బీహార్ చిత్ర విచిత్రాలు: హ‌త్య చేయించిన వారు గెలిచారు.. శ‌ప‌థం చేసిన వారు ఓడారు!

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఉద్దండులైన స‌ర్వే రాయుళ్లు రంగంలోకి దిగారు ఎన్నిక‌లు ముందు రెండు మాసాల నుంచే ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.;

Update: 2025-11-15 11:27 GMT

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాక‌పోవ‌డం ఒక చిత్ర‌మైతే.. మ‌రింత విచిత్రం ఏంటంటే.. హ‌త్య చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నాయ‌కుడికి కూడా ప్ర‌జ‌లు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అంతేకాదు.. ``ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల చేత జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే త‌ప్ప‌.. మాస్కు తీయ‌ను`` అని శ‌ప‌థం చేసిన ఓ మ‌హిళ‌ను చిత్తు చిత్తుగా ఓడించారు. మ‌రి ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు మాస్క్‌ను ధ‌రించేఉంటారో.. లేక మ‌ధ్య‌లోనే ఒట్టు తీసి గ‌ట్టున పెడ‌తారా? అన్న‌ది చూడాలి. అంతేకాదు.. మార్పుకోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్న వారిని కూడా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం మ‌రో చిత్ర‌మైన విష‌యం.

ఎక్క‌డెక్క‌డ ఏం జ‌రిగింది?

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ఉద్దండులైన స‌ర్వే రాయుళ్లు రంగంలోకి దిగారు ఎన్నిక‌లు ముందు రెండు మాసాల నుంచే ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, ఎన్నిక‌ల త‌ర్వాత కూడా రెండు రోజులు తిరిగి ప్ర‌జ‌ల నాడిని తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్డీయే గెలుస్తుంద‌ని చెప్పారు. కానీ, వారు 150 సీట్ల‌కుప‌రిమితం అవుతుంద‌ని చెప్పినా.. ప్ర‌జ‌ల నాడి వారికి అంద‌లేదు. తీవ్ర సంచ‌ల‌నంగా మారిన బీహార్ ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ఏకంగా 206 స్థానాల్లో దిగ్విజ‌యం ద‌క్కించుకుంది. ఇది బీహార్ చ‌రిత్ర‌లోనే జ‌రిగిన తొలి ఘ‌ట్టం. అంతేకాదు.. ఒక కూట‌మి ఇలా ప్ర‌భంజ‌నం సృష్టించ‌డం.. స్వ‌తంత్ర బీహార్‌లో తొలిఘ‌ట్టం కావ‌డం చిత్రం!.

ఇక‌, మార్పు కోసం అంటూ.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ పార్టీ పెట్టారు. జ‌న్ సురాజ్‌(ప్ర‌జ‌ల‌కు మేలు) పార్టీ పేరుతో ఆ యన 148 స్థానాల్లో పోటీ చేశారు. పోటీలో తాను లేక‌పోయినా.. త‌న వారిని రంగంలోకి దింపారు. అంతేకాదు.. వ్యూహ‌క‌ర్త‌గా అనేక వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. కానీ, ఫ‌లితం మాత్రం శూన్యం. ఒక్క చోటంటే ఒక్క చోట కూడా.. జ‌న్ సురాజ్ పార్టీ అభ్య‌ర్థులు బ‌రిలో పోటీ ఇవ్వ‌లేక పోయారు. క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోవ‌డం మ‌రో చిత్రం!!. ఇది ఒక కొత్త పార్టీకి ప‌రాభ‌వం కంటే.. కూడా వెయ్యి మందికి స‌ల‌హాలు ఇచ్చి గెలిపించిన‌.. పీకే వంటి వ్య‌క్తికి మాత్రం ఘోర ప‌రాభ‌వ‌మేన‌ని అంటున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం ముగిసిన ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌రిగిన ప్ర‌చారంలో ప్ర‌త్య‌ర్థి బంధువును చంపించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట‌యిన సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను ప్ర‌జ‌లు మ‌రోసారి గెలిపించారు. అది కూడా ట్రెమండ‌స్ మెజారిటీతో కావ‌డం గ‌మ‌నార్హం. ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్ ఇటీవ‌ల ప్ర‌చారం స‌మ‌యంలో హ‌త్య‌కు గుర‌య్యారు. ఆయ‌నను ఓ వ్య‌క్తి తుపాకీతో న‌డిరోడ్డుపై ప్ర‌చార స‌మ‌యంలోనే హ‌త్య‌చేశారు. దీని వెనుక అనంత్‌ సింగ్ ఉన్నార‌ని గుర్తించిన పోలీసులు వెంట‌నే అరెస్టు చేశారు. ఆయ‌న ఓటు కూడా వేయ‌లేదు. కానీ, ఆయ‌న పోటీ చేసిన‌.. మొకామా నియోజకవర్గంలో 28 వేల పైచిలుకు ఓట్తో విజ‌యం ద‌క్కించుకున్నారు. చిత్రం కాక మరేమిటి?.

అదే విదంగా మరో చిత్ర విచిత్రం కూడా ఈ ఎన్నిక‌ల్లో చోటు చేసుకుంది.. ప్ర‌జ‌ల కోస‌మే తాను పోటీ చేస్తున్నాన‌ని చెప్పిన‌.. ప్లూరల్స్ పార్టీ(కొత్త‌పార్టీ) అధినేత పుష్ప‌మ్ ప్రియ చౌధ‌రి... తీవ్ర శ‌ప‌థం చేశారు. ద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిస్తేనే తాను నోటికి మాస్క్ తీస్తాన‌ని శ‌ప‌థం చేశారు. కానీ, ఆమెకు డిపాజిట్ ద‌క్క‌లేదు. తాజాగా వ‌చ్చిన ఫ‌లితాల్లో చౌధ‌రి 8వ స్థానానికే ప‌రిమితం అయ్యారంటే.. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఎలా ఉందో అర్ధ‌మవుతుంది. మొత్తానికి ఇప్పుడు ఆమె మాస్క్ తీస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News