చంద్రబాబు పుట్టినరోజకు భువనేశ్వరి గిఫ్టు ఇదే

చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇచ్చిన విరాళంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఈ రోజు ఉచితంగా భోజనం అందించనున్నారు.;

Update: 2026-04-20 05:29 GMT

ఏపీ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 77వ ఏట అడుగు పెడుతున్న చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా పదహారో పుట్టినరోజుగా చెప్పాలి. ఇప్పటివరకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. 2024లో సీఎంగా పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత చేసుకుంటున్న రెండో పుట్టినరోజుగా చెప్పాలి. గత ఏడాది చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి.. చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన అన్న క్యాంటీన్ కు రూ.75 లక్షల విరాళాన్ని అందజేయటం తెలిసిందే.

ఇదే సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా నారా భువనేశ్వరి కొనసాగించారు. చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళాన్ని అన్న క్యాంటీన్ ట్రస్టుకు అందజేశారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో విరాళం చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేస్తూ.. ‘మీ పుట్టినరోజుకు మేమిచ్చే బహుమతి ఇదే’అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా చంద్రబాబు సతీమణిని అభినందించారు.

చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇచ్చిన విరాళంతో ఏపీ వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఈ రోజు ఉచితంగా భోజనం అందించనున్నారు.ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావించాలి. చంద్రబాబుకు వ్యక్తిగత బహుమతుల కంటే కూడా.. సామాజిక సేవకు ఉపయోగపడే బహుమతుల్ని ఇష్టపడతారని.. అందుకే ఆయన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలను తాము చేపడతామని భువనేశ్వరి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజు.. పెళ్లిరోజు.. నచ్చిన సందర్భాల్ని పురస్కరించుకొని అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని గొప్పగా తీసుకెళుతున్నట్లుగా చెప్పిన చంద్రబాబు.. ‘‘భక్తులు.. దాతల సహకారంతో తిరుమలలో నాలుగు దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోంది. ప్రముఖ దేవాలయాల్లో అన్నప్రసాదం అందిస్తున్నాం. అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే కడుపు నింపుతున్నాం. ఇదో స్ఫూర్తిదాయక కార్యక్రమంగా మారి బ్రాండ్ ను క్రియేట్ చేయాలి’’ అని కోరారు.

అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిత్యం లక్షల మంది పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ల కారణంగా రోజువారీ కూలీలు.. పేదలు రూ.5లతో భోజనం చేసేందుకు వీలువుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు అందరూ ఆర్థికంగా చేయూత ఇవ్వాలన్న పిలుపు అందరికి మేలు చేసేదిగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. తన పుట్టిన రోజును పురస్కరించుకొని చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరిలు విజయవాడ పటమట లోని అన్న క్యాంటీన్ లో ఈ రోజు (సోమవారం) ఉదయం 9.30 గంటలకు అల్పాహారం చేయనున్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్న క్యాంటీన్లలో జరిగే అన్నదాన కార్యక్రమాల్లో మంత్రులు.. ఎంపీలు..ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు భాగస్వామ్యం కానున్నారు. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఒక పండుగలా జరిపేలా పసుపు దండు సన్నద్దం అవుతోంది.


Tags:    

Similar News