శృంగార పటుత్వం కోసం పాకులాట.. రూ.48 లక్షలు మోసపోయిన టెకీ కథ

సె*క్స్ ఆరోగ్య సమస్యలు చాలా మందికి ఉంటాయి. కానీ ఈ విషయాలను డాక్టర్లతో పంచుకోవడానికి చాలామంది సంకోచిస్తారు.;

Update: 2025-11-25 14:30 GMT

సె*క్స్ ఆరోగ్య సమస్యలు చాలా మందికి ఉంటాయి. కానీ ఈ విషయాలను డాక్టర్లతో పంచుకోవడానికి చాలామంది సంకోచిస్తారు. ఈ నిశ్శబ్దమే ప్రమాదానికి దారి తీస్తుంది. సరైన వైద్య పద్ధతులు కంటే “ఇన్‌స్టంట్ క్యూయర్”, “100% గ్యారెంటీ” అంటూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేసిన పైసా దోపిడీ దందాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ బలహీనతను మోసగాళ్లు బాగా క్యాష్ చేసుకుంటున్నారు.

లైంగిక ఆరోగ్య సమస్యల విషయంలో చాలా మంది వ్యక్తులు దాచుకునే సిగ్గు, భయాన్ని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు ఎలా దోపిడీకి పాల్పడుతున్నారో తెలియజేసే దారుణమైన ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. శృంగార పటుత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ₹48 లక్షలు పోగొట్టుకోవడమే కాక, కిడ్నీ సమస్యలకు గురైనట్లు సమాచారం.

*మోసపూరిత ‘చికిత్స’తో టెకీకి హాని

బెంగళూరులోని క్యాప్‌జెమినిలో పనిచేస్తున్న ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన సె*క్సువల్ పెర్ఫార్మెన్స్ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక "ఆయుర్వేద దవాఖానా"ను ఆశ్రయించారు. అక్కడ తనను తాను వినయ్ గురూజీ లేదా విజయ్ గురూజీగా పరిచయం చేసుకున్న వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సదరు గురూజీ అరుదైన చెట్లు, ప్రత్యేక మూలికలు, అత్యంత ఖరీదైన ఔషధాల పేరుతో బాధితుడి నుంచి దశలవారీగా డబ్బు వసూలు చేశాడు. "చికిత్స పూర్తి కావాలంటే ఇంకాస్త ఔషధం కావాలి" అంటూ బెదిరింపులకు పాల్పడి, టెకీ నుంచి మొత్తం ₹48 లక్షలు దోచుకున్నాడు. దీని పర్యవసానంగా ఈ బూటకపు చికిత్స వల్ల బాధితుడికి తీవ్రమైన కిడ్నీ సమస్యలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

*గురూజీ పరారీ.. కేసు నమోదు

బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ప్రధాన నిందితుడైన గురూజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

* 'సిగ్గు'తో మోసగాళ్లకు లాభం..

ఈ సంఘటన ఒక వ్యక్తికి జరిగిన నష్టం మాత్రమే కాదు.. సమాజంలో నెలకొన్న ఒక పెద్ద సమస్యను సూచిస్తోంది. లైంగిక ఆరోగ్యం గురించి మాట్లాడటానికి జనాలు సంకోచించడం వల్లే, సరైన వైద్య పద్ధతుల కంటే "ఇన్‌స్టంట్ క్యూయర్" , "100% గ్యారెంటీ" అంటూ ప్రచారం చేసే నకిలీ వైద్య కేంద్రాలు పెద్ద మార్కెట్‌గా మారాయి. వీళ్లంతా సరైన లైసెన్స్ లేకుండా, వైద్య జ్ఞానం లేకుండా మందులు ఇవ్వడం... మూలికల పేరుతో తెలియని రసాయనాలు కలిపిన మందులు వాడటం... మోసపూరిత ప్రకటనలతో ప్రజలను ఆకర్షించడం చేస్తుంటారు. ఇలాంటి దందాలు ప్రజల ఆరోగ్యానికి దీర్ఘకాలిక నష్టం కలిగిస్తున్నాయి.

* అసలు పరిష్కారం ఇదే

లైంగిక ఆరోగ్య సమస్యలు సహజమైనవే. ఈ విషయంలో సిగ్గుపడకుండా, అర్హత ఉన్న.. రిజిస్టర్ అయిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే శరీరం, డబ్బు, మానసిక ప్రశాంతతకు హాని జరగకుండా చూసుకోవచ్చు. మోసపూరిత ప్రకటనలపై ప్రభుత్వాలు, చట్టం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.



Tags:    

Similar News