కమిటీలన్నీ ఖాళీ అయిపోతున్నాయా ?

ఇప్పుడు విషయం ఏమిటంటే స్క్రీనింగ్ కమిటి ఛైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు.

Update: 2023-11-06 05:21 GMT

ఎన్నికలు దగ్గరపుడుతన్న నేపధ్యంలో తెలంగాణా బీజేపీలో కమిటీలన్నీ ఖాళీ అయిపోతున్నాయా ? కమిటీలు పనికూడా మొదలుపెట్టకుండానే నిస్తేజం ఆవహించేస్తున్నాయా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కీలకమైన నాలుగు కమిటీలకు ఛైర్మన్లు లేరు. ఒకటి అరా కమిటీలకు ఛైర్మన్లు ఉన్నా ఎలాంటి ఉపయోగాలు కనబడటంలేదు. దాంతో ఏమిచేయాలో అగ్రనేతలకు అర్ధంకాక తలపట్టుకున్నారు. ఇప్పటికిప్పుడు కమిటీలను భర్తీచేయలేక, ఛైర్మన్లు లేని కమిటీలతో భేటీలు నిర్వహించలేక రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిక్కులు చూస్తున్నారు.

ఇప్పుడు విషయం ఏమిటంటే స్క్రీనింగ్ కమిటి ఛైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఆయన తర్వాత మ్యానిఫెస్టో కమిటి ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కో ఆర్డినేషన్ కమిటి ఛైర్మన్ నల్లు ఇండ్రసేనారెడ్డికి త్రిపుర గవర్నర్ పదవి రావటంతో ఆయన వెళ్ళిపోయారు. ఆజిటేషన్ల కమిటి ఛైర్ పర్సన్ విజయశాంతి ఇప్పటివరకు బాధ్యతలు తీసుకోలేదు. పైగా ఈమె కూడా పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోతారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

Read more!

ముందుజాగ్రత్తగా కమిటీలకు పార్టీ ఛైర్మన్లతో పాటు కన్వీనర్లను కూడా నియమించింది. అయితే కన్వీనర్లు కూడా ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేదు. మ్యానిఫెస్టో కమిటీకి జాయింట్ కన్వీనరైన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యవహారం కూడా అనుమానంగానే ఉంది. పైగా ఆయన కూడా కమిటిని పట్టించుకోవటంలేదు. మ్యానిఫెస్టో కమిటి కో కన్వీనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పూర్తిస్ధాయి బాధ్యతలు తీసుకోమని పార్టీ కోరింది. అయితే అందుకు ఆయన నిరాకరించి తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైపోయారు.

పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మ్యానిఫెస్టో లేకుండానే అభ్యర్ధులు ఎన్నికలకు వెళ్ళే అవకావాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కేంద్రప్రభుత్వ విధానాలనే మ్యానిఫెస్టోగా చెప్పుకోవాలని కిషన్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటి ఛైర్మన్ గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. అయితే ఈయన తన కొడుకు పోటీచేస్తున్న మహబూబ్ నగర్ నియోజకవర్గానికే పూర్తిగా పరిమితమైపోయారు. పార్టీ నియమించిన ఏ కమిటి కూడా సరిగా పనిచేయటంలేదు. ఎందుకంటే కమిటీల ఛైర్మన్లు లేకపోవటమో లేకపోతే యాక్టివ్ గా లేకపోవటమే కారణం.

Tags:    

Similar News