మన ఆడబిడ్డ.. తెలుగింటి కోడలు.. బీజేపీ జాతీయ చీఫ్ గా మహిళ?

నిన్నటివరకు ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.;

Update: 2025-07-04 08:51 GMT

వాజ్ పేయీ, ఆఢ్వాణీ వంటి దిగ్గజాలు... రాజ్ నాథ్ సింగ్, గడ్కరీ వంటి హేమాహేమీలు.. అమిత్ షా, జేపీ నడ్డా వంటి ఉద్ధండులు సారథులుగా వ్యవహరించిన బీజేపీకి కొత్తగా మహిళా అధ్యక్షురాలు రాబోతున్నారా..? 45 ఏళ్ల పార్టీ చరిత్రలో తొలిసారి ఓ మహిళను చీఫ్ ను చేయనున్నారా? అది కూడా మన తెలుగు ఆడబిడ్డ పురందేశ్వరి ఓ జాతీయ పార్టీ పగ్గాలు చేపట్టన్నారా..? లేదా తెలుగింటి కోడలు కమలం పార్టీకి కొత్త బాస్ కానున్నారా...? తాజా పరిణామాలను చూస్తే ఔననే మాటే వినిపిస్తోంది. తెలుగు నేలతో సంబంధం ఉన్న వీరిద్దరూ కాకుంటే తమిళనాడు నాయకురాలికి చాన్స్ దక్కుతుందని చెబుతున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నారు. ఆయన పదవీ కాలం రెండేళ్ల కిందటే పూర్తయింది. కానీ, ఆయననే కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు గట్టిగా వినిపించినా.. నడ్డానే కొనసాగుతున్నారు. ఇప్పుడు మాత్రం కొత్త చీఫ్ ఎన్నిక తప్పదు. అది కూడా ఈ నెల రెండో వారంలోనే.

మాజీ ప్రధాని వాజ్ పేయీ నుంచి ఇప్పటివరకు బీజేపీకి 11 మంది జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో ఆఢ్వాణీ మూడుసార్లు, రాజ్ నాథ్ రెండుసార్లు చీఫ్ లుగా వ్యవహరించారు. మహిళలు ఎవరికీ ఈ బాధ్యతలు దక్కలేదు. అందుకనే ఈసారి మహిళకు పగ్గాలు ఇస్తారనే కథనాలు జాతీయ మీడియాలో వినిపిస్తున్నాయి.

నిన్నటివరకు ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నడ్డా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అందులో వీరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ప్రధాని మోదీ ప్రస్తుత 8 రోజుల విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగివచ్చాక నిర్ణయం తీసుకుంటారు.

పార్టీ చీఫ్ రేసులో తెలుగింటి కోడలు అయిన నిర్మల ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. బీజేపీ మహిళా వాయిస్ ఈమె. 11 ఏళ్లు కేంద్ర మంత్రిగా అనుభవం, 2019 నుంచి ఆర్థిక శాఖను చూస్తుండడం, నాయకత్వ సామర్థ్యం రీత్యా నిర్మలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని.. దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి ఇదే మంచి మార్గం అని చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన నిర్మల.. వచ్చే ఏడాది జరిగే ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించే చాన్స్ ఉందని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ సంపూర్ణ మద్దతు ఉండడం ప్లస్ పాయింట్.

పురందేశ్వరి 2014లో బీజేపీలోకి వచ్చారు. కేంద్రమంత్రిగా పదేళ్ల అనుభవం ఉన్నా.. అది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏలో. పదేళ్ల తర్వాత నిరుడు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయం అని పలుసార్లు ఊహాగానాలు వినిపించినా సాధ్యం కాలేదు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తెగా, హుందాతనం ఉన్న నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. గత ఏడాది ఏపీలో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి ఏర్పాటు సమయానికి ఆమెనే ఏపీ చీఫ్. సంఘ్ నేపథ్యం లేకపోవడం ఒక్కటే మైనస్. ఒకవేళ నిర్మల బీజేపీ చీఫ్ అయితే.. ఆ స్థానంలో పురందేశ్వరి వెళ్తారని ఖాయంగా చెప్పొచ్చు.

వనతి శ్రీనివాసన్.. తమిళనాడుకు చెందిన న్యాయవాది. పార్టీలో పలు పదవులు నిర్వర్తించారు. కోయంబత్తూర్ దక్షిణ ఎమ్మెల్యే. విశ్వ నటుడు కమల్ హాసన్ పై గెలిచారు. 1993 నుంచి బీజేపీలో ఉన్నారు. పక్కా తమిళ వ్యక్తి అయినందున వనతిని చీఫ్ గా చేయడం అసెంబ్లీ ఎన్నికల్లో మేలు చేస్తుందని బీజేపీ ఆలోచించవచ్చు. ఐదేళ్ల కిందటే మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు కావడం.. మూడేళ్ల నుంచి కేంద్ర ఎన్నికల కమిటీలో ఉండడం వనతికి ప్లస్ పాయింట్స్.

బీజేపీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. దానికి ఆర్ఎస్ఎస్ ఆమోదం అవసరం. అయితే, మహిళను అధ్యక్షురాలిగా చేసేందుకు ఆర్ఎస్ఎస్ ఓకే చెప్పినట్లు కూడా సమాచారం. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల చీఫ్ ల ఎన్నిక పూర్తయింది. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక చేపట్టాలంటే కనీసం 19 రాష్ట్రాల అధ్యక్షుల నియామకం పూర్తవ్వాలి.

Tags:    

Similar News