బీహార్‌లో హై అలర్ట్: కౌంటింగ్‌కు ముందు కలకలం!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అంటేనే పెద్ద రచ్చ అనే మాట ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది.;
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ శుక్రవారం జరగనుంది. అయితే.. దీనికి ముందు ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో కేంద్ర ఎన్నికల సంఘం హై అలర్ట్ ప్రకటించింది. కేంద్ర పారా మిలి టరీ బలగాలను మరిన్ని మోహరించింది. అదేవిధంగా క్విక్ యాక్షన్ రెస్పాన్స్ టీంను కూడా అందుబాటు లో ఉంచింది. ఏం జరిగినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. అంతేకాదు.. రాజకీయ నాయకులకు కొన్ని ఆంక్షలు కూడా విధించింది.
ఎందుకీ హడావుడి?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అంటేనే పెద్ద రచ్చ అనే మాట ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. ``ఒక్క లాఠీ చార్జీ కూడా లేకుండా.. ఎన్నికల క్రతువును నిర్విఘ్నంగా పూర్తి చేశాం. ఇది ప్రజల స్ఫూర్తికి నిదర్శనం`` అని పేర్కొంది. ఇది వాస్తవమే. ఎందుకంటే.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా హత్యలు, దోపిడీలు, బూత్ రిగ్గింగులు.. కొట్లాటలు, లాఠీ చార్జీలు వంటివి బీహార్‌లో కామన్. కానీ, ఈ సారి ఆ తరహా పరిస్థితులకు ప్రజలు దూరంగా ఉన్నారు.
ఇక, ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత.. సర్వేలు వచ్చాయి. వాటిలో దాదాపు అన్ని సర్వేలు కూడా.. ఎన్డీ యే కూటమికే పట్టం కట్టాయి. ఇది కాంగ్రెస్ నేతృత్వంలో మహాఘఠ్ బంధన్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో ఈ కూటమి నాయకులు రగిలిపోతున్నారు. ఆది నుంచి ఓట్ చోరీ అంశాన్ని.. బూతుల్లో మేనేజ్ అంశాన్నీ ప్రస్తావిస్తున్న ఆర్జేడీ నాయకులు మరింత ఆగ్రహంతో ఉన్నారు. ``సర్వేలు నిజమై.. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని భావించడం లేదు.`` అని వారు బల్లగుద్దినట్టు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఫలితం కనుక తారుమారై.. వారు ఊహించినట్టు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్ బంధన్ అధికారంలోకి రాకపోతే..ఏమైనా జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్టు తెలిసింది. దీంతో ముందుగానే ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కు ముందు రోజు, కౌంటింగ్ జరిగే రోజు.. తర్వాత రోజు సాయంత్రం వరకు కూడా.. 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అనుమానం వస్తే.. నాయకులను గృహ నిర్బంధం చేసే హక్కులను కూడా కల్పించారు. సో.. ఇదీ.. సంగతి!!