భూమనకు మరో ఉచ్చు.. ఏం జరిగింది?
వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇప్పటికే రెండు కేసులు పెట్టింది.;
వైసీపీ నాయకుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇప్పటికే రెండు కేసులు పెట్టింది. హిందూ ధర్మాన్ని ఆయన రెచ్చగొడుతున్నారని, తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని ఒక కేసు పెట్టింది. తర్వాత.. అలిపిరిలోని గోశాలలో గోవులు చచ్చిపోతు న్నాయనిరెండు మాసాల కిందట భూమన యాగీ చేశారు. దీనిపై అధికారులు తక్షణమే వివరణ ఇచ్చారు. అప్పట్లో మరో కేసు నమోదైంది. గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని కేసు పెట్టారు.
ఇక, ఇప్పుడు రెవన్యూ అధికారులు రంగంలోకి దిగారు. భూమనకు ఉన్న స్థిరాస్తిలో కొంత భాగం శ్రీకాళహస్తి దేవాలయానికి చెందిన భూములు ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. ఆయన తిరుపతిలో కొంత భూమిని కొనుగోలు చేశారు. అయితే.. దీనిలో సమీపంలోనే ఉన్న శ్రీకాళహస్తి భూములను కూడా కలుపుకొన్నారని.. తద్వారా.. దేవుడి భూములను కబ్జా చేశారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న రెవెన్యూ అధికారులు మంత్రి అనగాని సత్యప్రసాద్ ముందు పెట్టారు.
వీటిపై విచారణ చేయించిన.. మంత్రి.. తాజాగా కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చారు. శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన భూములను భూమన కబ్జా చేశారని నిర్ధారించడంతో ఆయనపై కేసు పెట్టాలని రెవెన్యూ అధి కారులను ఆదేశించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రెండు ఎకరాల స్థలం కబ్జా కు గురైనట్టు గుర్తించామన్నారు. దీని ప్రకారం.. సదరు సర్వే నెంబర్లతో సహా.. భూమన భూమి వివరాలను పోలీసులకు అందించారు. దీనిపై కేసు నమోదు చేయనున్నట్టు తిరుపతి డీఎస్పీ తెలిపారు. అయితే.. ఇది సివిల్ కేసు కావడంతో కోర్టు కేసు నమోదు చేసే విషయంపై ఆలోచన చేస్తున్నామన్నారు.