ఢిల్లీలోని భట్టి ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయా?
తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న భట్టి విక్రమార్కకు ఢిల్లీలో ఉన్న ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన వైనాన్ని బయటపెట్టారు.;
జూబ్లిహిల్స్ ఉప పోరు నేపథ్యంలో అధికార కాంగ్రెస్.. విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలు తూటాల మాదిరి పేలుతున్నాయి. రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నువ్వెంత? అంటే నువ్వెంత? అన్న రీతిలో మాటలు ఉంటున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ నోటి నుంచి వచ్చిన ఒక వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో భారీ చర్చకు కారణమైంది.
తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న భట్టి విక్రమార్కకు ఢిల్లీలో ఉన్న ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేసిన వైనాన్ని బయటపెట్టారు. నిజానికి భట్టి నివాసంలో ఐటీ దాడులు అన్న అంశం ఎప్పుడూ బయటకు వచ్చింది లేదు. ఒకవేళ హరీశ్ మాట నిజమే అయితే.. అదో రాజకీయ ప్రధానాంశంగా మారుతుందన్నది మర్చిపోకూడదు. అయినా.. భట్టి ఇంట్లో ఐటీ తనిఖీలు జరగటం తప్పేం కాదు. కానీ.. రైడ్స్ జరిగిన వేళలో ఏదైనా భారీగా దొరికి ఉండే అదో పాయింట్ అవుతుంది.
అలాంటిదేమీ లేకుండా.. తనిఖీలు నిర్వహించి.. మరేమీ దొరకనప్పుడు ఆ విషయాన్ని ఐటీ శాఖ ఎందుకు వెల్లడిస్తుంది? ఒకవేళ.. తనిఖీల్లో భాగంగా దొరికి ఉంటే.. ఆ విషయాన్ని హరీశ్ రావు సైతం ప్రస్తావించాల్సిఉంటుంది. అలాంటిదేమీ లేకుండా ఢిల్లీలోని భట్టి ఇంట్లో ఐటీ తనిఖీలు అంటే సరిపోదు. ఏమైనా భారీగా ఆస్తులు దొరికి.. వాటిని దాచి పెట్టే పరిస్థితి నెలకొని ఉంటే.. ఆ విషయాన్ని హరీశ్ ఆధారాలతో ప్రస్తావించి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా అరకొర ఆరోపణలతో హరీశ్ సాధించేదేమీ ఉండదన్న విషయం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న హరీశ్ కు తెలీకుండా ఉండదు.