విజయ్ పార్టీకి బీజేపీ బంపర్ ఆఫర్
తమిళనాడులో కొత్త పార్టీగా జనంలోకి వస్తున్న టీవీకేకి బీజేపీ బంపర్ ఆఫర్ ఇస్తోంది. తమతో కలసి పనిచేయాలని ఓపెన్ గానే ఆహ్వానం పంపించింది.;
తమిళనాడులో కొత్త పార్టీగా జనంలోకి వస్తున్న టీవీకేకి బీజేపీ బంపర్ ఆఫర్ ఇస్తోంది. తమతో కలసి పనిచేయాలని ఓపెన్ గానే ఆహ్వానం పంపించింది. తమిళనాడులో డీఎంకేని దెబ్బ తీయాలీ అంటే విజయ్ పార్టీ ఎన్డీయే కూటమిలోకి చేరాలని బీజేపీ పిలుపు ఇచ్చింది. తమతో జట్టు కలిస్తే విజయ్ పార్టీకి అంతా మంచే జరుగుతుందని కూడా చెబుతోంది.
విడిగా ఉంటే కష్టం :
తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. విపక్షాలు చీలిపోతే ఎవరికి వారుగా పోటీ చేస్తే అది డీఎంకే కే లాభం అని బీజేపీ అభిప్రాయపడింది. డీఎంకే కే వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలీ అంటే విజయ్ ఎన్డీయే కలిసి రావడమే మేలు అని సూచిస్తోంది. మరోసారి డీఎంకే గద్దే మీద కూర్చోకుండా ఆపాలీ అంటే విజయ్ ఇపుడే ఆలోచించుకోవాలని బీజేపీ తమిళనాడు అధికర ప్రతినిధి ఏఎన్ఎస్ ప్రసాద్ తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
స్టాలిన్ మీద తీవ్ర అసంతృప్తి :
తమిళనాడులో డీఎంకే పాలన మీద ముఖ్యమంత్రి స్టాలిన్ మీద జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపధ్యంలో విపక్షాలు విడిపోతే ఎవరు మటుకు వారు పోటీకి దిగితే అంతిమంగా అది స్టాలిన్ పార్టీకే లాభం చేకూరుస్తుంది అని ఆయన హెచ్చరించారు. తాము విజయ్ పార్టీని ఈ సమయంలో కోరేది ఒక్కటే అని స్టాలిన్ ని మళ్ళీ సీఎం చేయకుండా సహకరించాలి అంటే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీ తప్పనిసరిగా వచ్చి చేరాలని బీజేపీ గట్టిగా కోరుతోంది. విజయ్ కి నిజంగా డీఎంకే పార్టీ ఓటమి చెందాలని ఉంటే కీలక నిర్ణయం తీసుకోవాలని బీజేపీ చెబుతోంది.
విజయ్ గమనించాల్సిందే :
తమిళనాడులో డీఈంకే పార్టీ పాలనలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యాయని, అలాగే నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెరిగిపోయాయని అవినీతి అక్రమాల ఆరోపణలు పెచ్చరిల్లాయని బీజేపీ గుర్తు చేస్తోంది. వీటితో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని అంటోంది. ఈ వ్యతిరేకతను డీఎంకే గమనించి తన కూటమిలో కొత్త పార్టీలని నేతలను చేర్చుకుంటోందని బీజేపీ చెబుతోంది. ఈ పరిణామాలను విజయ్ జాగ్రత్తగా గమనించాలని సూచిస్తోంది.
అంతా ఏకం కావాలి :
తమిళనాడులో డీఎంకే కూటమికి వ్యతిరేకంగా అంతా ఏకం కావాల్సిన పరిస్థితి ఉందని బీజేపీ అంటోంది. నిజంగా విజయ్ కి డీఎంకేని అధికారంలోకి రానీయకూడదు అన్న ఆలోచన ఉంటే కనుక కచ్చితంగా ఎన్డీయే కూటమిలో ఆయన చేరాల్సిందే అని బీజేపీ చెబుతోంది. గత ఎన్నికల పరిస్థితులు, ఓటింగ్ సరళిని, ప్రస్తుతం తమిళనాట రాజకీయ వాతావరణాన్ని విజయ్ గమనించాలని కూడా కోరుతోంది. ఇదిలా ఉంటే 2026 ఎన్నికలు తమిళనాడు భవిష్యత్తుకు అతి ముఖ్యమని బీజేపీ అంటోంది. అందువల్ల డీఎంకేకు యాంటీగా అంతా కలిసి ఐక్య ప్రజాస్వామ్య కూటమిగ మారాల్సిన అవసరం ఉందని అంటోంది.
విజయ్ స్టెప్ ఏంటి :
మరి బీజేపీ చేసిన ఈ ప్రతిపాదనను విజయ్ పరిశీలిస్తారా అన్నదే చర్చగా ఉంది. తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని ఇప్పటికే విజయ్ చెబుతూ వస్తున్నారు. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు ఉండని ఆయన అంటున్నారు. అంతే కాదు మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు తాము పోటీ చేస్తామని ఆయన చెబుతున్నారు. విజయ్ కనుక ఎన్డీయేలో చేరితే ముఖ్యమంత్రి పదవిని షేర్ చేసుకునే ప్రతిపాదన కూడా ఉందని ప్రచారం సాగుతోంది. మరి బీజేపీ ఈ ఆఫర్ ఇచ్చినా విజయ్ పార్టీ ఒప్పుకోకపోవచ్చు అని అంటున్నారు. విజయ్ పార్టీ ఈ ఎన్నికలను ఫైనల్స్ గా భావిస్తున్నారా లేక సెమీ ఫైనల్స్ గా తీసుకుంటున్నారా అన్నది తెలియదు కానీ త్రిముఖ పోటీకి అయితే దారులు పరుస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఉంది మరో సారి డీఎంకే గెలిస్తే మాత్రం విజయ్ టీవీకే పార్టీ ప్రతిపక్షంలో అయిదేళ్ల పాటు ఉండడం కష్టమే. అలాగే అన్నా డీఎంకే మరోసారి పరాజయం పాలు అయితే ఆ పార్టీ మనుగడ ఇబ్బందులలో పడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.