భోగాపురం ఎఫెక్ట్....పూసపాటి వారసురాలు సీటు షిఫ్ట్!
ఉత్తరాంధ్రకు తలమానికంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వచ్చేసింది. మరో ఆరు నెలలలో అక్కడ నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి.;
ఉత్తరాంధ్రకు తలమానికంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వచ్చేసింది. మరో ఆరు నెలలలో అక్కడ నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. దాంతో భోగాపురం సమీప ప్రాంతాలు అన్నీ హాట్ ఫేవరేట్ గా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి చూపూ నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం మీద ఉంది. ప్రస్తుతం ఆ సీటు జనసేన ఎమ్మెల్యే ఆధీనంలో ఉంది. లోకం మాధవికి 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇచ్చారు. నిజానికి చూస్తే నెల్లిమర్ల పరిధిలో టీడీపీ ఎంతో బలంగా ఉంది. టీడీపీ పుట్టాక జరిగిన అనేక ఎన్నికల్లో గతంలో భోగాపురం 2009 నుంచి నెల్లిమర్ల గా ఉన్న అసెంబ్లీ సీటులో అధిక విజయాలు దక్కాయి. చెక్కు చెదరని క్యాడర్ తో పాటు బలమైన సామాజిక వర్గం దన్ను టీడీపీకే ఉంది. అయితే పొత్తు ధర్మంలో జనసేనకు ఈ సీటు ఇచ్చారు.
టీడీపీ చేతులలోకి :
ఇక వచ్చే ఎన్నికల్లో మాత్రం ఈ సీటుని తామే తీసుకోవాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే అప్పటికి భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి స్వింగ్ లో ఉంటుంది. ఉత్తరాంధ్రా టూర్ కి ప్రధాని వచ్చినా ఇతర పెద్దలు వచ్చినా కూడా భోగాపురం ఎయిర్ పోర్టులోనే దిగాల్సి ఉంటుంది. దాంతో ప్రోటోకాల్ అధారిటీ అంతా నెల్లిమర్ల ఎమ్మెల్యేకే ఉంటుంది. అలాగే మంత్రి పదవి లేకపోయినా అంతకు మించిన దర్జా అయితే ఈ ఎమ్మెల్యేకు దక్కబోతున్నాయి. ఆ సీటు వేరే లెవెల్ అని చెబుతున్నారు. ఇక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పటికే పీక్స్ కి చేరింది. అది మరింతగా పుంజుకునే చాన్స్ ఉంది. అందుకే ఈ కీలక నియోజకవర్గాన్ని తమ చేతులలో ఉంచుకోవాలని టీడీపీ భావిస్తోంది అని అంటున్నారు.
విజయనగరం జనసేనకు :
ఈ పరిస్థితుల నేపథ్యంలో జనసేనకు విజయనగరం సీటుని ఇస్తారు అని అంటున్నారు. 2024 లోనే జనసేన విజయనగరం సీటు కోరింది. కానీ పూసపాటి వారసురాలు అదితి గజపతిరాజు అక్కడ నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఇవ్వడం కుదరలేదు అని అంటున్నారు. జనసేనకు ఆ సీటు ఇచ్చి నెల్లిమర్లను టీడీపీ తీసుకోవడం వరకూ ఓకే కానీ దశాబ్దాలుగా ఆ సీటు నుంచే పోటీ చేస్తూ ఎమ్మెల్యేలుగా గెలిచి వస్తున్న పూసపాటి వారిని తప్పిస్తే ఎలా అన్న చర్చ ఉంది. వారిని ఆ సీటు కాదని వేరే చోటకు మార్చడం సాధ్యమేనా అన్నది కూడా ఉంది. అయితే ఇపుడు అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ అయ్యారు. ఆయన పూర్తిగా రాజకీయాలను వదిలేసినట్లే. దాంతో అదితి గజపతిరాజుని కాదని జనసేనకు టికెట్ ఇవ్వడం అంటే హైకమాండ్ దే నిర్ణయం అని అంటున్నారు. ఇక అదితికి అన్యాయం చేయకుండా నెల్లిమర్ల నుంచి పోటీ చేయించే ఆలోచన కూడా ఉందని అంటున్నారు.
సమీకరణలు సైతం :
అయితే నెల్లిమర్లలో బలమైన సామాజిక వర్గంగా తూర్పు కాపులు ఉన్నారు. వారే మొదటి నుంచి ఈ సీట్లో నెగ్గుతూ వస్తున్నారు. పూసపాటి వారసురాలికి అక్కడ చాన్స్ ఇస్తే వారు ఎంతవరకూ ఊరుకుంటారు అన్నది మరో చర్చగా ఉంది. అదే సమయంలో ఏ మాత్రం వర్గ పోరు హెచ్చినా అది ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కాదు కానీ పూసపాటి వారసురాలి సీటుకు ఇబ్బంది రావచ్చు అన్న స్పెక్యులేషన్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.