రూమ్ నెం 315.. 27 రోజులు.. బోండీ ఉగ్రవాదులు ఏమి చేశారంటే..!
ఈ క్రమంలో వీరిద్దరూ సుమారు 27 రోజుల పాటు ఫిలిప్పీన్స్ లోని దావో నగరంలో ఓ సాధారణ హోటల్ లో ఏమి చేశారనే విషయం ఆ హోటల్ సిబ్బంది మీడియాకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.;
ఆస్ట్రేలియాలోని బోండి బీచ్ లో 15 మంది పౌరులను చంపి, సుమారు 30 మంది పౌరులను గాయపరిచిన తండ్రికొడుకులైన ఇద్దరు ఉగ్రవాదులు సాజీద్ అక్రం, నవీద్ అక్రం నవంబర్ లో ఫిలిపీన్స్ లో పర్యటించారనే విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ సుమారు 27 రోజుల పాటు ఫిలిప్పీన్స్ లోని దావో నగరంలో ఓ సాధారణ హోటల్ లో ఏమి చేశారనే విషయం ఆ హోటల్ సిబ్బంది మీడియాకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.
అవును... బోండీ బీచ్ లో అరాచకం సృష్టించిన ఉగ్ర తండ్రికొడుకుల వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉగ్రదాడికి ముందు ఫిలిప్పీన్స్ లో.. తండ్రి సాజిద్ ఇండియన్ పాస్ పోర్ట్ తోనూ, కొడుకు నవీద్ ఆస్ట్రేలియా పాస్ పోర్టు తోనూ పర్యటించారు. ఈ క్రమంలో హోటల్ ‘జీవీ హోటల్’ లో వీరిద్దరూ రోజుకి 24 డాలర్లకు (సుమారు రూ.2,100) రూమ్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా వీరిద్దరూ ఈ హోటల్ లో 27 రోజులు ఎలా గడిపారో జీవీ హోటల్ ఉద్యోగులు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. ఇందులో భాగంగా... దావో డౌన్ టౌన్ లోని సిటీ హాల్, పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న లో-బడ్జెట్ హోటల్ లో ఇద్దరూ చెక్-ఇన్ చేశారని.. ఫిలిప్పీన్స్ లో ఉన్నన్ని రోజులూ ఈ హోటల్ లోనే ఉన్నారని తెలిపారు! నవంబర్ 1 న వీరిద్దరూ చెక్-ఇన్ చేయగా.. అదే నెల 28న చెక్ అవుట్ చేశారని వెల్లడించారు.
ఈ క్రమంలో రూమ్ నెంబర్ 315 గదిలో వీరిద్దరూ దిగారని.. అందులో రెండు సింగిల్ బెడ్ లు, ఒక టీవీ, ఒక బేసిక్ బాత్ రూమ్ మాత్రమే ఉంటుందని అన్నారు. ఇక నిందితులు ఇద్దరూ రోజంతా గదిలోనే ఉండేవారని.. రోజుకు కేవలం ఒకటి నుంచి రెండు గంటలు మాత్రమే బయటకు వెళ్లి వచ్చేవారని.. అందువల్ల వాళ్లు నగరాన్ని వదిలి వెళ్లలేదని కచ్చితంగా చెప్పగలమని హోటల్ మేనేజర్ జెనెలిన్ చెబుతున్నారు.
చెక్ ఇన్ సమయంలో ఫిలిప్పీన్స్ లో రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ నే ఇచ్చారని చెప్పిన హోటల్ సిబ్బంది.. హోటల్ గది నుంచి బయటకు అడుగుపెట్టినప్పుడల్లా సాజిద్ ఎల్లప్పుడూ సన్ గ్లాసెస్ ధరించడం గమనించినట్లు తెలిపారు. వారిద్దరూ ఎప్పుడూ సిబ్బంది, ఇతర అతిథులతో మాట్లాడలేదని అన్నారు. తొలుత వారానికే గదిని బుక్ చేసుకోగా.. అది కాస్తా వారం వారం పొడిగించి సుమారు 4 వారాల వరకూ ఉన్నారని అన్నారు.
అయితే.. సీసీటీవీ ఫుటేజ్ వారం పాటు మాత్రమే రికార్డింగ్ బ్యాక్ అప్ ఉండటం వల్ల ఇప్పుడు అందుబాటులో లేదని తెలిపారు. అయినప్పటికీ.. సైనిక సిబ్బంది వచ్చి హోటల్ నుంచి హార్డ్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక ఫుడ్ విషయానికొస్తే రెగ్యులర్ గా ఫ్రైడ్ చికెన్, బర్గర్లు ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకుని తినేవారని.. హౌస్ కీపింగ్ సిబ్బందికి ఆ గదిలో అవి తప్ప మరేవీ కనిపించేవి కావని వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన ఫిలిప్పీన్స్ నేషనల్ పోలీస్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ జోస్ మెలెన్సియో నార్టాటేజ్ జూనియర్... బోండీ బీచ్ లోని ఉగ్రవాదులు సందర్శించిన ప్రదేశాలు, సంభాషించిన వ్యక్తులు, బస చేసిన చోటు అన్ని దర్యాత్పు చేస్తున్నట్లు తెలిపారు. అయితే... ఫిలిప్పీన్స్ లో వారు ఉగ్రవాద శిక్షణ తీసుకుని ఉంటారనే వాదనను మాత్రం తిరస్కరిస్తున్నారు.