అమ్మో.. అమ్మమ్మో..! 33 ఏళ్ల ప్రియుడితో క‌లిసి భర్తకు మ‌ర‌ణ‌శాస‌నం

సోష‌ల్ మీడియా ప్రభావ‌మో... క‌ట్టు త‌ప్పిన ప్రవర్తనో...వయసును కూడా మరిచిన వ్యామోహమో..! సమాజంలో తరచూ కొన్ని అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి.;

Update: 2025-08-22 04:05 GMT

సోష‌ల్ మీడియా ప్రభావ‌మో... క‌ట్టు త‌ప్పిన ప్రవర్తనో...వయసును కూడా మరిచిన వ్యామోహమో..! సమాజంలో తరచూ కొన్ని అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. ప్రియుడితో కలిసి వివాహితను హత్య చేసిన భర్త, ప్రేమించినవాడితో కుటుంబ సభ్యులను చంపించిన యువతి, స్నేహితులకు డబ్బిచ్చి భర్తను అడ్డుతొలగించుకున్న మహిళ వంటి వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాం. అయితే, ఇవన్నీ ఒకే వయసువారి మధ్య ఏర్పడిన బంధాల కారణంగా జరుగుతున్నవి. కానీ, కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళ దారుణం చూస్తే ఔరా అని నోరెళ్లబెట్టాల్సిందే.

ఆమెకు 56.. అతడికి 33

కొడుకు వయసు యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది బెంగళూరుకు చెందిన మహిళ. అతడి వయసు 33 కాగా, ఆమెకు 56. మహిళ కుమార్తెకు వివాహమై కూతురు కూడా ఉంది. అంటే, ఆమె అమ్మమ్మ అన్నమాట. అయితే, ఆ మహిళ యువకుడి మోజులో పడింది. వీళ్లద్దరి మధ్య సంబంధం ఎన్నేళ్లుగా సాగుతుందో తెలియదుగానీ... తమ సంతోషానికి 60 ఏళ్ల భర్త అడ్డువస్తుండడంతో దారుణానికి ఒడిగట్టింది.

అనుమానం రాకుండా అమ్మ ఫోన్‌తో..

56 ఏళ్ల మహిళ తన ప్రియుడితో తరచూ ఫోన్‌లో మాట్లాడేది. అయినా, ఎవరికీ ఎప్పుడూ అనుమానం రాలేదు. కారణం.. ఆ మహిళ మాట్లాడింది యువకుడు తల్లి ఫోన్‌ నుంచి కావడమే. అంటే.. భర్త హత్య కూడా ప్రణాళిక ప్రకారమే చేసి ఉంటుందని తేటతెల్లమైంది. ఈమేరకు పోలీసులు కూడా 60 ఏళ్ల వ్యక్తి హత్య ప్రణాళిక ప్రకారమే జరిగిందని పోలీసులు తెలిపారు. మహిళ, యువకుడు కొంతకాలంగా సంబంధంలో ఉన్నారని.. ఎవరికీ అనుమానం రానీయలేదని చెప్పారు.

మొసలి కన్నీటితో నమ్మించి...

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళ అందరినీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. భర్త మృతితో చాలా బాధపడుతున్నట్లు నటించి.. ఎప్పటిలాగానే ప్రియుడితో సంబంధం కొనసాగించిందని, మొసలి కన్నీరు కార్చిందని పోలీసులు తెలిపారు. తన భర్తది సహజ మరణం అని బంధువులు, కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగును నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, తన ప్రవర్తనలో తేడా ఉండడంతో అనుమానాలు కలిగాయి. దీనికితోడు పోలీసుల దర్యాప్తు సమయంలో దొరికిన ఆధారాలు దొంగను పట్టించాయి.

వివాహేతర సంబంధం, హత్యా నేర దాచినా దాగవు..

బెంగళూరు కేసులో మహిళ, ఆమె ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. వివాహేతర సంబంధాలు ఎంతోకాలం దాగవని పేర్కొన్నారు. ఇలాంటి సంబంధాలను కొనసాగిస్తే.. ఎలాంటి నేరమైనా చేసేందుకు పురికొల్పుతాయని చెప్పారు. మరోవైపు టెక్నాలజీ బాగా విసృ‍్తతం అయిన ఈ రోజుల్లో ఎంతటి నేరం చేసినవారైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

Tags:    

Similar News