భోపాల్ విపత్తు... 337 టన్నుల వ్యర్థాలపై ప్రభుత్వం కీలక చర్య!
1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి (తెల్లారితే 3వ తేదీ) న భారతదేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ పారిశ్రామికరంగ చరిత్రలోనే అత్యంత ఘోర విపత్తు జరిగింది.;
1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి (తెల్లారితే 3వ తేదీ) న భారతదేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ పారిశ్రామికరంగ చరిత్రలోనే అత్యంత ఘోర విపత్తు జరిగింది. అదే... భోపాల్ గ్యాస్ దుర్ఘటన. నగర శివార్లలోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలోని ట్యాంకు నుంచి 40-45 టన్నుల అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీకైంది. చుట్టుపక్కల ప్రాంతాలకు క్షణాల్లో వ్యాపించింది.
కొన్ని నిమిషాల్లోనే నగరవాసులు ఆ విషవాయువును పీల్చి అల్లాడిపోయారు. ఊపిరి సరిగా అందక.. హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి బయటికొచ్చారు. ఆసుపత్రులకు పరుగులు తీస్తూ చాలామంది రోడ్లపైనే ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో... తొలి 3 రోజుల్లో దాదాపు 10 వేలమంది మృత్యువాతపడగా.. మొత్తంగా పాతిక వేలమంది వరకు మరణించినట్లు అంచనా!
ఇక గాయపడ్డవారి సంఖ్య దాదాపు 6 లక్షలు అని చెబుతున్నారు. ఈ విపత్తు సంభవించి గత ఏడాది డిసెంబర్ కి 40 ఏళ్లు పూర్తైన సందర్భంగా... తమకు తగిన పరిహారం అందించడంతోపాటు మెరుగైన పునరావాసం కల్పించాలని కోరుతూ ప్రధాని మోడీకి రాసిన లేఖలను పోస్టు చేశారు బాధితులు! ఆ సంగతి అలా ఉంటే.. ఆ విపత్తులోని వ్యర్థాలపై ప్రభుత్వం కీలక చర్య చేపట్టింది.
అవును... మధ్యప్రదేశ్ లోని భోపాల్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి వెలువడిన విష వాయువులు కనీవినీ ఎరుగని విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఫ్యాక్టరీలో మిగిలిపోయిన 337 టన్నుల వ్యర్థాలను ఓ డిస్పోజల్ ప్లాంట్ లో పూర్తిగా దహనం చేసినట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి ద్వివేది వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ప్లాంట్ లో మూడు ట్రయల్స్ లో 30 టన్నుల వ్యర్థాలను ముందు కాల్చగా.. మిగిలిన 307 టన్నులను మే 5 - జూన్ 30 మధ్య దహనం చేసినట్లు వెల్లడించారు. హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించి నిపుణుల పర్యవేక్షణలో గంటకు గరిష్టంగా 270 కిలోల చొప్పున వ్యర్థాలను దహనం చేసినట్లు పేర్కొన్నారు.
ఇక.. అంత భారీ స్థాయిలో వ్యర్థాలను కాల్చుతున్న సమయంలో.. పితంపూర్ ప్లాంట్ నుంచి వెలువడే వివిధ రకాల వాయువులను ఆన్ లైన్ యంత్రాంగం ద్వారా రియల్ టైమ్ లో పర్యవేక్షించినట్లు తెలిపారు. అలాగే.. ఈ వ్యర్థాల దహనం వల్ల వెలువడే వాయువులు పరిసర ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చర్యలు తీసుకున్నామని ద్వివేది తెలిపారు.
అదేవిధంగా... ఈ 337 టన్నుల వ్యర్థాలను దహనం చేసిన తర్వాత మిగిలిపోయిన బూడిద, ఇతర అవశేషాలను సంచులలో ప్యాక్ చేసి కంటైనర్లలో ప్లాంట్ లీక్ ప్రూఫ్ స్టోరేజ్ షెడ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. అనంతరం వాటిని భూమిలో పాతిపెట్టడానికి ప్రత్యేక ల్యాండ్ ఫిల్ సెల్ లను నిర్మిస్తున్నామని, వాటి నిర్మాణం నవంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపారు.