నాడు రాజీవ్...నేడు రాహుల్...అవే అరోపణలు !
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇప్పుడు దూకుడు మీద ఉన్నారు. ఆయన ఓట్ల చోరీ అంటూ ఉద్యమిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇప్పుడు దూకుడు మీద ఉన్నారు. ఆయన ఓట్ల చోరీ అంటూ ఉద్యమిస్తున్నారు. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను కోరుతూ వరస ఉద్యమాలకు దిగుతున్నారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాహుల్ గాంధీ జోరు పెరిగింది. అయితే రాహుల్ గాంధీ మీద మాజీ కాంగ్రెస్ వాదులు ఒకనాడు ఆయనతో ఉన్న నేతలు ఇపుడు బీజేపీలోకి వచ్చిన వారు అయితే తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. రాహుల్ కి అహంకారం అని కామెంట్స్ చేస్తున్నారు.
డీకే ని పక్కకు నెట్టారా ?
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన మార్చ్ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ను రాహుల్ గాంధీ వెనక్కి లాగారు అన్నది అయితే ఇపుడు సోషల్ మీడియాలో వీడియోతో తెగ వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ మార్చ్ లో వెనక నడుస్తూ ముందుకు రావడానికి దారి చేసుకునే ప్రయత్నంలో ముందున్న శివ కుమార్ ని వెనక్కి లాగారు, సరిగ్గా రాహుల్ గాంధీ చేయి డీకే మీదకు వెళ్లింది. దాంతో డీకేని వెనక్కి నెట్టి రాహుల్ ముందుకు వచ్చినట్లుగా వీడియోలో ఉంది. ఇదిపుడు ఆయన ప్రత్యర్ధులకు అస్త్రంగా మారుతోంది. రాహుల్ ది అహంకారం అని అస్సాం సీఎం, బీజేపీ నాయకుడు, ఒకప్పటి కాంగ్రెస్ నేత అయిన హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. డీకే శివకుమార్ ఒక వ్యక్తి కాదని కర్ణాటక ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. అలాంటి నాయకుడిని బహిరంగంగా రాహుల్ గాంధీ అవమానిస్తారా అని ఫైర్ అయ్యారు.
నాకూ అవమానం :
ఇక హిమంత బిశ్వ శర్మ తన గురించి కూడా ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. 2015లో ఒక గర్వించదగిన అస్సామీగా నేను అవమానాన్ని దిగమింగడానికి నిరాకరించాను అప్పట్లో దేవుడు నా పట్ల దయ చూపాడు అని ఆయన ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి డీకే కేవలం ఒక వ్యక్తి కాదు. అది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ఘనమైన చరిత్ర, గొప్ప సంస్కృతి, అపారమైన గర్వం కలిగిన రాష్ట్రానికి ప్రతినిధి అలాంటి ఆయన ఈ బహిరంగ అవమానానికి తలవంచుతారా అని హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. ఇదే విషయం మీద కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య గట్టిగానే రియాక్ట్ అయ్యారు. రాజకీయాలను పక్కన పెడితే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు జరిగిన ఇటువంటి బహిరంగ అవమానం ఏడు కోట్ల కన్నడిగుల గౌరవానికి భంగం కలిగించడమే అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటనను రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో వీరేంద్ర పాటిల్‌ను కర్ణాటక సీఎం పదవి నుంచి తొలగిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించడంతో కూడా ఆయన పోల్చారు.
అంజయ్య విషయం కూడా :
ఇంకాస్తా వెనక్కి వెళ్తే 1981 ప్రాంతాంలో ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న టి అంజయ్యని ఆనాడు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చినపుడు రాజీవ్ గాంధీ అవమానించారు అన్నది కూడా ఫ్లాష్ బ్యాక్ హిస్టరీలో ఉంది. దాని ఫలితంగానే తెలుగు వారికి అవమానం ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించడం పెద్ద మెజారిటీతో అధికారంలోకి రావడానికి ఆస్కారం ఏర్పడింది అని అంటున్నారు. మరి రాహుల్ గాంధీ చనువుతో అలా చేశారా లేక మార్చ్ లో ఒత్తిడి వల్ల చేశారా అన్నది పక్కన పెడితే ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీని మీద కాంగ్రెస్ రియాక్షన్ ఏమిటి అన్నది చూడాలి.