సైన్యం చేతుల్లోకి బంగ్లాదేశ్..? భారత్ కు మేలా? గుబులా?
గత ఏడాది ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవిని వదిలేసి భారత్ కు వచ్చేశారు.;
ఇప్పటికే పొరుగున ఉన్న పాకిస్థాన్ లో సైన్యం చెప్పిందే వేదం.. ప్రజా ప్రభుత్వం ఉన్నా అది కేవలం సైన్యం చేతిలో కీలుబొమ్మ. ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న మయన్మార్ లోనూ సైనిక రాజ్యమే నడుస్తోంది. వీటికితోడు బంగ్లాదేశ్ కూడా సైన్యం చేతుల్లోకి వెళ్లనుంది అనే కథనాలు వస్తున్నాయి.
గత ఏడాది ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవిని వదిలేసి భారత్ కు వచ్చేశారు. అప్పటినుంచి బంగ్లాలో నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. భారత్ కు పచ్చి వ్యతిరేకి అయిన యూసన్.. గత 9 నెలల్లో దానిని ఎక్కడా దాచుకోలేదు. హసీనాను అప్పగించాలి అనే దగ్గరి నుంచి ఈశాన్య రాష్ట్రాలపై వ్యాఖ్యల దాకా యూనస్ చేయాల్సిన బ్యాడ్ అంతా చేసేశారు. చైనా, పాకిస్థాన్ లతో అంటకాగుతున్నారు.
తాజాగా వస్తున్న కథనాల ప్రకారం బంగ్లాదేశ్ లో పాలనా పగ్గాలను ఆర్మీ చేతుల్లోకి తీసుకోనుందట. యూనస్ రాజీనామా చేస్తారట. ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ దేశ పాలన వెళ్లనుందని చెబుతున్నారు. యూనస్ తో వకార్ కు విభేదాలు ముదిరాయని.. యూనస్ ను సాగనంపడం ఖాయమని పేర్కొంటున్నారు.
హసీనాకు చుట్టమే..
వకార్ జమాన్.. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చుట్టమే. కాగా, యూనస్.. సంకీర్ణ కూటమిలోని పార్టీలు ఒక్క మాట మీద నిలవకపోవడంతో తాను ప్రభుత్వాన్ని నడపలేనని యూనస్ రాజీనామాకు సిద్ధపడుతున్నారట. దీంతో ఆర్మీ చీఫ్ వకార్ బాధ్యతలు చేపడతారని కథనాలు వస్తున్నాయి. వకార్.. హసీనా హయాంలో గత ఏడాది జూన్ 23న ఆర్మీ చీఫ్ అయ్యారు. 19 ఏళ్లకే సైన్యంలో చేరిన ఆయన 40 ఏళ్లుగా కొనసాగుతున్నారు. బంగ్లా ఆర్మీలో అంచలంచెలుగా ఎదిగారు. సైన్యాన్ని ఆధునికీకరించారు. దీంతో మూడేళ్ల పదవీ కాలంతో గత ఏడాది అతడిని ఆర్మీ చీఫ్ గా నియమించారు హసీనా. కానీ, కొద్ది రోజులకే దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు తీవ్రం అయ్యాయి. వాటిని అణచివేయలేకపోయారు. చివరకు హసీనాకే వకార్ అల్టిమేటం ఇచ్చారు. ఇక వకార్.. బంగ్లాదేశ్ మాజీ ఆర్మీ చీఫ్ ముస్తఫిజుర్ రెహమాన్ కు అల్లుడు. రెహమాన్ షేక్ హసీనాకు వరసకు మామ. ఈ లెక్కన వకార్... షేక్ హసీనాకు సోదరుడి వరస.
బంగ్లాలో 2009లో జరిగిన ఘర్షణల్లో 57 మంది ఆర్మీ అధికారులు, 16 మంది హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో కోర్టు 300 మందిని దోషిగా తేల్చింది. కానీ, యూనస్ సర్కార్ వారిని విడుదల చేసింది. ఇది సైన్యానికి నచ్చలేదు. దేశంలో ఎన్నికలు ఆలస్యం కావడం వకార్-యూనస్ మధ్ విభేదాలకు దారితీసింది. రోహింగ్యా ముస్లింల సమస్య ఉన్న మయన్మార్ సరిహద్దులో మానవతా కారిడార్ ఏర్పాటుకు యూనస్ ఆమోదం కూడా ఆర్మీకి నచ్చలేదు. సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై అమెరికా పెత్తనాన్ని హసీనా వ్యతిరేకించారు. యూనస్, జమాన్ మధ్య వివాదానికి కూడా ఈ ద్వీపమూ ఓ కారణంగా కనిపిస్తోంది.
కాగా, పాక్ ను ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ తో దెబ్బకొట్టిన భారత్.. బంగ్లాదేశ్ పెద్ద లెక్క కాదు. మన పేరు చెబితేనే బెంబేలెత్తే దేశం అది. అయితే, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది.