పంచాయతీ పోలింగ్ రచ్చరచ్చ!
| ఏపీలో 3,880 పంచాయతీలకు జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నెల్లూరులో టీడీపీ, వైసీపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలతో పోలింగ్ నిలిచిపోయింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆందోళనకారులు పోలింగ్ బూత్‌లలోకి చొచ్చుకెళ్లి బ్యాలెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైంది.
ఏపీలో ఆదివారం జరుగుతున్న రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో పలు జిల్లాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.ఈ దఫా 3880 పంచాయతీలకు ఎన్నికల పోలింగ్ చేపట్టారు. అయితే.. వైసీపీ, టీడీపీ మద్దతు దారుల మధ్య తీవ్ర వివా దాలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నెల్లూరులో యధావిధిగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తెరమీదికి వచ్చా యి. దీనికితోడు పోలింగ్ కేంద్రాల వద్ద ఇరు వర్గాలు మోహరించడం.. ఓటర్లను ప్రభావితం చేయడంతో పలు చోట్ల పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే.. ఏకంగా పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకువెళ్లిన ఆందోళన కారులు.. బ్యాలెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల బాక్సుల్లో ఇంకు, నీళ్లు పోశారు. నిజానికి పటిష్టమైన భద్రత కల్పించినా కూడా.. ఆందోళన కారులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడం, ఈ క్రమంలో బారికేడ్లను కూడా విరిచేయడం గమనార్హం. దీంతో పలు మండలాల్లో పోలింగ్‌ను ఆలస్యంగా చేపట్టారు. నెల్లూరులోనూ ఇదే తరహా పరిస్థితి నెకొంది. గ్రామంలోని ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదంతో ఎన్నికల పోలింగ్ తాత్కాలికంగా నిలిపి వేశారు.
తాజా ఎన్నికల్లో సుమారు 83లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 29 వేలకు పైగా వార్డు సభ్యుల భవితవ్యం ఈ పోలింగ్ లో తేలనుంది. ఈ విడతలో సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు అన్ని పార్టీల మద్దతుతో 10 వేల మందికి పైగా అభ్యర్థులు, వీరిలో 3 వేల మంది మహిళలు పోటీ పడుతున్నారు. గత తొలి దశ ఎన్నికల్లో కూటమికి కొంత తక్కువ ఫలితం వచ్చిన నేపథ్యంలో ఈ సారి ఆ తరహా పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ముందుగానే ప్రచారం, అభ్యర్థులకు సంబంధించిన సమాచారం వంటి విషయాల్లో పార్టీల నాయకులు జాగ్రత్తలు తీసుకున్నారు.