బోయింగ్‌ ఇంధన స్విచ్‌లపై ముందే హెచ్చరికలు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ విమానాల్లోని ఇంధన స్విచ్‌లపై తీవ్ర చర్చ మొదలైంది.;

Update: 2025-07-15 12:42 GMT

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నేపథ్యంలో బోయింగ్‌ విమానాల్లోని ఇంధన స్విచ్‌లపై తీవ్ర చర్చ మొదలైంది. ఇటీవల వెలువడిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం.. జూన్ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం రెండు ఇంజిన్లకు ఒక్కసారిగా ఇంధన సరఫరా ఆగిపోవడమేనని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనతో బోయింగ్‌ విమానాల్లోని ఇంధన స్విచ్‌లపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇదే సమయంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన పౌర విమానయాన అథారిటీ (CAA) ఇచ్చిన పాత హెచ్చరికలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మే 15న అంటే అహ్మదాబాద్‌ ప్రమాదానికి దాదాపు నలభై రోజుల ముందు.. బ్రిటన్‌ సీఏఏ బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌తో పాటు ఐదు రకాల బోయింగ్‌ విమానాల్లోని ఇంధన షట్‌ఆఫ్‌ వాల్వ్‌ యాక్టువేటర్లపై భద్రతా నోటీసును జారీ చేసింది.

అంతేకాకుండా, అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) విడుదల చేసిన ఎయిర్‌వర్తినెస్ డైరెక్టివ్ (AD) లోనూ ఇదే అంశంపై స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి. దీనిని అనుసరించి ఆయా విమానాల్లో ఇంధన షట్‌ఆఫ్‌ వాల్వ్‌లను నిత్యం తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ పరిణామాలపై భారత డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) కూడా స్పందించింది. దేశీయ ఎయిర్‌లైన్స్‌ వద్ద ఉన్న బోయింగ్‌ 787, 737 మోడళ్ల విమానాల్లో ఇంధన స్విచ్‌ల లాకింగ్‌ వ్యవస్థలను పర్యవేక్షించాలని, పూర్తిస్థాయిలో తనిఖీలు జరిపి సంబంధిత నివేదికలను డీజీసీఏకు సమర్పించాలని ఆదేశించింది.

ఈ ఘటనతో బోయింగ్‌ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాయి. అంతర్జాతీయ విమానయాన రంగం లోపాలను పట్టించుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ప్రమాదం మరోసారి స్పష్టం చేస్తోంది. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ దుర్ఘటన గుర్తుచేస్తుంది.

Tags:    

Similar News