'నన్ను అంతమొందించే కుట్ర' బొత్స కీలక వ్యాఖ్యలు
విజయనగరం అమ్మవారి సంబరాలు సందర్బంగా చోటు చేసుకున్న ఘటనలను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.;
విజయనగరం అమ్మవారి సంబరాలు సందర్బంగా చోటు చేసుకున్న ఘటనలను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. గ్రామ దేవత ఉత్సవాల సందర్భంగా తాను ఈ విషయం అప్పుడు మాట్లాడలేదని, పండగ ముగియడంతో ఈ విషయంపై మాట్లాడుతున్నానని చెప్పిన బొత్స జిల్లా అధికారులు, కూటమి నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తనను అంతం చేసే కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేతను అవమానించాలనే ఆలోచనే ఎక్కువగా కనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు జిల్లా అధికారులు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. అమ్మవారి ఉత్సవాలకు తాను వస్తున్నానని ముందుగా సమాచారం ఇస్తే కనీస ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిమాను సంబరం తిలకించేందుకు కేటాయించిన వేదిక కూలిపోయిందని, తమ పార్టీ ఎమ్మెల్సీ సురేశ్ బాబుతోపాటు మరికొందరికి గాయాలు అయ్యాయని బొత్స తెలిపారు. సిరిమాను ఉత్సవంలో అధికారులు ద్వంద్వ ప్రమాణాలు పాటించారని ధ్వజమెత్తారు బొత్స. అందరి కోసం కాకుండా ఏ ఒక్కరి కోసమో పండగ నిర్వహించారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేవారు.
ఇక ఆర్భాటం, అహంకారమే తప్ప సంప్రదాయాలకు పెద్దగా విలువ ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు ఒక్కో ఆఫీసులో ఒక్కో హుండీ పెట్టి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో ఇలాంటి సంప్రదాయం ఎక్కడైనా ఉందా? అంటూ ఆయన నిలదీశారు. పండగ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపించిందని మండిపడ్డారు. గతంలో పండగ విషయంలో నీతులు చెప్పిన గోవా గవర్నర్ ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని ప్రశ్నించారు.
‘‘నాకు కేటాయించిన వేదిక కూలిపోయింది. నన్ను అవమానించాలనా, లేక అంతమొందించాలన్న కుట్రతో జరిగిందా అన్నది నాకు తెలియాలి’’ ప్రోటోకాల్ పాటించాలన్న బాధ్యత మీకు తెలియదా అంటూ బొత్స అధికారులను నిలదీశారు. దీని వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని, తనకు జరిగిన అవమానంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
కాగా, విజయనగరం పండగ సందర్భంగా వైసీపీ కీలక నేత, మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న బొత్సకు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున షాక్ ఇచ్చారు. బొత్స గత 30 ఏళ్లుగా ఉత్సవాలు తిలకించేందుకు వాడుకుంటున్న డీసీసీబీ వేదికపైకి రాకుండా అడ్డుకున్నారు. ఇది తన సీరియార్టీని అవమానించడమేనని భావించిన బొత్స ఉత్సవాల ముందు నుంచి రగిలిపోతూనే ఉన్నారు. ఇక పండగ సందర్భంగా అధికార పార్టీ నేతలు హవా ప్రదర్శించడం, బొత్స మార్కు ఎక్కడా కనిపించకుండా చేయడంతో ఆయన మరింత ఆగ్రహానికి లోనరయ్యారని అంటున్నారు. ఈ కారణంగానే ఆయన ఎప్పుడూ లేనట్లు పండగ విషయంలో మీడియాతో మాట్లాడరని చెబుతున్నారు.