ఎన్టీఆర్ కు భార‌త ర‌త్న‌.. బాబుకు ఉన్న అడ్డంకి ఏంటి .!

ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. ఇది సుదీర్ఘకాల డిమాండ్. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.;

Update: 2025-09-18 14:30 GMT

ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. ఇది సుదీర్ఘకాల డిమాండ్. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 2004- 2009 మధ్యకాలంలో జోరుగా ఈ డిమాండ్ ను తెర‌మీద‌కు తీసుకువచ్చారు. అప్పట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన హవాను తగ్గించేందుకు ఎన్టీఆర్ నామస్మరణ భారీ స్థాయిలో పెరిగింది. ఆ సమయంలో ఎంపీగా ఉన్న ఆ తర్వాత కేంద్ర మంత్రిగా మారిన ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎన్టీఆర్కు భారతరత్న తీసుకువచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నానని పదేపదే చెప్పుకొచ్చారు. కానీ అప్పట్లో సాధ్యం కాలేదు.

ఈ క్రమంలోనే ఆమె పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని అంటే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని అక్కడ పెట్టేలాగా అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఆ పని సాధించారు కూడా. ప్రస్తుతం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఇక మరోసారి ఇటీవల కాలంలో ఎన్టీఆర్కు భారతరత్న అనే మాట తెరమీదకు వచ్చింది. దీనికి ప్రధానమైన వ్యూహం ఏంటంటే ప్రస్తుతం పోలరైజ్ గా మారిన ఓటు బ్యాంకును ఏకీకృతం చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశం. ఎన్టీఆర్ అటు బీసీలకు ఇటు కమ్మ సామాజిక వర్గానికి అదే విధంగా పేదలు బడుగులు బలహీన వర్గాలకు కూడా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.

అటువంటి నాయకుడికి భారతరత్న ఇప్పించడం ద్వారా బలమైన ఓటు బ్యాంకు ను సుస్థిరం చేసుకునే అవకాశం ఉంటుందన్నది చంద్రబాబు వ్యూహం. వ్యూహం బాగానే ఉన్నప్పటికీ భారతరత్న ఇప్పించే విషయంలోనూ ఇచ్చే విషయంలోనూ కూడా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారా అన్నది సందేహం. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే. పైగా రెండో అతిపెద్ద పార్టీ టిడిపినే. బిజెపికి 240 స్థానాలు ఉంటే దానికి మద్దతుగా టిడిపికి బలమైన సంఖ్యలో స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు టిడిపి కనుక మేము మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే మోడీ ప్రభుత్వమే అసలు మనుగడలో ఉండే అవకాశం లేదు.

అంటే ఇది ఒక బలమైన ప్రధానమైన అవకాశం చంద్రబాబుకు దక్కినట్టు అయింది. ఈ సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న సాధించాలనేది చంద్రబాబు యొక్క ప్రధాన వ్యూహం. కానీ భారతరత్నకు ఎక్కడ అడ్డంకులు వస్తున్నాయి అనేది కీలక అంశం. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం భారతరత్నను ప్రకటించిన తర్వాత ఎవరికైతే భారతరత్న ప్రకటించారో వారి తాలూకా కుటుంబ సభ్యుల్లో మొట్టమొదటి వ్యక్తి అంటే భర్త లేదా భార్య వస్తారు. ఆ తర్వాతే కుమారులు వస్తారు. ఇది నిబంధనల ప్రకారం లెక్క. దీని ప్రకారం ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే ఆయన భారీగా ఉన్న లక్ష్మీపార్వతి అందుకోవాల్సి ఉంటుంది.

ఇది పెద్ద మైనస్ అవుతుందన్నది టిడిపి నాయకులు అదేవిధంగా నందమూరి ఫ్యామిలీ కూడా అంచనా వేస్తున్న విషయం. ఎందుకంటే నిబంధనల ప్రకారం చేయకపోతే భారతరత్న అనే అత్యంత విలువైన గౌరవప్రదమైన అవార్డుకు తీవ్ర అవమానం వచ్చే అవకాశం ఉంటుంది. పైగా దేశవ్యాప్తంగా అత్యంత గౌరవమైన అవార్డుకు విమర్శలు కూడా వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చంద్రబాబు చెప్పినట్టు చేయడానికి వీలులేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం భారతరత్న ఇవ్వాలి అంటే కొన్ని రూల్స్ ను పాటించాల్సి ఉంటుంది.

కాబట్టి భారతరత్న తీసుకోవాలి అంటే లక్ష్మీపార్వతి తీసుకోవాలి. అయితే ఆమె ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ భారతరత్న అవార్డును ఎన్టీఆర్కు ప్రకటిస్తే నందమూరి కుటుంబ సభ్యులు తీసుకున్న నాకు అభ్యంతరం లేదని.. ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు ఎవరు తీసుకున్న అభ్యంతరం లేదని అన్నారు. కానీ ఆ కార్యక్రమానికి తనను అనుమతిస్తే చాలని పేర్కొన్నారు. ఇది కూడా ఒకరకంగా రాజకీయంగా టిడిపిని ఇబ్బంది పెట్టే అంశం. ఎంత లేదన్న ఎన్టీఆర్ భార్యగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత జాతీయ మీడియా ఆమెను పలకరించకుండా పోదు. ఆమెను గుర్తించకుండా ఎవరూ ఉండరు.

ఈ గుర్తింపును కోరుకోవడం సహజంగానే టిడిపికి ఇష్టం లేదు. వైసీపీలో లక్ష్మీపార్వతి కీలకంగా వ్యవహరిస్తుండడం పైగా ఆమె వైసీపీ తరఫున మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేయడం వంటివి అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతరత్న విషయంలో ఈ చిన్న అంశం ఇబ్బందిగాను అడ్డంగి గాను మారింది అనేది పరిశీలకులు చెబుతున్న మాట. ఈ ఒక్క విషయంలో చర్చించడం ద్వారా లేదా సర్దుకుపోవడం ద్వారా పరస్పర సహకారానికి బాటలు వేస్తే భారతరత్న ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ సుఖంగానే ఉన్నట్టు స్పష్టం అవుతుంది.

Tags:    

Similar News