దారుణం... కారు సైడ్ మిర్రర్ విలువ ఓ మనిషి ప్రాణమా..!
రోజు రోజుకీ మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతుందా.. లేక మనిషిలో మానవత్వం తాలూకు ఛాయలు కనుమరుగైపోతున్నాయా అనేది ఇప్పుడు అత్యంత తీవ్ర చర్చనీయాంశమైన విషయంగా మారిందని చెప్పినా అతిశయోక్తి కాదేమో.;
రోజు రోజుకీ మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతుందా.. లేక మనిషిలో మానవత్వం తాలూకు ఛాయలు కనుమరుగైపోతున్నాయా అనేది ఇప్పుడు అత్యంత తీవ్ర చర్చనీయాంశమైన విషయంగా మారిందని చెప్పినా అతిశయోక్తి కాదేమో. తాజాగా జరిగిన ఘటన ఈ వాదనను మరింత పెంచుతుంది. కారు మిర్రర్ పగిలిందనే కారణంతో నిండు ప్రాణాలు పోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును... క్షణికావేశమో.. లేక, అహంకారమో.. అదీగాక, సాటి మనుషులపై ఏమాత్రం జాలీ దయా లేని తత్వమో తెలియదు కానీ.. తమ కారు సైడ్ మిర్రర్ కు బైకు తగిలిందనే కారణంతో ఓ యువకుడిని వెంటాడి, వెంటాడి, తమ కారుతో గుద్ది ఆ యువకుడి మరణానికి కారణమైన బెంగళూరులోని ఓ జంట విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... ఈ నెల 22న అర్ధరాత్రి దర్శన్ అనే వ్యక్తి తన స్నేహితుడు వరుణ్ తో కలిసి బైకుపై వెళ్తున్నారు. అదే సమయంలో పక్కగా వెళుతున్న కారు సైడు మిర్రర్ కు వీరి బైకు తగిలింది. దీంతో కారులో ఉన్న మనోజ్ కుమార్, ఆయన భార్య ఆరతి శర్మ.. దర్శన్ తో గొడవ పడ్డారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బైకును దంపతులు కారులో రెండు కి.మీ మేర వెంబడించి ఢీ కొట్టి వెళ్లిపోయారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్ లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన దర్శన్... ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే మరణించగా.. ప్రస్తుతం వరుణ్ చికిత్స పొందుతున్నారు! ఈ క్రమంలో.. బాధితుల కుటుంబ సభ్యులా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
జంటను అరెస్ట్ చేసిన పోలీసులు!:
ఓ వ్యక్తిని కావాలనే ఢీకొట్టి, దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారనే ఆరోపణలపై బెంగళూరు సౌత్ పోలీసులు ఓ జంటను ఈ నెల 25న అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి ఈ కేసును మొదట జేపీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేశారు. అయితే, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన ఘటనగా గుర్తించారు!
ఈ సందర్భంగా స్పందించిన సౌత్ డీసీపీ లోకేష్ జగలసూర్... దర్శన్ బైక్, కారును ఢీకొట్టి.. దాని సైడ్ మిర్రర్ పగిలిపోవడంతో కొద్ది క్షణాల ముందు గొడవ ప్రారంభమైందని తెలిపారు. ఈ సంఘటనతో కోపంగా ఉన్న డ్రైవర్ తన వాహనాన్ని వెనక్కి తిప్పి, ద్విచక్ర వాహనాన్ని వెంబడించి, ఉద్దేశపూర్వకంగా వెనుక నుండి ఢీకొట్టారని తెలిపారు.
ఈ ఘటనలోని నిందితులను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మనోజ్ శర్మ, అతని భార్య ఆర్తిగా గుర్తించారు! ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలో విరిగిన కారు భాగాలను సేకరించడానికి ముఖానికి ముసుగులు ధరించి సంఘటనా స్థలానికి తిరిగి వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసును భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద హత్యగా తిరిగి రాశారు!
దీనిపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కారు సైడ్ మిర్రర్ పగిలినంత మాత్రాన్న, ఈ స్థాయిలో కక్ష గట్టి ఓ మనిషి నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఏమాత్రం క్షమించరాని చర్య అని అంటున్నారు!