కేంద్ర మంత్రి వర్గ విస్తరణ...ఏపీ నుంచి వారికే చాన్స్ ?
ఉప రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. ఎన్డీయేకు పూర్తిగా ఆనందం కలిగించే విధంగా ఫలితం వచ్చింది.;
ఉప రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. ఎన్డీయేకు పూర్తిగా ఆనందం కలిగించే విధంగా ఫలితం వచ్చింది. ఉన్న ఓట్ల కంటే అదనంగా ఓట్లు జమకూడి ఎన్డీయే విజయం రీ సౌండ్ చేసింది. దాంతో ఒక అతి ముఖ్య ఘట్టం పూర్తి అయింది. ఇక బీజేపీ ముందు మరిన్ని టాస్కులు ఉన్నాయి. వాటిని సాధించేందుకు గట్టి వ్యూహాలు కూడా చాలా బీజేపీకి ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ తన ఫోకస్ పెడుతోంది. నవంబర్ లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 2026 మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో బీజేపీ వీటి మీదనే ఇపుడు పూర్తిగా దృష్టి సారిస్తోంది.
మిత్రుల అండ కోసం :
బీహార్ లో జేడీయూతో బీజేపీ జట్టు కట్టి ఉంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోసారి ఆయన ఇమేజ్ ప్లస్ మోడీ ఇమేజ్ ని ఆసరాగా చేసుకుని అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఈ క్రమంలో బీహార్ లో మిత్రుడైన జేడీయూకి కేంద్ర మంత్రివర్గంలో మరో కీలక మంత్రి పదవిని ఇవ్వాలని చూస్తోంది. అలాగే తమిళనాడు నుంచి అన్నా డీఎంకేతో చెలిమి చేస్తోంది. వారితో కలసి పీఠం ఎక్కాలన్నదే టార్గెట్.దీంతో అన్నా డీఎంకేతో పాటుగా తమ పార్టీ వారికీ కేంద్ర మంత్రి పదవులు ఇచ్చే యోచనలో బీజేపీ ఉందని అంటున్నారు. బీజేపీకి చెందిన అనామలైకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని భావిస్తోంది. ఇక ఏపీకి కూడా మంత్రి పదవి ఒకటి ఇచ్చే ఆలోచన చేస్తోంది.
మూడు పార్టీల నుంచి రేసులో :
ఇక ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం తరఫున ఇద్దరు మంత్రులు ఉన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ ర్యాంక్ తో కీలకమైన పౌర విమానయాన శాఖను ఇచ్చారు. అలాగే గుంటూరుకు చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణాభివృద్ధి శాఖ కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు. బీజేపీకి చెందిన భీమవరం ఎంపీ శ్రీనివాసవర్మకు ఉక్కు శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు. ఇపుడు నాలుగవ మంత్రి పదవి అయితే సహజంగా జనసేనకు దక్కాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఎవరూ కేంద్ర మంత్రివర్గంలో లేరు కాబట్టి. అయితే మూడు పార్టీల నుంచి ఆశావహులు అనేక మంది మాత్రం ఉన్నారు.
వీరిలో లక్కీ ఎవరికో :
జనసేన విషయం తీసుకుంటే ఇద్దరు ఎంపీలు ఉంటే అందులో పలుమార్లు ఎంపీగా గెలిచిన బాలశౌరి మచిలీపట్నం నుంచి ఉన్నారు. అలాగే కాకినాడ నుంచి ఉదయ్ ఉన్నారు. పవన్ మొగ్గు ఎవరికి అన్నది చూడాలి, భవిష్యత్తులో తన అన్న నాగబాబును కేంద్ర మంత్రిగా చూడాలి అనుకుంటే జనసేన ఇపుడు మంత్రి పదవి కోరకపోవచ్చు అంటున్నారు. అపుడు బీజేపీ టీడీపీల మధ్యనే చాన్స్ దోబూచులాడుతుంది. టీడీపీ నుంచి చూస్తే రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. అలా కాదు అనుకుంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు సూచించే చాన్స్ ఉంది అని అంటున్నారు.
ఆమెకు మంత్రి పదవి :
అయితే గోవా గవర్నర్ పదవి అశోక్ కి ఇచ్చినందువల్ల టీడీపీ కోటా కాదు బీజేపీకే ఇవ్వాలని అనుకుంటే మాత్రం దగ్గుబాటి పురంధేశ్వరికి లైన్ క్లియర్ అయినట్లే అని అంటున్నారు. ఆమె కూడా మూడు సార్లు ఎంపీగా చేసిన సీనియర్ నేత. ఈ మధ్యనే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అయితే పెమ్మసాని ఆమె ఒకే సామాజిక వర్గం అన్నది ఏదైనా ఉంటే కనుక అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కి ఆ లక్కీ చాన్స్ దక్కుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఎవరిని వరిస్తుందో. చాలా తొందరలోనే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని బహుశా అశ్వీయుజ మాసం మొదలైన వెంటనే ఉండొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.