సునీల్ నాయక్ అరెస్టు అంత ఈజీ కాదు! బిహార్ సర్కార్ కీలక నిర్ణయం

దీంతో సునీల్ నాయక్ అరెస్టు అంశం డైలమాలో పడింది. రఘురామ కేసులో నిందితుడు సునీల్ నాయక్ అరెస్టుకు గుంటూరు కోర్టు వారెంటు జారీ చేసింది.;

Update: 2026-02-28 05:33 GMT

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టుపై హైడ్రామా కొనసాగుతోంది. సునీల్ నాయక్ ను అరెస్టు చేయాలంటే బిహార్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సోమవారం ఏపీ పోలీసులు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఆయనకు నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడి న్యాయవ్యవస్థ అడ్డుగా నిలిచి ట్రాన్సిట్ వారెంటు జారీ చేయకపోవడంతో సునీల్ నాయక్ ను వదిలేయాల్సివచ్చింది. ఇక ఆ తర్వాత బిహార్ రాష్ట్ర ప్రభుత్వం తమ కేడర్ ఐపీఎస్ అధికారిని రక్షించేందుకు అడ్డుగా నిలిచేలా కీలక నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేయడాన్ని బిహార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారుల ఒత్తిడితో తమ రాష్ట్ర అధికారులను ముందస్తు అనుమతి అరెస్టు చేయకుండా ప్రత్యేక నిబంధనలు ప్రవేశ పెట్టిందని చెబుతున్నారు. ఇందుకోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత చట్టానికి బిహార్ ప్రభుత్వం కీలక సవరణలు చేసిందని అంటున్నారు. దీని ప్రకారం బిహార్ రాష్ట్ర అధికారుల అరెస్టుపై ముందస్తు అనుమతి తీసుకోవాల్సి వుంటుందని చెబుతున్నారు.

దీంతో సునీల్ నాయక్ అరెస్టు అంశం డైలమాలో పడింది. రఘురామ కేసులో నిందితుడు సునీల్ నాయక్ అరెస్టుకు గుంటూరు కోర్టు వారెంటు జారీ చేసింది. అయినప్పటికీ బిహార్ ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా మారడంతో ఆయనను ఇక్కడకు తీసుకురావడం క్లిష్టంగా మారిందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ పోలీసులు ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సునీల్ నాయక్ ను అరెస్టు చేసి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కోసమని విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలోని 12 మంది ఏపీ పోలీసు అధికారుల బృందం బిహార్ లోనే ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీ పోలీసులు ఉత్తిచేతులతోనే వెనుదిరగాల్సిన పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

సునీల్ నాయక్ ను అరెస్టు చేయాలంటే ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరగాలని అంటున్నారు. బిహార్ లోనూ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఈ విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని, సునీల్ నాయక్ అరెస్టుకు సహకరించాల్సిందిగా ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కూటమి పెద్దలు కలగజేసుకుని బిహార్ ప్రభుత్వంతో మాట్లాడినా, ఆ రాష్ట్ర అధికారుల మనోభీష్టానికి వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టుకు అనుకూలంగా వ్యవహరిస్తుందా? అన్నది పెద్ద చర్చగా మారింది. మొత్తానికి రఘురామరాజు కేసులో తాజా ట్విస్టు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News