సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నుంచి రూ.32 కోట్లు కొట్టేశారు.. ఎలాగో తెలిస్తే షాకే!
రోజు రోజుకీ డిజిటల్ అరెస్ట్ తరహా సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.;
రోజు రోజుకీ డిజిటల్ అరెస్ట్ తరహా సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ చాలా మంది బాధితులు ఉన్నారు. వీరిలో కొంతమంది పూర్తిగా మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వ్యక్తిగత డిజిటల్ అరెస్టుకు సంబంధించిన అతిపెద్ద సైబర్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును... సైబర్ క్రైమ్ సిండికేట్ నెలల తరబడి నిరంతరాయంగా బలవంతం చేసిన తర్వాత.. ఓ మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిజిటల్ అరెస్ట్ స్కామ్ లో అతి పెద్ద బాధితురాలిగా మిగిలారు! ఈ క్రమంలో ఆమె రూ.31.8 కోట్లు పోగొట్టుకున్నారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.. దీని వెనుక షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉమారాణి సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.32 కోట్లు పోగొట్టుకున్నారు. తొలుత 2024 సెప్టెంబర్ లో డీ.హెచ్.ఎల్. అంధేరీ అధికారిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి.. బాధితురాలికి కాల్ చేశాడు. ఈ క్రమంలో.. ఆమె పేరు మీద వచ్చిన పార్శిల్ లో క్రెడిట్ కార్డులు, పాస్ పోర్టులు ఉన్నాయని తెలిపాడు.
ఈ క్రమంలో.. వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారని బెదిరించాడు.. అనంతరం, మీకు సీబీఐ అధికారుల నుంచి కాల్ వస్తుందని తెలిపాడు. ఈ నేపథ్యంలో.. సీబీఐ అధికారులుగా నటిస్తున్న వ్యక్తులు బాధిత మహిళకు వీడియో కాల్ చేశారు.. ఆ పార్శిల్ ఆధారంగా డిజిటల్ అరెస్ట్ చేసినట్లు బెదిరించారు. పోలీసులను సంప్రదించొద్దని సూచించారు.
రెండు రోజులు స్కైప్ లో నిఘా..!:
ఈ నేపథ్యంలో ప్రమాదకరమైన నేరస్థులు మీ ఇంటిని పర్యవేక్షిస్తున్నారని.. అందువల్ల మీ భద్రత ప్రమాదంలో పడుతుందని పేర్కొంటూ స్థానిక పోలీసులను లేదా న్యాయవాదులను సంప్రదించొద్దని సైబర్ నేరగాళ్లు ఆమెకు సూచించారు. ఇదే సమయంలో.. కుటుంబ సభ్యులతో ఏమీ పంచుకోవద్దని ఆమెను హెచ్చరించారు. అలా చేస్తే కుటుంబం కూడా ఇబ్బందుల్లో పడుతుందని బెదిరించారు.
అయితే... త్వరలో తన కొడుకు పెళ్లి జరగబోతోందని భయపడిన ఆమె.. ఈ కండిషన్స్ కి అంగీకరించింది. ఈ సమయంలో ఆ ముఠా అందించిన స్కైప్ ఐడీల ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేయాలని చెప్పినట్లు చేసింది. ఈ క్రమంలో స్కైప్ ద్వారా రెండు రోజులపాటు ఆమెను పర్యవేక్షించారు.
6 నెలల వ్యవధిలో సుమారు రూ.32 కోట్లు!:
ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే అన్ని ఆస్తులనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని చెప్పి.. తాము చెప్పిన 187 బ్యాంక్ ఖాతాలకు ఆ నగదును బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. ఈ విధంగా ఆమెను డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆరు నెలల వ్యవధిలో ఆమె నుంచి సుమారు రూ.32 కోట్లు ట్రన్స్ ఫర్ చేయించుకున్నారు.
నగదు మొత్తం ట్రాన్స్ ఫర్ అయిన అనంతరం నకిలీ క్లియరెన్స్ లెటర్ ను కూడా ఆమెకు జారీ చేశారు! ఫిబ్రవరిలో ఆ మొత్తన్ని తిరిగి ఇస్తామని చెప్పారు. అయినప్పటికీ ఆ నగదు తిరిగి పంపకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు నవంబర్ 14న పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ షాకింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది.