మురిద్కేలో నిజమైన ‘ధురంధర కాండ’: లష్కరే కమాండర్ ఖతం!
ప్రస్తుతం భారతీయ వెండితెరపై ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.;
ప్రస్తుతం భారతీయ వెండితెరపై ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. సరిహద్దు అవతల శత్రువుల గుండెల్లో నిద్రపోయే గూఢచారి ఆపరేషన్లను చూసి ప్రేక్షకులు పులకించిపోతున్నారు. అయితే కొందరు విమర్శకులు ఇది కేవలం సినిమాటిక్ ఫిక్షన్ అని వాస్తవంలో ఇలాంటివి జరగవని కొట్టిపారేస్తున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో పాకిస్థాన్‌లోని మురిద్కే గడ్డపై జరిగిన ఒక రక్తపాతం... 'రీల్' స్టోరీని మించి 'రియల్' చర్చకు దారితీసింది.
మురిద్కే ఉలిక్కిపడేలా.. ఈద్ ప్రార్థనల వేళ!
కుక్కలు చింపిన విస్తరిలా మారుతున్న పాకిస్థాన్ అంతర్గత భద్రతకు అద్దం పడుతూ లష్కరే తోయిబా కీలక కమాండర్ బిలాల్ ఆరిఫ్ సలాఫీ దారుణ హత్యకు గురయ్యాడు. మురిద్కేలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే 'మర్కజ్ తైబా' కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈద్ ప్రార్థనలు ముగించుకున్న వెంటనే గుర్తు తెలియని 'అపరిచితులు' సలాఫీని లక్ష్యంగా చేసుకున్నారు. అతడిని కేవలం కాల్చడమే కాకుండా కత్తులతో పొడిచి కిరాతకంగా చంపడం అక్కడి ఉగ్రవాద వర్గాలను వణికించేలా చేసింది.
ఎవరీ బిలాల్ ఆరిఫ్ సలాఫీ?
బిలాల్ ఆరిఫ్ సలాఫీ కేవలం ఒక సాధారణ మిలిటెంట్ కాదు. మర్కజ్ తైబా కేంద్రంగా ఉంటూ కశ్మీర్ లోయలో అలజడి సృష్టించడానికి యువతను రిక్రూట్ చేయడంలో ఇతడు ఆరితేరినవాడు. యువత మెదడుల్లో విషాన్ని నింపి, వారిని ఉగ్రవాదం వైపు మళ్లించడంలో ఇతడిది కీలక పాత్ర. మర్కజ్ తైబాను ఒక శిక్షణ శిబిరంగా వాడుకుంటూ భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నే వ్యూహకర్తగా ఇతడికి పేరుంది.
సినిమా క్లైమాక్స్.. నిజ జీవిత సన్నివేశం!
చిత్రమైన విషయం ఏమిటంటే ‘ధురంధర: ది రివెంజ్’ సినిమాలో క్లైమాక్స్ సీన్ ఎక్కడైతే జరుగుతుందో సరిగ్గా అదే మురిద్కే ప్రాంతంలో ఇప్పుడు ఈ హత్య జరగడం యాదృచ్ఛికం కాదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సినిమాను కేవలం కల్పితం అని కొట్టిపారేసే వారికి పాకిస్థాన్‌లో వరుసగా మరణిస్తున్న 'భారత వ్యతిరేక శక్తుల' జాబితా ఒక సమాధానంగా మారుతోంది. గత కొన్ని నెలలుగా పాకిస్థాన్‌లో ఎంపిక చేసిన ఉగ్రవాదులు 'అజ్ఞాత వ్యక్తుల' చేతిలో ప్రాణాలు కోల్పోతుండటం వెనుక ఉన్న ఆ 'ధురంధరులు' ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
మౌనంలో పాక్ అధికారులు
ఈ దాడి జరిగిన తర్వాత మర్కజ్ తైబా ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొంది. సలాఫీ రక్తపు మడుగులో పడి ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నా, పాకిస్థాన్ ప్రభుత్వం లేదా సైన్యం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. తమ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను తాము కాపాడుకోలేకపోతున్నామనే నిజాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేక ఈ ఘటనను అంతర్గత ముఠా తగాదాగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది.
సినిమాలో చూపించే గూఢచారి దాడులు అతిశయోక్తి అని భావించే వారికి.. మురిద్కేలో సలాఫీ అంతం ఒక బలమైన సంకేతం. సరిహద్దు అవతల ఉన్న శత్రువులను ఏరిపారేయడానికి వ్యవస్థలు ఏ స్థాయిలో పని చేస్తున్నాయో ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. 'అపరిచితులు' ఎవరో తెలియదు కానీ వారు చేస్తున్న పని మాత్రం భారతీయ సామాన్యుడికి 'ధురంధర' తరహాలో సంతృప్తిని ఇస్తోంది.