మిత్రుడిని సీఎం ని చేసిన ఎన్టీఆర్ !

ఉమ్మడి ఏపీకి కేవలం ఏడు నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు భవనం వెంకటరామ్. ఈ రోజున భవనం వెంకటరామ్ జయంతి.;

Update: 2025-07-18 16:30 GMT

నందమూరి తారక రామారావు సినీ నటుడు కాక ముందు మంచి విద్యార్ధి, మంచి ఉద్యోగి, మంచి కళాకారుడు ఇలా ఆయనకంటూ ఎంతో మంది మిత్రులు ఉండేవారు. వారిలో సాహిత్యవేత్త గుంటూరు శేషేంద్ర శర్మ నుంచి తరువాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన భవనం వెంకటరామ్ లాంటి వారు ఉన్నారు. ఇక భవనం వెంకటరామ్ అయితే ఎన్టీఆర్ కి రూమ్మేట్ గా ఉన్నారు.

ఉమ్మడి ఏపీకి కేవలం ఏడు నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు భవనం వెంకటరామ్. ఈ రోజున భవనం వెంకటరామ్ జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. భవనం వెంకటరామ్ రాజకీయం చిత్రంగా సాగింది. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కానీ ఏకంగా మంత్రి అయిపోయారు. ఆయన పనితీరుని ఆయన ప్రతిభను మెచ్చిన ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆయనను విద్యా శాఖ మంత్రిగా చేశారు.

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 1978లో దేశంతో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు ఇందిరాగాంధీ వ్యతిరేక వెల్లువ సాగింది. ఉమ్మడి ఏపీలో మాత్రం ఇందిరకు బ్రహ్మరథం పట్టారు జనాలు. అలా 1978లో ఇందిరా కాంగ్రెస్ ని శ్రీమతి ఇందిరాగాంధీ ఏర్పాటు చేస్తే దక్షిణాదిన తొలిసారి ఆ పార్టీ పేరుతో అధికారంలోకి కాంగ్రెస్ ఐ వచ్చింది. అలా ఆ ప్రభుత్వానికి తొలి సీఎం గా చెన్నారెడ్డి చేశారు. ఇక ఆయన మంత్రివర్గంలో చూస్తే చాలా మందిని తీసుకున్నారు. కానీ అసలు చట్టసభలలో లేని భవనం వెంకటరామ్ ని తీసుకోవడమే విశేషం. ఆ తరువాత ఆయనను ఎమ్మెల్సీగా చేశారు.

మర్రి చెన్నారెడ్డి దిగిపోయాక సీఎం అయిన టంగుటూరి అంజయ్య కూడా భవనం వెంకటరామ్ ని విద్యా శాఖ మంత్రిగానే కొనసాగించారు. అంజయ్య తరువాత ఎవరు సీఎం అన్న చర్చ వచ్చింది. అప్పటికే తెలుగు నాట ప్రముఖ సినీ నటుడిగా వెలుగొందడమే కాకుండా పురాణ పాత్రలతో దేవుడిగా కూడా అంతా భావించే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన ప్రాంతీయ పార్టీ పెడుతున్నారని కాంగ్రెస్ కేంద్ర పెద్దలకు తెలిసింది.

దాంతో వారు కంగారు పడ్డారు. ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రాకుండా నిలువరించే ప్రయత్నాలు చేయాలని కూడా ఆలోచించారు. ఈ సమయంలో అంజయ్యని దించేశారు. మరి కొత్త సీఎం ఎవరు అంటే చాలా మంది రేసులో ఉన్నారు. వారిలో నాదెండ్ల భాస్కరరావు కూడా ఉన్నారు. అయితే శ్రీమతి ఇందిరాగాంధీ అత్యంత ఆశ్చర్యకరంగా భవనం వెంకటరామ్ ని ఎంపిక చేసారు ఆయన చెన్నారెడ్డి పుణ్యామని మంత్రి అయిన వారు, ఎమ్మెల్యే కూడా కారు, సీనియారిటీ చూసినా ఏమీ కాదు, మరి ఆయనను ఎందుకు ఎంపిక చేశారు అంటే దానికి ఒక కధ ఉందని అంటారు

ఎన్టీఆర్ కి మిత్రుడిగా భవనం వెంకటరామ్ ఉండడమే కాంగ్రెస్ పెద్దల దృష్టిలో ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది అని అంటారు. పైగా భవనం వెంకటరామ్ కూడా తనకు సీఎం పోస్టు ఇస్తే ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రానీయకుండా కట్టడి చేస్తాను అని కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు చెప్పారని రాయబారం నడిపారని చెబుతారు. అలా భవనం వెంకటరామ్ కి ముఖ్యమంత్రి పదవి దక్కింది.

ఆయన 1981లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇక్కడ భవనం వెంకటరామ్ చేసిన మరో తెలివైన పని ఏమిటి అంటే ఆ ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ ని స్వయంగా ఆహ్వానించడం. ఇక మద్రాస్ లో ఉన్న ఎన్టీఆర్ ప్రత్యేకించి పనిగట్టుకుని మరీ భవనం వెంకటరామ్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. అది ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద చర్చగా మారింది. మూడు షిఫ్టులూ షూటింగులు సినిమాలు తప్పించి కనీసం న్యూస్ పేపర్ కూడా చదవడానికి తీరిక లేని ఎన్టీఆర్ ఇలా ఒక సీఎం ప్రమాణ స్వీకారానికి వచ్చారు అంటే ఆయన కచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు అన్న భావన అప్పుడే మొదలైంది.

ఇక భవనం వెంకటరామ్ సీఎం అయ్యారు కానీ తన మిత్రుడికి రాజకీయాల్లోకి రావద్దని చెప్పారో లేదో తెలియదు. ఇక సడెన్ గా ఎన్టీఆర్ తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లుగా ఒక సినిమా షూటింగులో చెప్పిన మాటలు ఒక సంచలన వార్తగా ఆ తరువాత వచ్చింది. మరో వైపు చూస్తే కేంద్రం ఎంపిక చేసిన భవనం వెంకటరామ్ కి కాంగ్రెస్ లోని వర్గాలు సహకరించకపోవడంతో పాటు రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలు కావడంతో ఆయన్ని శ్రీమతి ఇందిరాగాంధీ తప్పించి ఆ ప్లేస్ లో కోట్ల విజయభాస్కరరెడ్డి కొత్త సీఎం గా ప్రకటించారు.

మొత్తం మీద చూస్తే కేవలం ఏడు నెలల కాలం మాత్రమే ఉమ్మడి ఏపీ సీఎం గా పనిచేసిన భవనం వెంకటరామ్ కి ఎన్టీఆర్ మిత్రుడు అన్న ట్యాగ్ చాలానే ఉపయోగపడిందని చెబుతారు. ఆయన కంటే ముందు నుంచి ఉన్న వారు ఎంతో మందిని దాటుకుని సీఎం అయిపోయారు. మరి ఇది ఎన్టీఆర్ కి తెలుసా లేదా అన్నది పక్కన పెడితే భవనం సీఎం కావడం వెనక ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉంది అని అంటారు. ఒక్క భవనం మాత్రమే కాదు ఆ తరువాత నాదెండ్ల భాస్కరరావు సీఎం కావడానికి ఎన్టీఆర్ కారణం అని కూడా చెప్పాల్సిందే.

Tags:    

Similar News