రాహుల్ దిష్టిబొమ్మ దహనం..మహిళా మోర్చా అతి చేష్టలు
రాజకీయాల్లో విమర్శలు అయినా ఏ రకమైన చర్యలు అయినా హుందాగా ఉండాలి. తాము చేసే కార్యక్రమాలు జనాలు అంతా చూస్తున్నారు అన్న ఆలోచన ఉండాలి.
రాజకీయాల్లో విమర్శలు అయినా ఏ రకమైన చర్యలు అయినా హుందాగా ఉండాలి. తాము చేసే కార్యక్రమాలు జనాలు అంతా చూస్తున్నారు అన్న ఆలోచన ఉండాలి. వ్యతిరేకతను నిండా పెట్టుకుని చేసే అతి చేష్టల వల్ల అవతల లక్ష్యంగా చేసుకునే నాయకులకు పోయేది ఏమీ ఉండదు, కానీ ఈ రకంగా కార్యక్రమాలను నిర్వహించిన వారికీ వారితో పాటు వారు ఉన్న పార్టీకి సైతం ఇరకాటంలో పడుతుంది. . ఇపుడు బీజేపీ మహిళా మోర్చా అతి ఉత్సాహం ఏకంగా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టినట్లుగా ఉందని అంతా అంటున్నారు. ఏదో చేయబోయి మరేదో అయింది అని అంతా అన్ని వేళ్ళూ బీజేపీ వైపు ఎత్తి చూపిస్తున్నారు.
తీరు అభ్యంతరకరం :
ఇక చూస్తే కనుక జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అంగోమ్‌చా బిమోల్ అకోయిజాంపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో బీజేపీ మహిళా మోర్చా నేతలు ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం అయితే తీవ్ర వివాదంగా మారింది. రాహుల్ దిష్టిబొమ్మను తగలబెట్టిన తీరే ఎబ్బెట్టుగా ఉంది. చూసేవారికి కూడా అది ఇదేమిటి అనిపించేలా ఉంది. దాంతో ఈ తరహా అభ్యంతరకర వైఖరి నిరసన పట్ల కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ నేతలపై పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ వ్యవహారంలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మౌనం వహించడాన్ని తప్పుబడుతూ పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ తరహా చర్యలు రాజకీయాన్ని దిగజార్చేలా ఉన్నాయని మహిళా భద్రత అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. దానితో పాటు మధ్యప్రదేశ్ లో అయితే రాహుల్ దిష్టి బొమ్మను దహనం చేస్తూ మహిళా మోర్చా కార్యకర్తలు ప్రవర్తించిన తీరు అభ్యంతరంగా ఉంది అని కాంగ్రెస్ ఫైర్ అవుతోంది.
మ్యాటర్ ఇదీ మరి :
మాజీ ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అంగోమ్‌చా బిమోల్ అకోయిజాం లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ని బీజేపీ టార్గెట్ చేస్తోంది. విశ్వవిద్యాలయంలోని సుమారు 11 మంది విద్యార్థినులు ఆయనపై చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై జేఎన్‌యూ అంతర్గత కమిటీ సుదీర్ఘ విచారణ చేపట్టింది. విచారణలో ఆయన దోషిగా తేలడంతో ఆయనను అక్టోబర్ 9న విశ్వవిద్యాలయ సర్వీసుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే విషయం మీద విశ్వవిద్యాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారి ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 11న బిమోల్ అకోయిజంపై భారతీయ న్యాయ సంహిత కింద లైంగిక వేధింపులు అసభ్యకర వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
రాజకీయ దుమారంగా మారింది :
అయితే ఈ మొత్తం ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ మహిళా ఎంపీల బృందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి, బిమోల్ అకోయిజంను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని ఈ కేసును లోక్‌సభ ఎథిక్స్ కమిటీకి పంపాలని వినతిపత్రం సమర్పించింది. ఆ మీదట దేశవ్యాప్త నిరసనలు మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలను బిమోల్ అకోయిజం పూర్తిగా తోసిపుచ్చారు. తనపై జరుగుతున్న చర్యలను రాజకీయ కక్షసాధింపుగా ఆయన అభివర్ణించారు. కనీసం తన వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కోర్టును ఆశ్రయిస్తానని చెబుతూ తనపై వచ్చిన ఆరోపణలు నిజమని రుజువైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ నిరసనలు చేపట్టడం రాజకీయంగా సబబే అయినప్పటికీ మరీ అభ్యంతరకరంగా దిష్టి బొమ్మలను దహనం చేయడంతో బూమరాంగ్ అవుతోంది అని అంటున్నారు.