బ్లాక్ టైగర్.. ఈ అరుదైన పులి కథేంటి?
బ్లాక్ టైగర్ ఎప్పుడైనా చూశారా? సినిమాల్లో ప్రతినాయుడి పాత్రను గొప్పగా చెప్పడానికి ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు.
బ్లాక్ టైగర్ ఎప్పుడైనా చూశారా? సినిమాల్లో ప్రతినాయుడి పాత్రను గొప్పగా చెప్పడానికి ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. కానీ, బ్లాక్ టైగర్ నిజంగా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రపంచంలో ఏకైక ప్రాంతంలో మాత్రమే నల్ల పులులు ఉన్నాయి. అదికూడా మన భారతదేశంలో.. మన పక్కరాష్ట్రంలో నల్ల పులులు ఉన్నాయనే విషయం ఎందరికి తెలుసు? ఈ నల్ల పులి విశేషాలను వివరిస్తూ ఐఎఫ్ఎస్ అధికారి హిమాన్షు చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అంతరించిపోతున్న జాతులలో నల్ల పులి కూడా ఉందన్న కఠోర వాస్తవాన్ని వివరిస్తూ హిమాన్షు చేసిన ట్వీట్ తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ఐఎఫ్ఎస్ అధికారి హిమాన్షు త్రిపాఠి ‘ఎక్స్’లో షేర్ చేసిన నల్ల పులుల ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఒడిశా అడవుల్లో 'కృష్ణ పులులు'
దేశంలో ఎన్నో పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. కానీ, ప్రపంచంలో అరుదైన నల్ల పులులు కేవలం మన పొరుగునే ఉన్న ఒడిశాలో సిమ్లిపాల్ నేషనల్ పార్క్ లో మాత్రమే కనిపిస్తాయి. చూడటానికి రాయల్ బెంగాల్ టైగర్ మాదిరిగా భారీ దేహంతో ఉండే నల్ల పులుల శరీరంపై నల్లటి చారలు సాధారణ పులుల కంటే భిన్నంగా చాలా వెడల్పుగా ఉంటాయి. ఆ చారలన్నీ ఒకదానికొకటి కలిసిపోయి ఉండటం వల్ల దూరం నుంచి చూస్తే ఇవి పూర్తిగా నల్లటి కోటు వేసుకున్నట్లు కనిపిస్తాయి.
ఎందుకీ వింత రంగు?
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం నల్ల పులలకు జన్యుపరమైన మార్పుల కారణమని చెబుతున్నారు. పులుల చర్మంపై రంగును నిర్దేశించే టాక్ పెప్ అనే ప్రత్యేక జన్యువులో వచ్చిన లోపం వల్లే ఈ నల్లటి రంగు ఏర్పడుతుందని వివరిస్తున్నారు. ఇక హిమాన్షు తన ట్వీట్‌లో ప్రస్తావించినట్లు ఈ పులుల అందం వెనుక ఒక తీరని విషాదం, ఆందోళన దాగి ఉన్నాయి. ఇన్‌బ్రీడింగ్ డిప్రెషన్ వల్ల అంటే సిమ్లిపాల్ అడవులకు, బయటి ఇతర అడవులకు మధ్య కనెక్టివిటీ పూర్తిగా తెగిపోవడం వల్ల పులుల సంతతి తగ్గిపోతోందని చెబుతున్నారు. ఇక్కడున్న నల్ల పులులు బయటి ప్రాంతాల పులులతో కాకుండా, దశాబ్దాలుగా తమ సొంత వంశానికి చెందిన పులులతోనే సంపర్కం జరుపుతున్నాయంటున్నారు. ఒకే రక్తం, ఒకే జీన్స్ ఉన్న పులుల మధ్యే సంతానోత్పత్తి జరగడం వల్ల రానురాను వీటి రోగనిరోధక శక్తి దారుణంగా పడిపోతోందని చెబుతున్నారు. జన్యు వైవిధ్యం లోపించి, ఈ అరుదైన నల్ల పులుల తదుపరి సంతతి పూర్తిగా బలహీనంగా, రోగాల బారిన పడి అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.
ఈ కఠోర వాస్తవాన్ని గుర్తించిన ఒడిశా అటవీ శాఖ నల్ల పులుల జీన్స్‌ను బలోపేతం చేసేందుకు కొత్త రక్తాన్ని పరిచయం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల ఇతర అడవుల నుంచి తీసుకొచ్చిన కొత్త పులులను సిమ్లిపాల్ అడవుల్లోకి వదిలినట్లు చెబుతున్నారు. బయటి నుంచి వచ్చిన ఈ కొత్త పులులతో సంపర్కం జరగడం ద్వారా పుట్టబోయే తదుపరి తరం పులులలో జన్యు వైవిధ్యం పెరిగి, అవి మరింత ఆరోగ్యంగా, బలంగా మారుతాయని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.