ఏపీలో బీజేపీ గేర్ మార్చ‌నుందా... కొత్త ఆట ఇదే...!

ఎప్పుడో 1998లోనే వాజ్‌పేయ్‌, అద్వానీ టైంలోనే ఉమ్మ‌డి స్టేట్‌లో నాలుగు పార్ల‌మెంటు సీట్లు ఎలాంటి పొత్తులు లేకుండా గెలుచుకుంది.;

Update: 2026-05-11 04:09 GMT

ఆంధ్రప్రదేశ్లో బిజెపి పట్టు సాధించేందుకు గత దశాబ్ద కాలంగా చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎప్పుడో 1998లోనే వాజ్‌పేయ్‌, అద్వానీ టైంలోనే ఉమ్మ‌డి స్టేట్‌లో నాలుగు పార్ల‌మెంటు సీట్లు ఎలాంటి పొత్తులు లేకుండా గెలుచుకుంది. ప్రాంతీయ పార్టీల బ‌లం ఎక్కువుగా ఉన్న ఏపీలో బీజేపీ ఆశ‌లు ఎంత మాత్రం నెర‌వేర‌డం లేదు. అస‌లు 2019 ఎన్నిక‌ల్లో ఎలాంటి పొత్తులు లేకుండా బీజేపీ పోటీ చేస్తే 175 అసెంబ్లీ, 25 లోక్‌స‌భ సీట్ల‌లో ఒక్క‌చోట కూడా డిపాజిట్ ద‌క్క‌లేదు. ఇది సొంతంగా ఏపీలో బీజేపీ బ‌లం. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారింది. దేశ‌వ్యాప్తంగా బీజేపీ గాలి మామూలుగా వీయ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఏపీలోనూ ఎంతో కొంత బ‌ల‌ప‌డే అవ‌కాశం కోసం ఆ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం ఎదురు చూస్తోంది.

ఏపీలో కూట‌మి పార్టీల‌లో ఒక‌టిగా అధికారంలోనే ఉన్న బీజేపీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత గేరు మార్చి కొత్త ఆట మొద‌లు పెట్ట‌నుంది. ఇక్క‌డ పొత్తుతో ఉన్నా... సొంతంగా పోటీ చేసినా త‌మ‌కు వ‌చ్చే లాభం కానీ నష్టం కాని ఉండ‌దు అన్న‌దే ఆ పార్టీ పెద్ద‌ల లెక్క‌. 2029 నాటికి ఇప్పుడున్న ఫామ్ నేప‌థ్యంలో కేంద్రంలో మ‌రోసారి సొంతంగానే ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌న్న‌ది క‌మ‌ల నాథుల లెక్క‌. అందుకే ఈ మూడేళ్లు ఏపీలో దూకుడుగా రాజ‌కీయం చేస్తూ ఇక్క‌డ సొంతంగా బ‌ల‌ప‌డ‌డంతో పాటు కేర‌ళ‌లోలా సింగ‌ల్ డిజిట్‌లో అయినా ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవాల‌ని చూస్తోంది.

2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మ‌ద్ద‌తుతోనే కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం వ‌రుస‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చింది. ఈ సారి ఆ ప‌రిస్థితి త‌మ‌కు ఉండ‌దు అన్న‌దే బీజేపీ ప్లాన్‌. ఇప్పుడు బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రం త‌మ చేతిలో ఉంది. పైగా అస్సాం, పుదుచ్చేరిలో కూడా గెల‌వ‌డంతో అవ‌స‌రం అయితే జ‌న‌సేన‌ను పూర్తిగా త‌మ గ్రిప్‌లోకి తెచ్చుకుని.. జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ఆట మొద‌లు పెట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.

ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ప్ర‌తి విష‌యంలోనూ కేంద్రంలో ఉన్న బీజేపీకి అడిగినా.. అడ‌గ‌క‌పోయినా మ‌ద్ద‌తు ఇచ్చేస్తున్నారు. ఇది టీడీపీ, జ‌న‌సేన‌కు ఒకింత ఇబ్బంది క‌లిగించే విష‌య‌మే. ఇక దేశంలో వ‌రుస‌గా 21 రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీకి ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేన సైతం ఒకింత త‌లొగ్గే అవ‌కాశాలున్నాయి. ఈ ప‌రిస్థితుల‌ను క్యాష్ చేసుకునే బీజేపీ ఏపీలో స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుల‌ను ఉప‌యోగించుకుని సొంత ఓటు బ్యాంకు సృష్టించుకునే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు, అడుగులు వేస్తోంది.

Tags:    

Similar News