`బాలయ్య` కోరిక తీర్చనున్న చంద్రబాబు!
టీడీపీ ఎమ్మెల్యే, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ కోరికను తీర్చే దిశగా సీఎం చంద్ర బాబు అడుగులు వేస్తున్నారా?;
టీడీపీ ఎమ్మెల్యే, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ కోరికను తీర్చే దిశగా సీఎం చంద్ర బాబు అడుగులు వేస్తున్నారా? అదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల డిమాండ్లను పరిష్కరిం చేందుకు ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని.. మరికొన్ని నియోజకవర్గాలతో కలిపి(కదిరి, ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి, మడకశిర(ఎస్సీ)) ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అయితే.. వైసీపీ హయాంలో జగన్.. ఈ జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గం పరిధిని ఆధా రంగా చేసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దీనిపై అధ్యయనం కూడా చేయించారు. అయితే.. అరకు పార్లమెంటు స్థానం విస్తారంగా ఉండడం.. సుదూర ప్రాంతాలు కూడా దీనిలో కలిసి ఉండడంతో ఈ నియోజకవర్గాన్ని రెండుగా విభజించారు. దీంతో మొత్తంగా 26 జిల్లాలు ఏర్పడ్డాయి.
కానీ.. కొత్త జిల్లాలకు పేర్లు పెట్టడంలోనూ.. జిల్లాల పరిధిలు నిర్ణయించడంలోనూ.. జగన్ ప్రభుత్వం ప్రజ ల విజ్ఞప్తులను పట్టించుకోలేదన్న వాదన ఉంది. ఇదే కోనసీమ జిల్లాలో కాష్ఠాన్ని రగిలించింది. హిందూపు రం, రాజంపేటల్లోనూ.. తీవ్ర రాజకీయ వివాదాలకు దారితీసింది. ఆ సమయంలోనే చంద్రబాబు.. ప్రజల విజ్ఞప్తుల మేరకు.. వారి కోరిక మేరకు తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఈ వ్యవహారంపై ప్రభుత్వం పని ప్రారంభించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టనున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ నాటికి... జిల్లాలు, మండలాల సరిహద్దులను మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు ఇటీవల తేల్చి చెప్పింది. మళ్లీ.. 2028 వరకు ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలకు పెంచే దిశగా ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఆగస్టు రెండో వారంలోనే దీనిపై గెజిట్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.