బీజేపీ గేట్లు ఓపెన్...మమత పార్టీ ఖాళీ ?
మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 2024 ఎన్నికల్లో 24 మంది దాకా గెలిచారు.
పశ్చిమ బెంగాల్ లో మే 10న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గట్టిగా ఇరవై రోజులు కూడా కాలేదు కానీ ముమ్మారు బెంగాల్ ని ఏలి బెబ్బులి మాదిరిగా పేరు తెచ్చుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. మమత పార్టీని కకావికలు చేసేందుకు కమలం పార్టీ భారీ స్కెచ్ ని గీసి మరీ రంగంలోకి దిగిపోయింది. ఇక మమతా బెనర్జీ ఒకనాటి సన్నిహితుడు అయిన సువేందు అధికారికి ముఖ్యమంత్రి బాధ్యతలను బీజేపీ అధినాయకత్వం తెలివిగానే అప్పగించింది అని అంటున్నారు. మమతా బెనర్జీ పార్టీ గుట్టూ మట్టూ పూర్తిగా అవగాహన కలిగిన సువేందు అధికారితోనే ముల్లుని ముల్లుతో తీసే రాజకీయ సయ్యాటను బీజేపీ మొదలుపెట్టింది.
ఇరవై మంది ఎంపీలు రెడీ :
మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 2024 ఎన్నికల్లో 24 మంది దాకా గెలిచారు. అయితే అందులో 20 మంది దాకా బీజేపీకి టచ్ లోకి వెళ్తున్నారు అని ప్రచారం హోరెత్తుతోంది. ఆ విధంగా జరిగితే వారంతా ఫిరాయింపుల బెడద లేకుండా ఏకంగా బీజేపీలో తృణమూల్ ని లోక్ సభలో విలీనం చేయవచ్చు అని అంటున్నారు. ఇది బీజేపీకి చాలా అవసరం అయినదే అని అంటున్నారు. 2024 ఎన్నికలో 240 ప్లస్ దగ్గర ఆగిన బీజేపీ ఈ పరిణామం కనుక సంభవిస్తే 273 మ్యాజిక్ ఫిగర్ కి అతి సమీపంలోకి వస్తుందని అంటున్నారు. అదే విధంగా రాజ్యసభలో కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. వారి చూపు కూడా కమలం పార్టీ వైపు ఉందని అంటున్నారు. ఇలా మమతా బెనర్జీ పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలను తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహ రచన చేస్తోంది అని అంటున్నారు.
సగం మంది ఎమ్మెల్యేలు :
మరో వైపు చూస్తే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ నుంచి 80 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో సగానికి సగం అంటే 40 మందికి పైగా ఇపుడు బీజేపీకి అందుబాటులోకి వచ్చారని ప్రచారం సాగుతోంది. అధికార బీజేపీ ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు కార్యక్రమాలకు పిలుపు ఇవ్వాలని మమత ఒక కీలక సమావేశం నిర్వహిస్తే కేవలం 36 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ నుంచి హాజరయ్యారు అని అంటున్నారు. మరి మిగిలిన 44 మంది ఎక్కడ అని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు అయితే వీరిలో చాలా మంది ముఖ్యమంత్రి సువేందు అధికారితో ఇతర మంత్రులతో టచ్ లో ఉంటూ అధికార పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతూ తాము కూడా అధికార పార్టీయే అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారని అంటున్నారు. దాంతో తృణమూల్ కాంగ్రెస్ శాసనసభా పక్షంలో భారీ చీలిక వస్తుందని అంటున్నారు. మమతా బెనర్జీ తానే స్వయంగా ఎమ్మెల్యే సీటులో ఓటమి చెందడంతో ఎమ్మెల్యేలు ఆమె నాయకత్వం పట్ల గతం మాదిరిగా విధేయత చూపించడం లేదని అంటున్నారు.
వరస కేసులతో ఉక్కిరి బిక్కిరి :
ఇక పదిహేనేళ్ళ మమతా బెనర్జీ పాలనలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు అక్రమాలు అవినీతి చేశారు అని వరస కేసులకు బీజేపీ ప్రభుత్వం సిద్ధపడుతోంది. అదే విధంగా గట్టిగా అన్ని వైపుల నుంచి బిగిస్తోంది అని అంటున్నారు. భూ ఆక్రమణలు, కట్ మనీ కుంభకోణం, మరో వైపు సీబీఐ చేతిలో ఉన్న నారదా స్కామ్ లో దూకుడు వంటి వాటితో అనేక మంది నేతలు సతమతం అవుతున్నారు. దాంతో అధికార పార్టీని ఆశ్రయించే వారి శాతం రాను రానూ పెరిగిపోతోంది అని అంటున్నారు మరో వైపు పదిహేను మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, పంచాయతీలకు చెందిన 150 మంది దాకా తృణమూల లోకల్ బాడీస్ ప్రజా ప్రతినిధులు అంతా అధికార పార్టీలో చేరిపోయారు ఇలా చూతూంటే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కి అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయని అంటున్నారు.
భవిష్యత్తు బెంగతో :
ఇక తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తు మీద బెంగతోనే చాలా మంది పార్టీని వీడుతున్నారని అంటున్నారు మమత వయసు ఇపుడు 72 ఏళ్ళు. మరో అయిదేళ్ళ పాటు గట్టిగా నిలబడి ఆమె పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందా అన్నదే ఒక చర్చ. దాంతో పాటు ఆమె మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ నాయకత్వ పోకడల మీద కూడా సీనియర్ల నుంచి అనేక మంది గుర్రుగా ఉన్నారు. ఇన్నాళ్ళూ అధికారం ఉంది కాబట్టి నడచిపోయింది. ఇపుడు మాత్రం చాలా మంది ఓపెన్ అయిపోతున్నారు మమతనే ధిక్కరిస్తున్నారు. పైగా బీజేపీ వైపు నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయని అంటున్నారు దీంతో బీజేపీ గేట్లు తెరిస్తే తృణమూల్ కాంగ్రెస్ కుప్ప కూలుతుందా అన్న చర్చ అయితే వాడిగా వేడిగా బెంగాల్ లో జరుగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.