గత పాలకుల విధ్వంసాన్ని సరిచేస్తున్నాం: భట్టి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. శుక్రవారం అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.;
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.. శుక్రవారం అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన.. గత పాలకుల విధ్వం సాన్ని, ధ్వంసం చేసిన వ్యవస్థలను సరిచేస్తున్నామన్నారు. అనేక ఇబ్బందులు ఎదురైనా.. ఎక్కడా వెన్ను చూపడం లేదన్నారు. ''సాధకుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా.. ముందుకే సాగుతాడు.. అన్న సూత్రాన్ని మేం పాటిస్తున్నాం'' అని వ్యాఖ్యానించారు.
దీనికి ముందు వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రి భట్టి విక్రమార్క అందించారు. అనంతరం.. కేబినెట్ సమావేశంలో దీనిని ఆమోదించారు. ఇంతకు మునుపు సతీ సమేతంగా.. ప్రజా భవన్‌లో ఉన్న పోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. కాగా.. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్న భట్టి.. ''మేం పాలకులం కాదు.. సేవకులం'' అని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయాలన్న తపన తమలో వేళ్లూనుకుందని పేర్కొంటూ.. ఈ సందర్భంగా గాంధీ వ్యాఖ్యలను ఉటంకించారు.
ప్రజలు కడుతున్న పన్నులను తిరిగి వారి సంక్షేమానికే వినియోగిస్తున్నట్టు తెలిపారు. ప్రతి పైసాకు తాము కాపలాదారులమేనని భట్టి తెలిపారు. ప్రజలకు మేలు చేయడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. దేశంలో తెలంగాణను నెంబర్ 1 స్టేట్‌గా నిలిపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మొత్తంగా బడ్జెట్ 3,24,234 కోట్ల రూపాయలతో రూపొందించారు. సంక్షేమ, అభివృద్ది పథకాలకు.. నిధులు కేటాయించారు. కాగా.. గొప్పల కోసం తాము అబద్ధాలు చెప్పబోమని వ్యాఖ్యానించడం గమనార్హం.