ఒక్క వీడియోకు రూ.లక్ష.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వం బంపర్ ఆఫర్
కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు సంబంధించిన కంటెంట్‌ను రూపొందించే రిజిస్టర్డ్ సోషల్ మీడియా క్రియేటర్లకు వీక్షణల ఆధారంగా చెల్లింపులు చేయనున్నారు.
సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు బిహార్ ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేలా వీడియోలు రూపొందించి వైరల్ చేస్తే.. గరిష్ఠంగా రూ.లక్ష వరకు నగదు పొందే అవకాశం కల్పించింది. ఈ మేరకు ‘బిహార్ సోషల్ మీడియా నిబంధనలు–2026’లో చేసిన సవరణలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
లక్ష వ్యూస్‌కు రూ.10 వేలు
కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు సంబంధించిన కంటెంట్‌ను రూపొందించే రిజిస్టర్డ్ సోషల్ మీడియా క్రియేటర్లకు వీక్షణల ఆధారంగా చెల్లింపులు చేయనున్నారు. ఒక వీడియోకు లక్ష వ్యూస్ వస్తే రూ.10,000 వరకు చెల్లించే విధానం తీసుకొచ్చారు. అదే వీడియోకు 10 లక్షల వ్యూస్ వస్తే గరిష్ఠంగా రూ.లక్ష అందుతుంది. అయితే 10 లక్షల వ్యూస్ దాటినా అదనంగా నగదు చెల్లించరు. అంటే ఒక్క వీడియోకు ప్రభుత్వం చెల్లించే గరిష్ఠ మొత్తం రూ.లక్షగానే ఉంటుంది.
ప్రతి వైరల్ వీడియోకూ డబ్బులు రావు
ఈ ఆఫర్‌ను ప్రభుత్వం కొన్ని షరతులతో అమలు చేయనుంది. సోషల్ మీడియాలో ఏ వీడియో వైరల్ అయినా దానికి నగదు బహుమతి లభించదు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉండే కంటెంట్‌కు మాత్రమే ఈ చెల్లింపులు వర్తిస్తాయి.
వీడియో ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రచురితమైంది, కంటెంట్ నాణ్యత ఎలా ఉంది.. వచ్చిన వ్యూస్ వాస్తవమైనవేనా అనే అంశాలను అధికారులు పరిశీలించనున్నారు. వీక్షణలను అధికారికంగా ధృవీకరించిన అనంతరం మాత్రమే చెల్లింపులు చేయనున్నారు.
ఐపీఆర్.డీ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ముందుగా బిహార్ సమాచార, ప్రజా సంబంధాల విభాగం (ఐపీఆర్.డీ)లో తమ పేరును నమోదు చేసుకోవాలి. సంబంధిత విభాగం అనుమతి లేకుండా రూపొందించే వీడియోలను ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకోరు. అంతేకాదు.. రిజిస్టర్ అయిన క్రియేటర్ల సోషల్ మీడియా ఖాతాలు, ఛానెళ్లలోని ఫాలోవర్ల సంఖ్యను కూడా ప్రభుత్వం నిరంతరం పరిశీలించనుంది. ఫేక్ వ్యూస్, నకిలీ ఫాలోవర్లు లేదా నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సోషల్ మీడియాను ప్రభుత్వ ప్రచారానికి మరింత సమర్థంగా ఉపయోగించుకోవడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.