వారసులతో మెరిసిన బొత్స !

ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొత్స కుమారుడు సందీప్ కుమార్తె అనూష నాయకత్వం వహించడం కూడా మరో విశేషం.

Update: 2026-06-09 04:17 GMT

వైసీపీలో కీలక నేత శాసనమండలి లో విపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ తొలిసారి తన సొంత గడ్డ మీద వారసులతో మెరిసారు. దాంతో భవిష్యత్తులో తన తరఫున రాజకీయంగా ముందుకు వచ్చేది వారే అని క్యాడర్ కి స్పష్టం చేశారు అన్న మాట. వైసీపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు కూటమి రెండేళ్ళ పాలన మీద నిరసన కార్యక్రమాన్ని బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లి లో ఘనంగా నిర్వహించారు. గరివిడిలో జరిపిన ఈ కార్యక్రమంలో బొత్సతో పాటు వేదిక పైన ఆయన పక్కన కుమారుడు బొత్స సందీప్ కుమార్తె బొత్స అనూష పాల్గొనడం విశేషం. వీరే ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా మారారు.

వారిదే నాయకత్వం :

ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొత్స కుమారుడు సందీప్ కుమార్తె అనూష నాయకత్వం వహించడం కూడా మరో విశేషం. వారి కనుసన్నలలోనే వైసీపీ నియోజకవర్గం స్థాయి కార్యక్రమాలు సాగడం భవిష్యత్తు వైసీపీ రాజకీయాలకు సంకేతం అని అంటున్నారు.

నిరంతరం పోరాటం :

కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేకమైన పాలన పట్ల నిరంతరం వైసీపీ పోరాటం చేస్తుందని బొత్స ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయారని బొత్స విమర్శించారు. అంతే కాదు రెండేళ్ళ కూటమి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను వారి ముందే పెట్టి వారి మద్దతుని తీసుకుని ఉద్యమిస్తున్నామని అన్నారు. తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని అన్నారు.

నాన్న డైరెక్షన్లోనే :

ఇక అందరి దృష్టి ఈ సమావేశంలో బొత్స కుమారుడు కుమార్తె ప్రసంగాల మీదనే ఫోకస్ యైంది. ఈ సందర్భంగా బొత్స సందీప్ మాట్లాడుతూ, నాన్న బొత్స సత్యనారాయణ డైరెక్షన్ లో ఆయన సలహా సూచనలతో తాము ప్రజల తరఫున పోరాటం చేస్తామని సందీప్ చెప్పారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు సంక్షేమం, రైతులకు భరోసా, పేదలకు అభివృద్ధి అనే పేరుతో ఎన్నో హామీలని కూటమి పెద్దలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆ హామీలు ఎంతవరకు అమలయ్యాయో ప్రజలే పరిశీలించాలని అన్నారు అందువల్లనే ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యతగా తాము తీసుకున్నామని అన్నారు.

ఎమ్మెల్యేగా పోటీకి :

ప్రజల తరఫున నిలబడి వారి గొంతుకగా పనిచేయడం వైసీపీ నాయకులుగా తమ కర్తవ్యం అని చెపారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వారి పక్షాన పోరాడేందుకు నాన్న బొత్స సత్యనారాయణ గారి సూచనలతో తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సందీప్ చెప్పడం ద్వారా ఫుల్ టెర్మ్ పాలిటిక్స్ కి రెడీ అన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అదే విధంగా బొత్స కుమార్తె అనూష సైతం వైసీపీని చీపురుపల్లిలో గట్టిగా నిలబెట్టేందుకు తాము అంతా ముందుకు వచ్చి పనిచేస్తామని అన్నారు. మరి ఒకేసారి కుమార్తె కుమారుడు ఇద్దరూ వేదిక మీద కనిపించారు. ఇద్దరూ ఉత్సాహంగానే ఉన్నారు. వీరిలో ఎవరు 2029 లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అన్నదే చూడాల్సి ఉంది అని పార్టీలో చర్చ సాగుతోంది.

Tags:    

Similar News