మెంటార్ ధోనీ.. అదే నిజ‌మైతే బీసీసీఐకి మెంట‌ల్ ఎక్కింద‌నుకోవాలి

ఈ డ‌బ్బున్న‌వాళ్లంతా బాగా తెలివైన వాళ్లు అనుకుంటాం.. కానీ, అదృష్టవంతులు అంతే..! సినిమాల్లో బాగా పాపుల‌ర్ డైలాగ్ ఇది.;

Update: 2025-08-30 23:30 GMT

ఈ డ‌బ్బున్న‌వాళ్లంతా బాగా తెలివైన వాళ్లు అనుకుంటాం.. కానీ, అదృష్టవంతులు అంతే..! సినిమాల్లో బాగా పాపుల‌ర్ డైలాగ్ ఇది. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విష‌యంలో ఇది నిజ‌మే అనుకోవాలేమో...? ఎందుకంటే... ఆ సంస్థ తీసుకునే నిర్ణ‌యాలు అలా ఉంటున్నాయి మ‌రి...? ఇటీవ‌లి ఆసియా క‌ప్ న‌కు టీమ్ ఇండియా ఎంపిక‌నే తీసుకుంటే టెస్టు కెప్టెన్ శుబ్ మ‌న్ గిల్ ను తీసుకొచ్చి వైఎస్ కెప్టెన్ చేశారు. అంత‌కుముందు వైస్ కెప్టెన్ గా ఉన్న అక్ష‌ర్ ప‌టేల్ ను ఎందుకు త‌ప్పించారో తెలియ‌దు. దీనికిముందు కెప్టెన్సీ నుంచి ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాను త‌ప్పించి అనూహ్యంగా 360 డిగ్రీస్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ కు అవ‌కాశం ఇచ్చారు. హార్దిక్ ను క‌నీసం వైస్ కెప్టెన్ గానూ కొన‌సాగించ‌లేదు. గ‌త ఏడాది స‌రిగ్గా ఇదే స‌మయంలో జింబాబ్వేతో టి20 సిరీస్ కు గిల్ ను కెప్టెన్ చేశారు. తాజాగా ఇలాంటి ఓ అసంబ‌ద్ధ ఆలోచ‌నే చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గంభీర్ ఉండ‌గానే...

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, దిగ్గ‌జ ఆట‌గాడు మ‌హేంద్ర‌ సింగ్ ధోనీని జ‌ట్టు మెంటార్ గా నియ‌మించాల‌ని బీసీసీఐ భావిస్తోంద‌ట‌. సుదీర్ఘ కాలం ఈ సేవ‌లను కొన‌సాగించే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. 2021 టి20 ప్ర‌పంచ క‌ప్ కు ధోనీని ఇలాగే మెంటార్ గా నియ‌మించారు. కానీ, ఆ ప్ర‌యోగం మ‌ళ్లీ కొన‌సాగించ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ ధోనీని అదే బాధ్య‌త‌ల్లో చూడాల‌ని భావిస్తోంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీనికి ధోనీ అంగీకారం ఉందో లేదో తెలియ‌దు కానీ.. జాతీయ మీడియాలో మాత్రం ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. ఇక్క‌డ స‌మ‌స్య ఏమంటే.. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌత‌మ్ గంభీర్ ఉండ‌గానే మెంటార్ గా ధోనీని తీసుకురావ‌డం ఏమిట‌ని..?

అత‌డు ఒప్పుకొంటాడా..??

గంభీర్, ధోనీ స‌మ‌కాలీకులు. ఒకేసారి టీమ్ ఇండియాలోకి వ‌చ్చారు. ధోనీ 2019 లో రిటైర‌వ‌గా, 2017లోనే గంభీర్ కెరీర్ ముగిసింది. దీనికి చాలా ముందే గంభీర్ ఫామ్ కోల్పోయాడు. జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. గంభీర్ టీమ్ ఇండియాకు హెడ్ కోచ్ కాగా, ధోనీ మాత్రం ఐపీఎల్ లో కొన‌సాగుతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో ధోనీని తెచ్చి త‌నకు పోటీనా అన్న‌ట్లు పెడితే గంభీర్ స‌హిస్తాడా? అన్న‌ది చూడాలి. గంభీర్ చాలా ముక్కుసూటి మ‌నిషి. దీనికితోడు ధోనీతో అత‌డికి అంత గొప్ప సంబంధాలు అయితే లేవు.

2007 టి20, 2011 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ల‌లో ధోనీ సార‌థ్యంలోనే ఆడాడు గంభీర్. రెండు టోర్నీల‌ ఫైన‌ల్స్ లో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. కానీ, క్రెడిట్ ధోనీకి వెళ్లింద‌నేది గంభీర్ భావ‌న‌గా ఉంది. స్వ‌త‌హాగా కెప్టెన్ అయినందున ధోనీకి పేరు రావ‌డం స‌హ‌జ‌మే. ఇదే విష‌యాన్ని గంభీర్ ప‌లుసార్లు బ‌హిరంగంగానే చెప్పాడు. ఇప్పుడు తాజాగా ధోనీని తెచ్చి మెంటార్ గా పెట్ట‌డం అంటే త‌న సామ‌ర్థ్యాన్ని త‌క్కువ చేయ‌డ‌మే అని భావిస్తాడు. క‌లిసిన‌ప్పుడు న‌వ్వుతూ మాట్లాడుత‌కోవ‌డం త‌ప్ప వ్య‌క్తిగ‌తంగా పెద్ద‌గా స‌త్సంబంధాలు లేని ధోనీని త‌న‌కు పోటీగా పెడ‌తానంటే గంభీర్ స‌హించ‌డు. అస‌లు బీసీసీఐ ఉద్దేశం ఏమిటో?

Tags:    

Similar News