జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు...బీసీ పీఠాలు ఎన్నంటే !

ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో చూస్తే విశాఖ జెడ్పీ బీసీలకు రిజర్వ్ చేశారు. అనకాపల్లి లో తొలిసారి జెడ్పీ ఎన్నికలు జరగనుండగా అక్కడ జెడ్పీ పదవిని బీసీ మహిళకు కేటాయించారు.

Update: 2026-10-13 17:46 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం అయింది. ఇదిలా ఉంటే మేయర్ పదవులకు మునిసిపల్ చైర్మన్ సీట్లకు రిజర్వేషన్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు జెడ్పీ చైర్మన్ పీఠాలకు రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చూస్తే దీంట్లో ఎంత మంది బీసీలకు జెడ్పీ పీఠాలు దక్కాయి అన్నది చర్చ ఒకటి అయితే మహిళలు ఎంత మందికి సీట్లు రిజర్వ్ అయ్యాయి అన్నది మరో చర్చగా ఉంది.

విశాఖ బీసీకే :

ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో చూస్తే విశాఖ జెడ్పీ బీసీలకు రిజర్వ్ చేశారు. అనకాపల్లి లో తొలిసారి జెడ్పీ ఎన్నికలు జరగనుండగా అక్కడ జెడ్పీ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. శ్రీకాకుళం విజయనగరం జెడ్పీ పీఠాలు రెండు కూడా బీసీ మహిళలకు కేటాయించడం విశేషం. దీంతో ఉత్తరాంధ్ర అంతటా మహిళలకే మేయర్ జెడ్పీ పీఠాలు దక్కినట్లు అయింది.

ఇదే వరసలో :

ఇక రిజర్వేషన్ల జాబితా చూస్తే బీసీలకు అనంతపురం, కర్నూల్ లను కేటాయించారు. ఎస్సీ కేటగిరీలో ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా, ఎస్సీ మహిళ కేటగిరీలో కోనసీమ, తిరుపతి, గుంటూరు జెడ్పీలు వస్తాయి. ఇక ఎస్టీ కేటగిరీలో అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా, ఎస్టీ మహిళ కేటగిరీలో పోలవరం జిల్లా వస్తాయి. అన్‌రిజర్వ్‌డ్ అంటే ఓపెన్ కేటగిరీలో చూస్తే అన్నమయ్య, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, సత్యసాయి, పశ్చ్మ గోదావరి, కడప ఉంటే అన్‌రిజర్వ్‌డ్ మహిళ కేటరిగీలో బాపట్ల, చిత్తూరు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, పల్నాడు జిల్లాలు ఉన్నాయి.

బీసీలకు మహిళలకు పెద్ద పీట :

ఇదిలా ఉంటే ఏపీలో జెడ్పీ చైర్మన్ పదవులలో బీసీలకు మహిళలకు పెద్ద పీట వేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఉన్న మొత్తం 28 జెడ్పీలలో వెనుకబడిన తరగతులకు ఆరు స్థానాలు దక్కాయి. అలాగే మహిళలకు ప్రాధాన్యత ఈసారి పెరిగింది. మొత్తం స్థానాల్లో చట్టప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను వర్తింపజేశారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ కేటగిరీలలో సగం చొప్పున స్థానాలు మహిళలకే దక్కనున్నాయి. అంతే కాదు కొన్ని ముఖ్యమైన జిల్లాలను కూడా మహిళలకు కేటాయింపులు చేశారు.

అందులో అనకాపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాలను ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. • బాపట్ల, చిత్తూరు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా వంటి పలు జిల్లాలను జనరల్ మహిళలకు కేటాయించారు. జనాభా ప్రాతిపదికన, రొటేషన్ పద్ధతిని అనుసరిస్తూ సామాజిక న్యాయం జరిగేలా ఈ రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేశారు. దీంతో కూటమి మొదటి నుంచి చెబుతున్నట్లుగా మహిళలకు బీసీలకు పెద్ద పీట వేసినట్లు అయింది అని అంటున్నారు.

Tags:    

Similar News