‘ఆ సైకో గాడు’ అసెంబ్లీలో దుమారం రేపిన బాలయ్య..

అసెంబ్లీ చర్చల్లో పెద్దగా కల్పించుకోని ఎమ్మెల్యే బాలయ్య.. ఈ రోజు మాత్రం విశ్వరూపం ప్రదర్శించారు.;

Update: 2025-09-25 11:31 GMT

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో సింహ గర్జన చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని సినీ ప్రముఖులు కలిసిన అంశం గురువారం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గుర్తు చేశారు. అదే సమయంలో అప్పటి ప్రభుత్వం పెద్దలు ముందుగా సినీ ప్రముఖులతో సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడతారని చెప్పారని, కానీ మెగాస్టార్ చిరంజీవి గట్టిగా మాట్లాడితే సీఎం దిగివచ్చి వారిని కలిసినట్లు చెప్పారు. అయితే ఈ అంశంపై జోక్యం చేసుకున్న బాలయ్య.. ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

అసెంబ్లీ చర్చల్లో పెద్దగా కల్పించుకోని ఎమ్మెల్యే బాలయ్య.. ఈ రోజు మాత్రం విశ్వరూపం ప్రదర్శించారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అప్పటి ముఖ్యమంత్రితో ఎవరూ గట్టిగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆ సైకో గాడు’ అంటూ తీవ్ర పదజాలం వాడారు. అంతేకాకుండా అప్పట్లో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందన్న విషయం మాత్రం నిజమని స్పష్టం చేశారు. తనను కూడా రమ్మని పిలిచినా తాను వెళ్లలేదని వెల్లడించారు.

ఇక కూటమి ప్రభుత్వంలో ఫిలిండెవలప్మెంట్ కార్పొరేషన్ నియామకం విషయంలో లిస్టు తయారు చేస్తే తనది 9వ పేరు వేశారని, వెంటనే తాను సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్ తో మాట్లాడి ‘ఎవడాడు ఇలా రాసిందని ఆ రోజే తాను అడిగా’నంటూ చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి స్పష్టత ఇవ్వాలనే తాను ఈ అంశంపై స్పందించానని బాలకృష్ణ వెల్లడించారు. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించిండంటూ సభను కోరారు.

కాగా, అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశం అవుతోంది. అంతేకాకుండా సహచర బీజేపీ ఎమ్మెల్యే సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను సభలోనే అప్పటికప్పుడు బాలయ్య ఖండించడంపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. చిరంజీవికి అవమానం జరిగినంతవరకు ఏకీభవిస్తున్నానని చెప్పిన బాలయ్య.. ఆ రోజు ఆయన గట్టిగా మాట్లాడలేదన్న విషయాన్ని ఎత్తిచూపడం గమనార్హం.

గత ప్రభుత్వంలో సినిమా టికెట్ల ధరలు పెంచే విషయంలో సినీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని కలిశారు. అప్పట్లో సీఎం ఇంటి గేటు బయటే వారిని కారు దింపి నడిపించడంతోపాటు చిరంజీవి చేతులు జోడించి మాట్లాడుతూ జగన్మోహనరెడ్డిని ప్రాధేయపడుతున్నట్లు చూపుతూ వీడియోలు విడుదల చేశారు. అప్పట్లో ఆ వీడియోలు తెగ వైరల్ కాగా, సినీ ప్రముఖులను అవమానించేలా వ్యవహరించారని గత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. నాటి ఘటనపై అసెంబ్లీలో మరో మారు చర్చ జరగగా, చిరంజీవి గట్టిగా మాట్లాడరని బీజేపీ ఎమ్మెల్యే కామినేని చెబితే.. ఆ వెంటనే బాలయ్య కల్పించుకుని గట్టిగా ఎవరూ మాట్లాడలేదని కుండబద్దలు కొట్టారు.



Tags:    

Similar News