స్పెషల్ మ్యాజిక్ నంబర్ మీద బీజేపీ ఫోకస్
ఇక అంతే కాకుండా రాజ్యసభలో కూడా ఈ స్పెషల్ మ్యాజిక్ నంబర్ ని చేరుకోవడానికి బీజేపీ చూస్తోంది. రాజ్యసభలో ఈ నంబర్ 164గా ముంటుంది.
భారతీయ జనతా పార్టీకి కాలం కలసి వస్తోంది. ప్రత్యర్ధులు చిత్తు అవుతున్న చోట నంబర్ గేం లో ఫుల్ గా పాజిటివ్ గా సీన్ కనిపిస్తోంది. సరిగ్గా రెండు నెలల క్రితం ఎక్కడైతే ఒక మ్యాజిక్ నంబర్ దగ్గరకు చేరుకోలేక బీజేపీ ఇబ్బంది పడిందో ఇపుడు అదే నంబర్ చేరుకోవడం డెడ్ ఈజీగా మారుతోంది. ఏప్రిల్ 16న లోక్ సభ ప్రత్యేక సమావేశం జరిపి మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లుని కూడా నెగ్గించుకోవాలని చూసింది. ఆనాడు బీజేపీకి బ్రేకులు వేసిన టీఎంసీ అలాగే డీఎంకే ఈ రోజూ రెండూ ఓటమి వాకిట నిలిచి ఉన్నాయి. అంతే కాదు ఈ రెండూ కూడా ఎన్డీయే వైపు సానుకూలంగా ఉన్నాయి అని ప్రచారం సాగుతోంది.
మూడింట రెండు వంతులు :
లోక్ సభలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలీ అంటే మూడింట రెండు వంతులు నంబర్ ఉండాలి. అంటే లోక్ సభలో 352 మంది ఎంపీల మద్దతు ఆ బిల్లుకు ఉండాలన్న మాట. అయితే బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీయేకు లోక్ సభలో 293 మంది ఎంపీలు మద్దతు మత్రమే ఉంది. ఇక గత ఏప్రిల్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 298 మంది ఓటు అనుకూలంగా వేశారు. దాంతో 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది. ఇపుడు చూస్తే పరిస్థితి మారుతోంది. లోక్ సభలో 28 ఎంపీలు ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఏకంగా 20 మంది దాకా ప్రత్యేక వర్గంగా ఏర్పడి ఎన్డీయేకు మద్దతు తెలపనున్నారు అని అంటున్నారు.
వర్షాకాల సమావేశాల్లో :
దాంతో ఎన్డీయే బలం అక్కడ 318కి పెరుగుతుంది. అదే విధంగా ద్రవిడ మున్నేట్ర కజగం డీఎంకేకు ప్రస్తుతం లోక్‌సభలో 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వీరితో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. వీరి మద్దతు కనుక దక్కితే ఆ బలం కాస్తా అమాంతం 340కి చేరుకుంటుంది. ఆ మీదట తగ్గిన 12 మంది ఎంపీలను చిన్న పార్టీల సాయంతో దక్కించుకుని బీజేపీ తాను కోరుకున్న విధంగా డీ లిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా బిల్లుని కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించుకుంటుందని అంటున్నారు.
రాజ్యసభలోనూ :
ఇక అంతే కాకుండా రాజ్యసభలో కూడా ఈ స్పెషల్ మ్యాజిక్ నంబర్ ని చేరుకోవడానికి బీజేపీ చూస్తోంది. రాజ్యసభలో ఈ నంబర్ 164గా ముంటుంది. అంటే మూడింట రెండు వంతులు అన్న మాట. ఇక రాజ్యసభలో ఎన్డీయే సభ్యుల సంఖ్య 144గా ఉంది. మరో ఇరవై మంది ఇక్కడ కలిస్తే స్పెషల్ మ్యాజిక్ నంబర్ కి ఎన్డీయే చేరువ అవుతుంది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కి 13 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు రాజీనామా చేశారు. ఆ సీటుని బీజేపీ గెలుచుకుంటుంది. మిగిలిన 12 మందిలో తొమ్మిది మంది ప్రత్యేక వర్గంగా ఏర్పాటు అవుతున్నారు. అలా చూస్తే పది మంది సమకూరినట్లే. ఇక ద్రవిడ మున్నేట్ర కజగం డీఎంకేకు ప్రస్తుతం రాజ్యసభలో8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు.
పార్లమెంట్ లో నల్లేరు మీద నడక :
వీరితో పాటుగా చిన్న పార్టీలు వైసీపీ లాంటివి కూడా బిల్లులకు మద్దతు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా చూస్తే రాజ్యసభలోనూ ఎన్డీయే స్పెషల్ మ్యాజిక్ నంబర్ కి చేరువ అయినట్లే అని అంటున్నారు. ఇలా చూస్తే కేవలం డీ లిమిటేషన్ కి మాత్రమే కాదు మహిళా బిల్లుతో అయిపోదు, రానున్న కాలంలో బీజేపీ అనేక రాజ్యాంగ సవరణ బిల్లులకు సైతం ఆమోద ముద్రను సులువుగా ఉభయ సభలలో వేసుకోవడానికి ఇక మీదట వీలు అవుతుందని అంటున్నారు. అలాగే బీజేపీకి పార్లమెంట్ లో నల్లేరు మీద నడక అంటున్నారు. ఇక 2027లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి విజయానికి కూడా సరిపడా ఎంపీల మద్దతు ఉండబోతోంది అని కూడా ఈ లెక్కలు చెబుతున్నాయి. మరి బీజేపీ ఈ వ్యూహాన్ని ఇండియా కూటమి ఏ విధంగా ప్రతిఘటిస్తుందో చూడాల్సి ఉంది.