ఉత్తరాంధ్రలో ప్రజల మాట ఇదే... బొత్సా ఝాన్సీ నమ్మకం అదే!

ఇదే విషయాన్ని ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు బల్లగుద్ది చెబుతున్న విషయం తెరపైకి వచ్చింది.

Update: 2024-04-25 05:19 GMT

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు, వాటి అమలుతో పాటు.. ప్రధానంగా విద్యపై జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారనేది తెలిసిన విషయమే. ప్రధానంగా పేదల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను జగన్ పూర్తిగా రూపు మార్చేశారు. ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశ పెట్టారు. గతంలో ఎన్నడూ చూడని మార్పులు జగన్ చేపట్టారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు బల్లగుద్ది చెబుతున్న విషయం తెరపైకి వచ్చింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా... తాము చేసిన అభివృద్ధి గురించి ఆయా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చెప్పుకోవడం తెలిసిందే. అందులో వాస్తవాస్తవాలు ఎంతనేది ప్రజలకు ఎరుకే. అయితే... ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులతో స్వయంగా ప్రజలే ఎదురెళ్లి... ఈ ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన మేలులను, విద్యార్థుల జీవితాల్లో కలిగిన మార్పులను వివరించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ అరుదైన ఘటన తాజాగా ఉత్తరాంధ్రలో జరిగింది.

అవును... ఉత్తరాంధ్ర అంటే... విద్యా నిలయంగా చెబుతారు. ఇక్కడ నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కువ మంది పోటీ పడుతుంటారు.. సాధిస్తుంటారు. అందుకు అవసరమైన వనరులన్నీ వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు అందుతున్నాయని చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో జగనన్న విద్యా పథకాలు అద్భుత ఫలితాలిస్తున్నాయని అంటున్నారు. ఫలితంగా... ఎంతోమంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలో... జగనన్న "విద్యా దీవెన" పేరుతో ఫీజు రీయంబర్స్ మెంట్, జగనన్న "వసతి దీవెన", జగనన్న "గోరు ముద్ద", జగనన్న "అమ్మ ఒడి", జగనన్న "విద్యా కానుక", "నాడు - నేడు" పేరుతో పాఠశాలల రూపు రేఖలే మార్చేసింది ఈ ప్రభుత్వం. ఒక్కమాటలో చెప్పాలంటే... విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనే చెప్పాలి!

Read more!

దీంతో... విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వైసీపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీ ఎక్కడికి వెళ్లినా జగనన్న విద్యా పథకాలే ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాల గురించి పేరుపేరునా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్పందిస్తున్న విద్యార్థుల తల్లితండ్రులు... జగనన్న దయ వల్ల తమ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారని ఆనందంగా చెబుతున్నారు.

ఇదే సమయంలో... తమకున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా లక్షల రూపాయలు పోసి, మంచి మంచి కాలేజీల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువులు చదివించలేమని.. అయితే జగన్ పథకాల వల్ల అది సాధ్యమైందని.. అందుకే కృతజ్ఞతగా ఓటు వేసి వైఎస్ జగన్ రుణం తీర్చుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న దృశ్యాలు అడుగడుగునా కనిపిస్తుండటం గమనార్హం!

ఈ క్రమంలో ఈ విషయాలపై స్పందించిన బొత్సా ఝాన్సీ... మీ ఇంట్లో జగనన్న సంక్షేమ పథకాల వల్ల మేలు జరిగితే వైసీపీ పార్టీకి ఓటు వేయమని కోరుతున్నారు. తనని గెలిపిస్తే సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా అందేలా చూస్తానని హామీ ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆడపడచుగా వచ్చాను.. మీ కష్టాల్లో ఆదుకుంటాను.. మీ వెన్నంటే ఉంటాను అంటూ బొత్సా ఝాన్సీ ప్రజలకు హామీ ఇస్తున్నారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందగుడు వేస్తున్నారు.

ఇలా తమ ప్రభుత్వంలో అమలైన పథకాల గురించి.. ప్రజలకు జరిగిన మేలుల గురించి.. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నేతలు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా.. లబ్ధిదారులే ఎదురొచ్చి ఈ ప్రభుత్వంలో తమకు జరిగిన మేలుల గురించి చెప్పడంతో... విశాఖ పార్లమెంటు స్థానంలో గెలుపు తనదేనంటూ ధీమాగా, నమ్మకంగా చెబుతున్నారు బొత్సా ఝాన్సీ!

Tags:    

Similar News