ఈ ముంబై బిచ్చగాడు ప్రపంచంలోనే 'కుబేర'... ఆస్తులు చూస్తే షాకే!
అవును... ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఆజాద్ మైదాన్ వంటి ప్రదేశాల దగ్గర భిక్షాటన చేస్తుంటాడు భరత్ జైన్.;
"నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ... పేదవాడిగానే చనిపోతే అది కచ్చితంగా నీ తప్పే" అని అంటారు. ఈ విషయాన్ని అత్యంత బలంగా ఫిక్సయ్యాడో ఏమో కానీ... ముంబై వీధుల్లోనూ, రైల్వే స్టేషన్ లోనూ బిక్షాటన చేసే భరత్ జైన్ అనే వ్యక్తి.. కోట్ల రూపాయల ఆస్తులతో ప్రపంచలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిలా పరిగణించబడ్డాడు.
అవును... ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఆజాద్ మైదాన్ వంటి ప్రదేశాల దగ్గర భిక్షాటన చేస్తుంటాడు భరత్ జైన్. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబంలో జన్మించిన భరత్.. ఆహారం, దుస్తులు, నివాసం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోకుండానే సంవత్సరాల తరబడి కష్టాలను భరించారు. ఈ క్రమంలో సుమారు 40 ఏళ్లుగా బిక్షాటన చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం రోజుకు రూ.2,000 నుండి రూ.2,500 వరకు సంపాదిస్తున్నాడు. అంటే నెలకు రూ.60,000 కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్నాడన్నమాట. ఇది భారతదేశంలోని చాలా మంది ఉద్యోగులు, ఎక్స్ పర్ట్స్ జీతం కంటే ఎక్కువే అని చెప్పొచ్చు! అయితే.. తన సంపాదనను వృధా చేయకుండా, జైన్ శ్రద్ధగా పొదుపు చేసి, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాడు.
ఈ క్రమంలో ప్రస్తుతం అతనికి ముంబైలో రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయి. అక్కడ అతను తన తండ్రి, సోదరుడు, ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నాడు. అయినప్పటికీ జైన్ భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరుస్తూనే ఉందని అంటున్నారు. అంతే కాదు.. జైన్ కు థానేలో రెండు షాపులు కూడా ఉన్నాయి.
వాటిని అద్దెకు ఇచ్చారు. దీంతో.. వాటి నుండి అతనికి నెలకు రూ.30,000 అద్దె వస్తుంది. ఈ విధంగా సంపాదించిన జైన్ ఆస్తుల నికర విలువ సుమారు రూ.7.5 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో... ఇతడి ప్రయాణం అద్భుతమైనదని అంటున్నారు నెటిజన్లు!
అయితే... జైన్ కుటుంబ సభ్యులెవరూ భిక్షాటన చేయడం లేదు. అతని ఇద్దరు కుమారులు ముంబైలోని ఒక ప్రసిద్ధ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు. మరోవైపు ఆ కుటుంబం స్టేషనరీ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే భరత్ జైన్.. ప్రపంచలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిలా పరిగణించబడ్డాడని అంటున్నారు.