శత్రు డ్రోన్లకు కాలం చెల్లినట్టే.. ఒడిశా తీరంలో దుమ్మురేపిన 'భార్గవాస్త్ర'

ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో రిమోట్ ద్వారా కంట్రోల్ చేసే డ్రోన్స్ ఒక ప్రధానమైన ముప్పుగా పరిణామించాయి.;

Update: 2025-05-14 16:03 GMT
శత్రు డ్రోన్లకు కాలం చెల్లినట్టే.. ఒడిశా తీరంలో దుమ్మురేపిన భార్గవాస్త్ర

భారతదేశం 'భార్గవాస్త్ర' పేరుతో అభివృద్ధి చేసిన సరికొత్త కౌంటర్ డ్రోన్ వ్యవస్థ విజయవంతంగా పరీక్షించింది. పూర్తిగా స్వదేశీయ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ పరికరం ఒడిశాలోని గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో టెస్ట్ చేశారు. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (SDAL) ఈ డ్రోన్‌ను రూపొందించింది. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చే డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

గోపాల్‌పూర్‌లో సీనియర్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారుల సమక్షంలో మంగళవారం భార్గవాస్త్ర పరీక్ష జరిగింది. ఒక్కో రాకెట్‌ను ప్రయోగించి రెండుసార్లు పరీక్షించారు. ఈ రెండు పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి. 'హార్డ్ కిల్' టెక్నాలజీతో అమర్చబడిన భార్గవాస్త్ర 2.5 కిలోమీటర్ల దూరం వరకు వచ్చే డ్రోన్‌లను గుర్తించి నాశనం చేయగలదు. సముద్ర మట్టానికి 5,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో, భౌగోళికంగా విభిన్నమైన ప్రాంతాలలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీన్ని ఉపయోగించవచ్చు.

ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో రిమోట్ ద్వారా కంట్రోల్ చేసే డ్రోన్స్ ఒక ప్రధానమైన ముప్పుగా పరిణామించాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్‌లను విస్తృతంగా ఉపయోగించారు. ఇటీవలే జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కూడా వీటిని భారతదేశంపై ప్రయోగించింది. అయితే, పాకిస్తాన్ భారత సరిహద్దు జిల్లాలను, నగరాలను లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్‌లను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన భార్గవాస్త్ర విజయం భారతదేశ రక్షణ రంగానికి ఒక గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు.

Tags:    

Similar News