లైట్ ఆఫ్ చేయమన్నందుకు మేనేజర్ ను చంపిన టెక్నీషియన్!

ప్రతీ హత్య వెనుక ఒక చిన్న కారణమే ఉంటుంది కాబోలు. ఒక లైటు కోసం జరిగిన వివాదం ఒక ప్రాణాన్ని బలితీసుకుందంటే నమ్ముతారా..? అవును ఇది నిజంగా జరిగింది.;

Update: 2025-11-03 19:30 GMT

ప్రతీ హత్య వెనుక ఒక చిన్న కారణమే ఉంటుంది కాబోలు. ఒక లైటు కోసం జరిగిన వివాదం ఒక ప్రాణాన్ని బలితీసుకుందంటే నమ్ముతారా..? అవును ఇది నిజంగా జరిగింది. బెంగళూరులోని ఒక డిజిటల్ కంపెనీలో జరిగిన ఈ హత్య ప్రస్తుతం కార్యాలయాల్లో పెరుగుతున్న ఒత్తిడి, మానసిక అసమతుల్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఒక క్షణం చీకటిని కోరిన మనిషి.. మరో క్షణంలో శాశ్వత చీకటిలోకి వెళ్లిపోయాడు. ఇది కేవలం ఒక ఆఫీసులో జరిగిన ఘర్షణ కాదు.. మనిషి మనసులో పెరుగుతున్న అసహనానికి ప్రతీక. సాధారణంగా కనిపించే గొడవలు కూడా ఇప్పుడు హింసాత్మక రూపం దాలుస్తున్నాయి. ఒక యుగంలో సాంకేతిక అభివృద్ధి ఎంత వేగంగా సాగుతుందో.. మనసులోని నియంత్రణ అంత వేగంగా తగ్గిపోతున్నట్లుంది.

చిన్న వివాదం.. ఘోర ఫలితం..

లైట్ ఆఫ్ చేయండి అన్న మేనేజర్ భీమేష్ బాబు (41) మాటతో టెక్నీషియన్ సోమల వంశీ (24) అసహనానికి గురయ్యాడు. వారిద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో వంశీ భీమేష్ బాబు కంట్లో కారంపొడి చల్లి. జిమ్ డంబెల్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో మేనేజర్ అక్కడిక్కడే చనిపోయాడు. హత్య తర్వాత వంశీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఒక మనిషి మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టంగా మారుతోంది.

చిన్న తేడా, ఒక అభిప్రాయం, ఒక మాట ఇప్పుడు ఒకరి ప్రాణాన్ని తీసింది. ఉద్యోగస్థలాల్లో హైపర్ కంపిటిషన్‌, సెక్యూరిటీ కోల్పోతామన్న భయం.. తగిన గుర్తింపు రాకపోవడం వంటి అంశాలు వ్యక్తిలను కోపంతో ఉరకలెత్తిస్తాయి. ఈ కేసు నియంత్రణ కోల్పోయిన మనసు ఎలా మారుతుందో చూపిస్తుంది.

ఆఫీసు వాతావరణం..

ప్రస్తుతం ఉద్యోగాల్లో పని కంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు రాత్రి షిఫ్టులు, స్మార్ట్‌ఫోన్ల వాడకం, నిద్రలేమి ఇవన్నీ కలిసి మనసును మరింత మలినం చేస్తున్నాయి. ఒక చిన్న తేడా.. ఒక పదం.. ఒక చూపు కూడా అసహనానికి దారి తీస్తోంది. వంశీ చేసిన దాడి ఒక్కసారిగా జరిగినా.. దానికి పునాది వారంగా మానసిక ఒత్తిడిలో ఉండి ఉండొచ్చు. కంపెనీలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాయి, కానీ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నాయి.

పని ప్రదేశం అనేది కేవలం ప్రొడక్టివిటీ కోసం కాదు. అది మానవ సంబంధాలు పెంచే స్థలం కూడా కావాలి. పెరుగుతున్న పని ఒత్తిడి ఇప్పుడు స్నేహం కన్నా సైలెన్స్‌ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతీ ఒక్కరూ తమ స్క్రీన్‌లలో, తమ ఫైల్స్‌లో మునిగిపోతున్నారు. మానవ కాంటాక్ట్ తగ్గిన చోట మానసిక క్షీణత పెరుగుతుంది. ఈ వాస్తవం ఇప్పుడు ప్రతీ ఆఫీసులో కనిపిస్తోంది.

సహనానికి కూడా స్కిల్‌ కావాలి

ఈ ఘటనపై ప్రతి సంస్థ.. ప్రతి ఉద్యోగి ఆలోచించాలి పనిలో తేడా రావచ్చు, అభిప్రాయాలు భిన్నంగా ఉండవచ్చు.. కానీ జీవితంకు మించినది కాదు. కంపెనీలలో మానసిక అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్, సహచరుల మధ్య కమ్యూనికేషన్ వర్క్‌షాప్‌లు ఉండాలి. ఒక మేనేజర్‌, ఒక టెక్నీషియన్ ఇద్దరూ ఒకే స్థలంలో పనిచేసి, ఒకరిని మరొకరు శత్రువులుగా మార్చిన కారణం ఏంటి? మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News