క్రికెట్ మైదానం నుంచి రాజకీయ వేదిక వైపు మహమ్మద్ షమీ?
| టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ కూడా పాల్గొన్నారు. షమీ రాజకీయాల్లోకి వస్తారనే చర్చ మొదలైనా, ఆయన చేరికపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన షమీ.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పటివరకు పార్టీలో చేరికపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ భేటీ వెనుక ఉన్న అసలు కారణాలపై ఆసక్తి నెలకొంది.
న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో మహమ్మద్ షమీతో పాటు బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ కూడా పాల్గొన్నారు. ప్రముఖ క్రీడాకారులు జాతీయ పార్టీ అధినేతలను కలిసేది రాజకీయాల్లో చేరడానికేనన్న చర్చ సాగుతోంది. అయితే ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశంపై ఇంకా స్పష్టత లేదు. ఇది రాజకీయ ప్రవేశానికి ముందస్తు అడుగు కావచ్చనే చర్చ సాగుతోంది.
ఇటీవల భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బీజేపీలో చేరినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో షమీ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చాహల్‌కు పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అభిమానులున్న ఆటగాళ్ల ద్వారా పార్టీకి కొత్త ఆకర్షణ లభిస్తుందని బీజేపీ ఈ చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లు ప్రచారంలో కీలక పాత్ర పోషించగలరని భావిస్తోంది. చాహల్ తర్వాత షమీ పేరు తెరపైకి రావడంతో క్రీడా, రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన మహమ్మద్ షమీకి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. ఆయన రాజకీయాల్లోకి వస్తే యూపీ రాజకీయాల్లో ఆ ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ యూపీ ఎన్నికలపై ఫోకస్ చేసింది. యూపీకే చెందిన షమీని ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలని చూస్తోంది. మరోవైపు షమీ క్రికెట్ కెరీర్ ఇంకా ముగియలేదు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వన్డేలు, టీ20లు, దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ ఆయన ఆడుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ తర్వాత షమీ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మరింత బలపడ్డాయి. షమీ లేదా బీజేపీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ అంశంపై ఉత్కంఠ కొనసాగడం ఖాయం.