జగన్ రాయరు... బొత్స రాస్తున్నారు !

ఏపీలో అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీల మధ్య ఉప్పు నిప్పులా వ్యవహారం ఉంటుంది అన్నది తెలిసిందే.;

Update: 2025-08-07 03:42 GMT

ఏపీలో అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీల మధ్య ఉప్పు నిప్పులా వ్యవహారం ఉంటుంది అన్నది తెలిసిందే. అది ఈ రోజున కాదు 2014 నుంచి అలాగే పరిస్థితి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ విపక్షాన్ని లెక్క చేయదు, విపక్షంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న వారిని పట్టించుకోదు. ఇల జగన్ చంద్రబాబుల మధ్య రాజకీయం సాగుతూనే ఉంది. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు జగన్ ని విపక్ష నేతగా గౌరవించలేదని వైసీపీ ఆరోపిస్తుంది. అదే జగన్ సీఎం గా ఉంటే బాబుకి గౌరవం ఇవ్వలేదని టీడీపీ అంటుంది.

ఎదురుబొదురు సైతం లేదు :

ముఖ్యమంత్రి విపక్ష నాయకుడు ఎదురుబొదురుగా కలిసినది కూడా ఎపుడూ పెద్దగా లేదు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగానే గతంలో కలిసేవారు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. దాంతో ఆ విధంగానూ ఎవరూ కలుసుకునే చాన్స్ లేదని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రికి ప్రజా సమస్యల మీద లేఖలు రాయడం అన్నది విపక్షాలు చేస్తూ ఉంటాయి. కానీ ఆనాడూ ఈనాడూ ఏపీలో అది లేదు.

బాబు లేఖలు వారికే :

ఇక చంద్రబాబు విపక్షంలో ఉన్నపుడు లేఖలు రాసేవారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీకి ఉద్దేశిస్తూ ఆయన లేఖలు రాస్తూ ఉండేవారు. అంతే తప్ప సీఎం గా జగన్ కి మాత్రం రాసేవారు కాదని చెబుతారు. జగన్ అయితే అసలు లేఖలు రాసే సంప్రదాయం అన్నది అనుసరించడంలేదు. ఆయన ఏమి చెప్పాలనుకున్నా మీడియా ముఖంగానే చెబుతారు. అక్కడ నుంచే డిమాండ్లు పెడతారు. అదే విధంగా జనం మధ్య నుంచి తన డిమాండ్లను వినిపిస్తారు.

బొత్స లేఖలు మొదలు :

అయితే వైసీపీలో ఆ బాధ్యతను సీనియర్ నాయకుడు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ తీసుకున్నారులా ఉంది. ఆయన నేరుగా సీఎం కే లేఖలు రాస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇట్లు శాశన మండలిలో ప్రధాన ప్రతీపక్ష నాయకుడు అంటూ బొత్స లేఖలు సంధిస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రకే అతి పెద్ద ఆరొగ్య కేంద్రంగా ఉన్న కేజీహెచ్ లో పరిస్థితుల మీద బొత్స సీఎం కి లేఖ రాశారు. కేజీహెచ్ కి నిధులు మంజూరు చేసి అక్కడ అవసరం అయిన వైద్య పరికరాలు ఉండేలా చూడాలని బొత్స కోరారు.

దత్తన్న మాదిరిగానా :

ఉమ్మడి ఏపీలో సీనియర్ బీజేపీ నేతగా అప్పట్లో బండారు దత్తాత్రేయ ప్రభుత్వానికి లేఖలు రాసేవారు. ఎవరు సీఎం గా ఉన్నా ప్రజా సమస్యల మీద లేఖలు సంధిస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆయన రికార్డు స్థాయిలో లేఖలు రాసిన వారుగా పేరు తెచ్చుకున్నారు. బొత్స ఇపుడు ఆ మాదిరిగా తన హుందాతనానికి పెద్దరికానికి పదును పెడుతున్నారా అన్న చర్చ వస్తోంది . వైసీపీలో చూస్తే కేబినెట్ ర్యాంక్ లో ఉన్న్ ఏకైక నాయకుడిగా బొత్స ఉన్నారు దాంతో ఆయన ప్రతిపక్ష పాత్రను ఈ విధంగా రాణింపునకు తేవాలని అనుకుంటున్నారులా ఉంది అంటున్నారు. ఏది ఏమైనా లేఖల ద్వారా అయినా సమస్యలు పరిష్కారం అయితే అంతే చాలు అన్నది జనంలో ఉన్న మాట.

Tags:    

Similar News