అమరావతిలో తొలి నిర్మాణం బాలయ్యదేనా !
అమరావతిలో నందమూరి బాలకృష్ణ తొలి అడుగు వేస్తున్నారు. ఆయన చైర్మన్ గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏపీలో కూడా విస్తరించాలని నిర్ణయించారు.;
అమరావతి రాజధాని శరవేగంగా నిర్మించి తొలి దశ పనులను 2028 నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అదే విధంగా అమరావతి రాజధాని కోసం వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇతర సంస్థలు కూడా ఇదే వేగంతో నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం కోరుతోంది. అంతే కాదు భారీ ఎత్తున భూములను పారిశ్రామికవేత్తలకు వివిధ రంగాలకు కేటాయించారు. వారు కూడా అమరావతి రాజధానిని ఒక రూపునకు తీసుకుని వచ్చేందుకు సహకరించాలని కోరుతున్నారు.
బాలయ్య మొదటి అడుగు :
అమరావతిలో నందమూరి బాలకృష్ణ తొలి అడుగు వేస్తున్నారు. ఆయన చైర్మన్ గా ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏపీలో కూడా విస్తరించాలని నిర్ణయించారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 21 ఎకరాలను కేటాయించింది. విశాలమైన ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేలా అద్భుతమైన ఆసుపత్రిని నిర్మించాలని బాలయ్య తలపెట్టారు. ఇటీవల ఆయన తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వేగాన్ని అందుకోవాలని అధికారులకు ఈ సందర్భంగా బాలయ్య సూచించారు.
మంచి ముహూర్తంలో :
శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకుని బాలయ్య బసవతారకం ఆసుపత్రి నిర్మాణం పనులు ప్రారంభించనున్నారు. ఈ నెల 13న అంటే బుధవారం బాలయ్య తన సతీమణితో కలిసి ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేస్తారు అని అంటున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా పాల్గొంటారు అని అంటున్నారు. అదే విధంగా కీలక మంత్రులు నారా లోకేష్ తో పాటుగా హాజరవుతారని చెబుతున్నారు.
రెండేళ్ళ వ్యవధిలో :
ఏపీలో బసవతారకం ఆసుపత్రిని శరవేగంగా నిర్మించాలని భాలయ్య ఆలోచిస్తున్నారు. రెండేళ్ళ వ్యవధిలో అందరికీ అందుబాటులోకి తీసుకుని రావాలని కృత నిశ్చయంతో ఉన్నారని చెబుతున్నారు. మూడు దశలలో ఈ నిర్మాణం సాగుతుందని చెబుతున్నారు. ఇక దాతలు ఇతర పెద్దల సహకారంతోనే ఈ ఆసుపత్రి నిర్మాణానికి నిధుల సేకరణ జరుగుతోందని చెబుతున్నారు.
మిగిలిన వారికి స్పూర్తి :
అమరావతి రాజధానిలో ఒక ప్రైవేటు కార్పోరేట్ సంస్థ పెద్ద ఎత్తున నిర్మాణానికి తలపెట్టడం శుభ సూచకంగా చెబుతున్నారు. ఈ విధంగా చూస్తే కనుక బాలయ్యే ఆ ప్రయత్నానికి అంకురార్పణ చేశారు అని అంటున్నారు. పదుల సంఖ్యలో ఎంతో మందికి భూములను ఇచ్చారు. వారు కూడా తమ వంతుగా ముందుకు రావడానికి ఈ ప్రయత్నం దోహదపడుతుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అమరావతి రాజధాని కోసం తపన పడుతున్న బాబుకు బాలయ్య కూడా భుజం కాస్తున్నారు అని అంటున్నారు.