కార్యకర్తల అభిప్రాయంగా ఉంది. కానీ, కేసీఆర్ అసలు పట్టించుకోకపోవడం వల్ల జూబ్లీహిల్స్ కోల్పోవాల్సివచ్చిందని అంటున్నారు.

అయితే ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో ఇంతవరకు గెలవలేకపోయిందని, పార్లమెంటు ఎన్నికల్లో కనీసం ఒక్కసీటు కూడా తెచ్చుకోలేకపోవడం వల్ల పార్టీ పరిస్థితి దిగజారిందనే అభిప్రాయం విస్తృతంగా వ్యాపించిందని అంటున్నారు. ఇక స్థానిక ఎన్నికలు జరిగితే మెజార్టీ సీట్లు గెలుచుకుని మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేయొచ్చని అంచనా వేస్తే.. కోర్టు తీర్పుతో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయని అంటున్నారు. ఇదే సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధినేత గైర్హాజరీతో మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందనే ఆవేదన వ్యక్తమవుతోంది.

గత రెండేళ్లుగా జరిగిన పరిణామాలను గమనిస్తే కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయితే కానీ, పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పార్టీ కోసం రెక్కలు అరిగేలా కష్టపడుతున్నా, ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పొందలేకపోతున్నారని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నిరూపించాయని అంటున్నారు. ఆ ఇద్దరిపై నమ్మకం ఉంచి పార్టీని అప్పగిస్తే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కనీసం పోటీ పెట్టలేకపోయారన్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు. మరోవైపు ఇద్దరినీ మాజీ ఎమ్మెల్సీ కవిత టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం వల్ల పార్టీ పరపతి క్షీణిస్తోందని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో అధినేత కేసీఆర్ అడుగు పెడితే కానీ పరిస్థితిలో మార్పు రాదని ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. కవిత నోటికి తాళం వేయాలన్నా.. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ చెప్పాలన్నా కేసీఆర్ ప్రధాన రాజకీయ స్రవంతిలో మళ్లీ యాక్టివ్ అవ్వాల్సివుంటుందని అంటున్నారు. అధినేత వస్తే.. కేడర్ లో కూడా ఉత్సాహం వస్తుందనే అభిప్రాయం ఉందని అంటున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో అయినా కేసీఆర్ చొరవ తీసుకోకపోతే.. జూబ్లీహిల్స్ ఫలితాలు రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.

Tags:    

Similar News