మమతది ధైర్యమా భయమా ?

ఇదిలా ఉంటే బెంగాల్ లో సర్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ బీజేపీ మీద మండిపడుతున్నారు. బెంగాల్ బీహార్ కాదని ఆమె అంటున్నారు.;

Update: 2025-12-12 02:30 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హ్యాట్రిక్ సీఎం అన్నది తెలిసిందే. 2011 నుంచి ఆమె అధికారంలో కొనసాగుతున్నారు. బలమైన వామపక్షాల కోటను ఆమె కూల్చారు సీపీఎం వృద్ధ నేత జ్యోతీబసుతో తన రాజకీయ పోరాటం మొదలెట్టి ఆ తరువాత సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యతో దానిని తీవ్రతరం చేసి ఎట్టలేకకు కమ్యూనిస్టుల కోటలో తృణమూల్ రాజ్యాన్ని స్థాపించారు. అలా 2011లో తొలిసారి వచ్చిన మమతా బెనర్జీ పాతుకుని పోయారు. 2011 నాటికి బలంగా ఉన్న వామపక్షాలు మమతా దీదీని ఎదిరించి విపక్ష పాత్రలోకి వచ్చేశాయి. 2016 ఎన్నికల నాటికి ఆ బలం మరింతగా తగ్గిపోయింది. 2021 నాటికి బీజేపీ ధీటైన ప్రతిపక్షంగా మమత ముందు నిలిచింది. కమ్యూనిస్టులతో పోరు వేరు కమలంతో పోరు వేరు. ఈ సంగతి తెలిసేసరికి మమతా బెనర్జీకి హ్యాట్రిక్ సీఎం గడువు కూడా తీరిపోతోంది.

సర్ తో చెక్ :

మమతా దీదీకి సర్ తో చెక్ చెప్పడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఎక్కువగా అక్రమ వలసలతో వచ్చిన ఓట్లతో విపక్షాలు గెలుస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. దాంతో బెంగాల్ లో సర్ ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తూంటే బీజేపీ బాహాటంగా మద్దతు ఇస్తోంది నిన్నటికి నిన్న పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సర్ అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. విపక్షాలు తీరుని తప్పు పట్టారు. ఇక బెంగాల్ లో చూస్తే కనుక బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు తిరిగి వారి సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతున్న దృశ్యాని వీడియోలు తీసి మరీ బీజేపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు దాంతో సర్ వల్ల ఏమి జరగబోతోంది అన్నది ప్రజలకు బీజేపీ అర్ధం అయ్యేలా చేస్తోంది.

ఐటీ వింగ్ లిస్ట్ అంటూ :

ఇదిలా ఉంటే బెంగాల్ లో సర్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ బీజేపీ మీద మండిపడుతున్నారు. బెంగాల్ బీహార్ కాదని ఆమె అంటున్నారు. ఏ ఒక్కరి ఓటు అయినా ఓటర్ల లిస్ట్ లో లేకపోయినా ఇంట్లో ఉన్న సామగ్రితో ఆడవారు అలాగే చేతికి అందిన దాంతో మగాళ్ళు బయటకు వచ్చి తిరగబడాలని ఆమె గట్టిగా కోరుకుంటున్నారు. ఆ విధంగా వారికి పిలుపు ఇస్తున్నారు. సర్ తో ఓటర్ల జాబితా కాదు అది బీజేపీ ఐటీ వింగ్ తయారు చేసిన లిస్ట్ అని కూడా మమత మండిపడుతోంది. మమత ఒక విధంగా ప్రజలతో కలసి సర్ ని వ్యతిరేకించాలని అనుకుంటున్నారు. అయితే ఎన్నికల వేళ ప్రజల నుంచి మద్దతు అందునా ఏకంగా పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కి ఎలా వస్తుందో తెలియని పరిస్థితి అయితే లేదు అని అంటున్నారు.

ఇవన్నీ సంకేతాలా :

ఈ మధ్యనే బెంగాల్ లో ఏకంగా అయిదున్నర లక్షల మందితో గీతా పారాయణం అనే భారీ యాగాన్ని నిర్వహించారు. కాషాయ జెండాల రెపరెపలతో అక్కడ హోరెత్తిపోయింది. మరో వైపు చూస్తే బెంగాల్ లో ఈసారి అధికారం మాదే అని బీజేపీ జబ్బలు చరుస్తోంది. ఇక తృణమూల్ పాలన మూడు టెర్ములు కావడంతో జనాలకు కూడా వ్యతిరేకత బాగా ఉందని అంటున్నారు. దీంతో పాటు బీజేపీ వేస్తున్న ఎత్తులు మమతా బెనర్జీ అండ్ కోకి గట్టి సవాల్ నే విసురుతున్నాయి. దాంతో మమతా బెనర్జీ ధైర్యంగా కనిపిస్తూ ప్రకటనలు ఇస్తున్నారా లేక భయంతో కూడిన తీరా అన్నది అయితే రాజకీయంగా చర్చకు వస్తోంది. నిజానికి ఎన్నికల్లో గెలిచే మాట ఉంటే బీజేపీ వంటి పార్టీ అక్కడ గెలవలేదు అనుకుంటే ధీమాగా ఉండవచ్చు కదా అని అంటున్నారు. ప్రత్యేకించి మమతా బెనర్జీ చేస్తున్న ప్రకటనలే ఏ ప్రీ పోల్ సర్వే అవసరం లేకుండా బెంగాల్ ఫలితాన్ని చెబుతున్నాయని కమలనాధులు సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News